ప్రభాత ఉదయం, ఆర్మూర్/బాల్కొండ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని ఓ బ్యాంక్ ఏటీఎంలో బుధవారం తెల్లవారుజామున దొంగలు చోరీకి యత్నించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని మహాలక్ష్మీ కాలనీ మెయిన్ రోడ్డులో ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం గదిలోకి మాస్క్‌లు ధరించిన ఇద్దరు దుండగులు చొరబడ్డారు. ఇనుప రాడ్లతో ఏటీఎంను ధ్వంసం చేసినా క్యాష్ బాక్స్ తెరుచుకోకపోవడంతో అక్కడి నుంచి పరారయ్యారు. బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్ఐ రజనీకాంత్‌తో కలిసి ఏటీఎంను సందర్శించి సీసీ ఫుటేజీని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.
‘ఇండియన్ వన్’ ఏటీఎంలో నకిలీ నోటు..
నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణంలో నకిలీ రూ.500 నోటు కలకలం రేపింది. బడాభీంగల్‌కు చెందిన ధరణి.. ముచ్కూర్ చౌరస్తాలోని ఇండియన్ వన్ ఏటీఎం నుంచి రూ.24 వేలు డ్రా చేశారు. అందులో నకిలీ రూ.500 నోటు రావడంతో అవాక్కై, ఏటీఎం నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నకిలీ నోటు విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.