ప్రభాత ఉదయం, జగిత్యాల ప్రతినిధి: రైతులకు అందించాల్సిన పరిహారం విషయంలో కోర్టు ఆదేశాలను అమలు చేయని ఆర్డీవో కార్యాలయం జప్తునకు ఇటీవల న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కార్యాలయం జప్తునకు వెళ్లిన కోర్టు ప్రతనిధులకు అక్కడ వస్తు సామగ్రి లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. పాతికేళ్లుగా ఎదురుచూస్తున్నా పరిహారం అందకపోవడం, కార్యాలయంలో వస్తువులు మాయమవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న లింగంపేటకు చెందిన 200 మందికి పైగా రైతులు శుక్రవారం జగిత్యాల ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు.
ఖాళీగా కార్యాలయం
ఆర్డీవో కార్యాలయానికి సంబంధించిన ఫర్నిచర్, ఇతర వస్తువులను జప్తు చేయాలని ఇటీవల న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కోర్టు ప్రతినిధులు కార్యాలయానికి వెళ్లగా.. ఫర్నిచర్, ఏసీలు, కంప్యూటర్లు తదితర వస్తువులు ఏమీ లేవని సమాచారం. కార్యాలయం దాదాపు ఖాళీగా దర్శనమిచ్చింది. ముందస్తు సమాచారంతోనే వస్తువులను మరో చోటుకు తరలించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
25 ఏళ్లుగా ఎదురుచూపులు
లింగంపేటలో రైల్వేస్టేషన్ నిర్మాణం కోసం సుమారు 25 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం 100 ఎకరాల భూమిని సేకరించింది. అప్పట్లో గుంటకు రూ.5 వేల చొప్పున పరిహారం చెల్లించారు. అది తక్కువగా ఉండటంతో కోర్టును ఆశ్రయించామని సదరు రైతులు పేర్కొన్నారు. న్యాయ పోరాటం అనంతరం పరిహారం పెరిగినా, తమకు రావాల్సిన మొత్తాన్ని నిలిపివేశారని ఆరోపిస్తున్నారు. భూములు కోల్పోయి పరిహారం కోసం పాతికేళ్లుగా ఎదురుచూస్తున్నా న్యాయం జరగడం లేదని, సుమారు రూ.5 కోట్ల పరిహారం పెండింగ్లో ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఆదేశాల అమలు, కార్యాలయంలోని వస్తువుల తరలింపు ఆరోపణలు, పరిహారం నిలిపివేత అంశాలపై అధికారులు స్పందించాల్సి ఉంది.
‘ఎకరం రూ.15 లక్షల విలువ చేసే భూములను రైల్వేస్టేషన్ కోసం ఇచ్చాం. అయినా న్యాయంగా రావాల్సిన పరిహారం పొందేందుకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. న్యాయమైన పరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలి’ అని రైతు చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు.