Telangana Farmers Struggle Fertilizer App Issues 
తెలంగాణ

అన్నదాతలకు యాప్‌‘పాట్లు’!

వానాకాలం పంటల సాగు నుంచి ఎరువుల బుకింగ్‌కు ప్రభుత్వం యాప్‌ను తప్పనిసరి చేయడంతో రైతులకు కష్టాలు మొదలయ్యాయి. స్మార్ట్‌ఫోన్లు లేక, యాప్‌ వినియోగంపై అవగాహన లేకపోవడంతో ఎరువులను సకాలంలో పొందలేకపోతున్నారు.

Ranjith

ప్రభాత ఉదయం, గజ్వేల్: ఓవైపు ప్రకృతి ప్రకోపం.. మరోవైపు విద్యుత్‌ కష్టాలు.. వీటికి తోడు ప్రభుత్వం తీసుకొచ్చిన ఎరువుల యాప్‌తో కొత్త తిప్పలు! వెరసి వరి సాగులో అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. యాప్‌ వినియోగంపై అవగాహన లేకపోవడంతో రెండో విడత యూరియా అందక ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో ఎరువు వేయకపోతే పంట దిగుబడిపై ప్రభావం పడుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు.

నమోదులో తప్పులుంటే..

వానాకాలం పంటల సాగు నుంచి ఎరువుల బుకింగ్‌కు ప్రభుత్వం యాప్‌ను తప్పనిసరి చేయడంతో రైతులకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. స్మార్ట్‌ఫోన్లు లేకపోవడం, యాప్‌ వినియోగంపై అవగాహన లేకపోవడంతో ఎరువులను సకాలంలో పొందలేకపోతున్నారు. ఒక రైతుకు రెండు గ్రామాల్లో సాగు భూములున్నా.. యాప్‌లో ఒక గ్రామం వివరాలే నమోదవుతున్నాయి. భూమి వివరాలు పొరపాటున తప్పుగా నమోదైతే సరిచేసుకునే అవకాశం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలను వ్యవసాయాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించడం లేదని రైతులు వాపోతున్నారు. మరోవైపు, యాప్‌లో ఎరువులు అందుబాటులో ఉన్న దుకాణాన్ని గుర్తించేలోపే స్టాక్‌ అయిపోయిందనే సందేశం వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమస్యలపై వ్యవసాయాధికారి నాగరాజు మాట్లాడుతూ.. ‘‘యాప్‌లో తలెత్తుతున్న సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుంది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో, సరైన ధరలకు ఎరువులు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది’’ అని తెలిపారు.

15 రోజులకు ఒకసారి ఎరువులు

యాప్‌ ద్వారా కేటాయించిన ఎరువులను 15 రోజులకు ఒకసారి మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేటాయించిన బస్తాల కంటే తక్కువ ఎరువులు తీసుకున్నా.. రెండోసారి బుకింగ్‌ చేసుకోవాలంటే పక్షం రోజులు వేచి చూడాల్సి వస్తోంది. మరోవైపు, యూరియా, పొటాష్‌, కాంప్లెక్స్‌ ఎరువులు వేర్వేరు దుకాణాల్లో అందుబాటులో ఉంటే.. యాప్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవడం మరింత కష్టంగా మారుతోంది. దీంతో అవసరమైన ఎరువులన్నీ ఒకేసారి సేకరించలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పారదర్శకమని చెప్పినా..

ఎరువుల బ్లాక్‌ మార్కెట్‌ను అరికట్టి, రైతులకు ప్రభుత్వ నిర్ణయించిన ధరలకే పారదర్శకంగా సరఫరా చేసేందుకు ఫర్టిలైజర్‌ యాప్‌ను తీసుకొచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే, క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు అధిక ధరల భారం తప్పడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాప్‌ ద్వారా ఎరువులు బుక్‌ చేసుకున్న డీలర్లు తమ నుంచి అదనంగా వసూలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. యూరియా బస్తాకు రూ.40–80, కాంప్లెక్స్‌ ఎరువుల బస్తాకు రూ.300–500 వరకు ఎక్కువగా తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై వ్యవసాయాధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని, చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.