ప్రభాత ఉదయం, పాలకుర్తి: గీత కార్మికులు సులువుగా తాటి చెట్టు ఎక్కేలా ఓ రైతు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఇనుప నిచ్చెనల తరహాలో తాటి చెట్లకు మెట్లు ఏర్పాటు చేసి కల్లుగీతను సులభతరం చేస్తున్నాడు. పాలకుర్తి మండలం ఇరవెన్ను గ్రామానికి చెందిన రైతు అనుముల మహేందర్ తనకున్న మూడెకరాల వ్యవసాయ భూమిలో తాటి చెట్లకు కల్లు గీసేందుకు కార్మికులు ముందుకు రాకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించాడు. సుమారు రూ.10 వేల సొంత ఖర్చుతో తాటి చెట్లకు ఇనుప కడ్డీలతో నిచ్చెన తరహాలో ఏర్పాటు చేశాడు. గతంలో చెట్టు ఎక్కేందుకు ఎక్కువ శ్రమ, సమయం అవసరమయ్యేదని, ప్రస్తుతం ఈ విధానం ద్వారా ఐదు నిమిషాల్లోనే కల్లుగీత చేపడుతున్నాడు. సంప్రదాయ వృత్తుల్లో ఎదురవుతున్న ఇబ్బందులకు వినూత్న మార్గాలను అన్వేషించవచ్చని ఈ ప్రయోగం చాటి చెబుతోంది.