ప్రభాత ఉదయం, పరకాల: మరణించిన వారి అంత్యక్రియలు గౌరవప్రదంగా నిర్వహించేందుకు నిర్మించాల్సిన వైకుంఠధామం.. ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. నిధులు మంజూరయ్యాయి.. నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.. కానీ, ఎనిమిదేళ్లు గడుస్తున్నా ప్రాజెక్టు మాత్రం పూర్తి కాలేదు. దీంతో అంత్యక్రియల కోసం పరకాల పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ స్థలంలో చేపట్టిన ఈ నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో ప్రజాధనం వృథా అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పరకాల పట్టణంలోని భూపాలపల్లి జాతీయ రహదారి పక్కన చలివాగు సమీపంలో ప్రభుత్వ స్థలంలో వైకుంఠధామం నిర్మాణాన్ని చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.కోటి నిధులతో అత్యాధునిక సౌకర్యాలతో దీనిని నిర్మించాలని నిర్ణయించారు. అయితే, పనులు ప్రారంభమైనప్పటికీ కాంట్రాక్టర్ నిర్మాణాన్ని పూర్తి చేయకుండానే మధ్యలో వదిలేసినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో అందుబాటులోకి రావాల్సిన వైకుంఠధామం ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉండిపోయింది.
పరకాల పట్టణ జనాభా సుమారు 30 వేలకు చేరుకుంది. ఇంతటి జనాభా ఉన్న పట్టణంలో మృతుల దహన సంస్కారాలకు తగిన సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు శివముక్తిధామంలో అంత్యక్రియలు నిర్వహించాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యుడిని కోల్పోయిన బాధలో ఉన్నవారికి ఈ అదనపు ఖర్చు భారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైకుంఠధామం నిర్మాణం పూర్తయి ఉంటే ఈ సమస్యకు కొంతవరకు పరిష్కారం లభించేదని అంటున్నారు.
ప్రజల అవసరాల కోసం నిర్మించిన వైకుంఠధామం గదులు ప్రస్తుతం నిరుపయోగంగా ఉండటంతో మందుబాబులకు అడ్డాగా మారాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పరిసరాల్లో పిచ్చిమొక్కలు, చెట్ల పొదలు పెరిగి ప్రాంతమంతా అపరిశుభ్రంగా మారిందని చెబుతున్నారు. నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకం సైతం చెట్ల పొదల్లో కనిపించకుండా పోయిందని పేర్కొంటున్నారు. ప్రజలకు ఉపయోగపడాల్సిన నిర్మాణం ఇలా నిర్లక్ష్యానికి గురికావడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి నిలిచిపోయిన పనులను పూర్తి చేయాలని కోరుతున్నారు. పట్టణ ప్రజల అవసరాలను గుర్తించి వైకుంఠధామాన్ని త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.