ప్రభాత ఉదయం, హుజూరాబాద్: మహారాష్ట్రకు పార్థీ గ్యాంగ్ పేరు వింటేనే జనం గుండెల్లో గుబులు రేగుతుంది. ముఠా రైల్వేమార్గంలోని పట్టణాల్లో దోపిడీలకు పాల్పడటమే ఈ ముఠా లక్ష్యం. ప్రస్తుతం మహారాష్ట్రలో నెలకొన్న కరువు నేపథ్యంలో ఈ గ్యాంగ్ మన రాష్ట్రంలో దోపిడీలకు పాల్పడే అవకాశం ఉందని ప్రజల నుంచి భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
నాగపూర్ కేంద్రంగా..
మహారాష్ట్రకు చెందిన ‘పార్థీ గ్యాంగ్’ నాగపూర్ కేంద్రంగా ఏళ్ల తరబడి దొంగతనాలు సాగిస్తోంది. చోరీ సమయంలో ఎవరైనా అడ్డొస్తే అంతం చేయడం, పక్కా పథకంతో పారిపోవడంలో ఈ గ్యాంగ్ ఆరితేరింది. ప్రధానంగా రైల్వే మార్గంలోని బస్తీలనే చోరీలకు ఎంచుకోవడం ఈ ముఠా ప్రత్యేకత. నాగపూర్ నుంచి ప్యాసింజర్ రైళ్లలో బయలుదేరి, వారు ఎంచుకున్న ప్రాంతంలో దిగుతారు. వీధుల్లో యాచకుల్లా, చిరు వ్యాపారుల్లా సంచరిస్తూ తాళం వేసిన ఇళ్లను గుర్తిస్తారు. అనువైన సమయం చూసుకొని కొల్లగొడతారు.
జమ్మికుంటలో..
2003 జూన్‌లో జమ్మికుంట మండలం మల్లన్నపల్లిలో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిపై దాడిచేసి నగదును దోచుకెళ్లారు. 2009 అక్టోబర్‌లో జమ్మికుంటలోని 11 దుకాణాలను ఏకకాలంలో కొల్లగొట్టారు. రైల్లో నాగపూర్ పారిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. అలాగే మంచిర్యాల, కాజీపేట, వరంగల్, జనగాం, భువనగిరిలో ఈ గ్యాంగ్ దోపిడీలకు పాల్పంది. ‘‘2009లో నా ఎలక్ట్రానిక్స్ షాపులో దొంగలు పడ్డారు. పటిష్టంగా ఉన్న షెటర్ బద్దలు కొట్టి కొన్ని వస్తువులు, రూ.18 వేల నగదు ఎత్తుకెళ్లారు. పక్కనున్న రెండు దుకాణాల్లోనూ ఇదే తరహాలో దొంగతనం చేశారు.’’ అని జమ్మికుంటకు చెందిన యాళ్ల సంపత్‌రెడ్డి వాపోయారు.
అప్రమత్తత అవసరం
మహారాష్ట్రలో ఎప్పుడు కరువు వచ్చినా పార్థీ ముఠా తెలంగాణపై పడుతుంటారు. ప్రస్తుతం కరువు నెలకొనడంతో ఇక్కడ దొంగతనాలకు పాల్పడే ప్రమాదం ఉందని ప్రజలు భయపడుతున్నారు. గతంలో పోలీసులు ప్రయత్నించినా దుండగులు చిక్కలేదు. ‘‘గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. పట్టణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. అన్ని ఠాణాల పరిధిలో గస్తీ తీవ్రతరం చేశాం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి.’’ అని హుజూరాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి సూచించారు.