పెద్దపల్లి జిల్లాలో హైలెవల్ బ్రిడ్జీ(Peddapalli Bridges)లను ఎవరూ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బ్రిడ్జీల మీద గుంతలు ఏర్పడి పెచ్చులూడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల స్లాబ్ మధ్య ఉన్న గ్యాపుల్లో సిమెంటు ఊడిపోయింది. ఇసుక, చెత్త పేరుకుపోయి.. వర్షం పడితే నీరు నిలుస్తున్నది. కానీ మెయింటెనెన్స్ చేయాల్సిన కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
25 బ్రిడ్జీలపై ఇదే పరిస్థితి
Peddapalli జిల్లా వ్యాప్తంగా మానేరు(Maneru River), హుస్సేన్మియా వాగుపై 25 బ్రిడ్జీలు ఉన్నాయి. బ్రిడ్జీల నిర్మాణం జరిగిన నాటి నుంచి మూడు, నాలుగేళ్లకోసారి కాంట్రాక్టర్లు రిపేర్లు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత బాధ్యత సంబంధిత అధికారులదే. కానీ ఈ మరమ్మతు పనులను ఎవరూ పట్టించుకోవడం లేదు. సుల్తానాబాద్, పెద్దపల్లి, ముత్తారం, జూలపల్లి, మంథని మండలాల్లో రిపేర్లు చేయాల్సిన బ్రిడ్జీలు చాలా ఉన్నాయి.
నామమాత్రపు మరమ్మతు
కొన్ని చోట్ల బ్రిడ్జీలకు పూర్తిస్థాయి మరమ్మతులు చేయాల్సి ఉండగా నామమాత్రంగా ప్యాచ్ వర్క్ చేసి వదిలేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్దపల్లి మండలంలోని మూలసాల బ్రిడ్జీ, కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గంగారం వద్ద ఉన్న బ్రిడ్జీని మరమ్మతు చేయాల్సి ఉందని స్థానికులు చెబుతున్నారు. మొట్లపల్లి వద్ద ఉన్న బ్రిడ్జీ శిథిలావస్థకు చేరుకున్నది. భోజన్నపేట కల్వర్టు ధ్వంసమైంది. అక్కడ మరో బ్రిడ్జీ నిర్మించాల్సి ఉంది. ఈ పనులన్నీ అధికారులు వెంటనే పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.