తెలంగాణ

అభివృద్ధికి ’’మార్గం‘‘

రైల్వే, రోడ్డు మార్గాల విస్తరణతో ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా పెద్దపల్లి

Ranjith

ప్రభాత ఉదయం, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా సెంట్రిక్​గా రైల్వే, రోడ్డు మార్గాలు మరింత విస్తృతం కానున్నాయి. ఇప్పటికే రామగుండం-రాఘవాపూర్​ రైల్వే స్టేషన్​ మీదుగా నాలుగు జిల్లాలను కలుపుతూ  207 కిలో మీటర్ల మేర చేపట్టిన కోల్​ కారిడార్​ రైల్వే లైన్​ పనులు వేగిరమయ్యాయి. భూసేకరణకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. భూసేకరణ, పరిహారం జాప్యం కారణంగా నిలిచిన గ్రీన్​ ఫీల్డ్​ హైవే పనులు నవంబర్​ రెండో వారం నుంచి ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

500 ఎకరాల భూసేకరణ పూర్తి

వరంగల్, మంచిర్యాల నాలుగు లేన్ల గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణం పూర్తయితే ఉమ్మడి ఆదిలాబాద్​, కరీంనగర్​, వరంగల్​ మధ్య ప్రయాణం సులువుకానుంది. జిల్లాలోని మంథని, ముత్తారం, రామగిరి పరిధిలోని 16 గ్రామాల్లో దాదాపు 1,400 మంది రైతుల నుంచి 500 ఎకరాల భూసేకరణ పూర్తయింది. పెద్దపల్లి రైల్వే స్టేషన్​ జంక్షన్​గా మారడంతో రైళ్ల రాకపోకలతో పాటు ఎక్స్​ప్రెస్​ రైళ్లు సైతం ఇక్కడ ఆగుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్​ పెద్దపల్లి, మణుగూరు రైల్వే లైన్​ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.  రాష్ర్టంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ రామగుండం, మణుగూరు రైల్వే లైన్​ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది.

 

సింగరేణి బెల్ట్​ను కలుపుతూ..

రామగుండం, మణుగూరు రైల్వేలైన్​ 207 కిలో మీటర్ల పరిధిలో సింగరేణి కోల్‌బెల్ట్‌ను కలుపుతూ పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రైల్వే లైన్ నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ నాలుగు జిల్లాల్లో ప్రధాన రైల్వే స్టేషన్లను సైతం గుర్తించారు. ఈ​ నిర్మాణం పూర్తయితే ములుగు జిల్లా మేడారం సమ్మక్క, సారలమ్మ వనదేవతల దర్శనం సులభతరంకానుంది. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల వాసులు భద్రాద్రి కొత్తగూడెం వెళ్లేందుకు ఖాజీపేటకు బదులుగా పెద్దపల్లి వయా ములుగు, భూపాలపల్లి మీదుగా చేరుకోవచ్చు. దీంతో దూరభారం తగ్గనుంది. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశానుసారం ఆయా జిల్లాల కలెక్టర్లు త్వరలోనే ఇందుకు సంబంధించిన భూసేకరణ చేపట్టనున్నట్లు సమాచారం.

భూముల ధరలకు రెక్కలు

రైలు, రోడ్డు మార్గాల విస్తరణతో పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్​ జిల్లాలు మరింత అభివృద్ధి చెందనున్నాయి. కరీంనగర్​, నిజామాబాద్​ నుంచి వచ్చే రైళ్లు పెద్దపల్లిలో ఇంజిన్​లు మార్పు చేసుకోవాలి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పెద్దపల్లిలో బైపాస్​ స్టేషన్​ నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే జిల్లా కేంద్రంలో భూములకు రెక్కలొచ్చే అవకాశం​ ఉందని రియల్టర్లు భావిస్తున్నారు.  పెద్దపల్లి జిల్లా మీదుగా మంచిర్యాల-వరంగల్ గ్రీన్​ ఫీల్డ్ హైవే కారణంగా ఈ మార్గంలోని అటవీ గ్రామాలు అభివృద్ధి చెందే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పెద్దపల్లి బస్​ డిపో ఏర్పాటు కానుండటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.