Peddavangara firecracker stalls 
తెలంగాణ

యథేచ్ఛగా పటాకుల విక్రయాలు

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో అనుమతులు లేకుండానే పటాకులు విక్రయిస్తున్నారనే ఆరోపణలు రావడంతో అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Munja Srinivas

ప్రభాత ఉదయం, తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ పరిధిలోని పెద్దవంగర మండలంలో పటాకులు విక్రయించేందుకు పెద్దఎత్తున స్టాళ్లు వెలిశాయి. అయితే వాటికి అనుమతులు లేకుండానే విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీపావళి పండుగ సమీపిస్తున్నా విక్రయ కేంద్రాలపై తనిఖీలు చేపడుతున్నారా? నిబంధనల అమలును అధికారులు పర్యవేక్షిస్తున్నారా? అనేది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

అనుమతులు ఉన్నాయా..?

పటాకుల విక్రయాలు చేపట్టేందుకు అవసరమైన అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. వాటి నిల్వ, అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోకుండా తగిన భద్రతా ఏర్పాట్లను నిర్వాహకులు చేపట్టాలి. నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేసినా, విక్రయాలు చేపట్టినా ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పెద్దవంగర మండలంలో అనుమతి లేని విక్రయ కేంద్రాలను సంబంధిత అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.