ప్రభాత ఉదయం, హైదరాబాద్ : ప్రధాని మోదీకి రైతులన్నా, సైనికులన్నా పిచ్చి ప్రేమ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. రైతును రారాజు చేయడమే లక్ష్యంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి జమ చేస్తున్నామని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నిర్వహించిన ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ విడుదల కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 2014తో పోలిస్తే వ్యవసాయ బడ్జెట్‌ను బీజేపీ ప్రభుత్వం ఐదు రెట్లు పెంచిందని తెలిపారు. ఇప్పటివరకు 23 విడతల్లో రూ.4 లక్షల 47 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారని చెప్పారు. తాజాగా 9.34 కోట్ల మంది రైతుల ఖాతాల్లో మరో రూ.18,690 కోట్లు జమ చేస్తున్నామని, తెలంగాణలో 30 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరుతోందని వెల్లడించారు.
వరి ఎగుమతుల్లో భారత్ టాప్..
కాంగ్రెస్ పాలనలో తిండి గింజలు లేక ఇతర దేశాల నుంచి బియ్యం దిగుమతి చేసుకునే దుస్థితి ఉండేదని బండి సంజయ్ అన్నారు. ప్రధాని మోదీ నిరంతర కృషి, శాస్త్రవేత్తల పరిశోధనల వల్లే వరి ఎగుమతుల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. రైతులకు తల్లి మోదీ అయితే, తండ్రి ఐసీఏఆర్-ఐఐఆర్‌ఆర్ వంటి వ్యవసాయ పరిశోధనా సంస్థల శాస్త్రవేత్తలని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ అంటే ఐటీ రంగమే కాదని, ఐసీఏఆర్-ఐఐఆర్‌ఆర్ కూడా నగరానికి మరో గుర్తింపుగా మారిందన్నారు.
ఎల్నినోతో దేశమంతా కరువు..
ఎల్‌నినో ప్రభావంతో దేశమంతా కరువు పరిస్థితులు నెలకొన్నాయని బండి సంజయ్ తెలిపారు. తెలంగాణలో 11 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. ఈ సీజన్‌లో దాదాపు రూ.20 వేల కోట్ల పంట నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో మరిన్ని మండలాలను కరువు జాబితాలో చేర్చాలని సూచించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు కొత్త వంగడాలను సృష్టించి రైతులను ఆదుకోవాలని కోరారు. వికసిత్ భారత్–2047 లక్ష్యాన్ని చేరుకోవాలంటే రైతులను భాగస్వాములను చేయాలన్నదే మోదీ సంకల్పమని తెలిపారు. జవహర్ నగర్ డపింగ్ యార్డును నివాసాల నుంచి మరో చోటుకు తరలించాలని డిమాండ్ చేస్తూ మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ చేసిన పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని బండి సంజయ్ అన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని సూచించారు.