హైదరాబాద్ : ఓటు హక్కుపై ప్రశ్నలు లేవనెత్తితే ఎంఐఎం, అసదుద్దీన్ ఒవైసీ పేర్లను తెరపైకి తెచ్చి అసలు సమస్యను పక్కదారి పట్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ప్రతి అంశాన్నీ మతం కోణంలోకి తీసుకెళ్లడమే ఆ పార్టీ రాజకీయ వ్యూహమని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇటీవల చేసిన వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. ‘‘ఓటు హక్కు ఏ ఒక్క మతానికో, రాజకీయ పార్టీకో పరిమితమైనది కాదు. అది ప్రతి పౌరుడికీ రాజ్యాంగం కల్పించిన హక్కు. ఓట్ల తొలగింపు, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ప్రజల దృష్టిని ఎంతోకాలం మళ్లించలేరు. డ్రామాలు, డైవర్షన్ రాజకీయాలను బీజేపీ విడనాడాలి. ఎన్నికల సంఘాన్ని జేబు సంస్థలా భావించడం మానుకోవాలి. ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైతే మేమే చేర్పిస్తామని చెప్పడమేంటి? బీజేపీ నేతలు ఎన్నికల సంఘం అధికారులుగా వ్యవహరించాలనుకుంటున్నారా?’’ అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
ఆధారాలు ఉన్నాయి
ఓట్ల తొలగింపుపై తాము రాజకీయ ఆరోపణలు చేయడం లేదని, తమ వద్ద ఆధారాలు ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ‘‘ఏసీ గదుల్లో కూర్చొని సవాళ్లు విసరడం కాదు.. బూత్లు, వార్డులవారీగా క్షేత్రస్థాయిలో విచారణకు సిద్ధమా? ఫామ్-6, ఫామ్-7 దరఖాస్తుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలి. ముషీరాబాద్ నియోజకవర్గంలో ఫామ్-7 ద్వారా ఓట్ల తొలగింపునకు బీజేపీ కార్యకర్తలు ఫిర్యాదులు చేశారో, లేదో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేయాలి’’ అని పొన్నం డిమాండ్ చేశారు.
కామన్ పాస్ చార్జీలపై సమీక్ష!
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచనల మేరకు ఆర్టీసీ- మెట్రో కామన్ పాస్ చార్జీలను సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కామన్ పాస్ చార్జీలు అధికంగా ఉన్నాయని అభిప్రాయాలు వినిపిస్తున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ధరలను నిర్ణయించేందుకు త్వరలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.