ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో లోపాలపై బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతున్న ప్రొఫెసర్ హరగోపాల్ 
తెలంగాణ

ఓటర్ల జాబితా సంక్షోభానికి మరో పేరు ‘ఎస్ఐఆర్’: ప్రొఫెసర్ హరగోపాల్

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లను అన్యాయంగా తొలగిస్తున్నారని హరగోపాల్, పరకాల ప్రభాకర్ ఆరోపించారు.

Phaneendra

 హైదరాబాద్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో తీవ్ర లోపాలున్నాయని, అర్హులైన ఓటర్ల పేర్లను అన్యాయంగా తొలగిస్తున్నారని ప్రముఖ పౌరహక్కుల నేత ప్రొఫెసర్ జి.హరగోపాల్, ఆర్థిక విశ్లేషకులు డాక్టర్ పరకాల ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎస్‌ఐఆర్ ప్రక్రియను తక్షణమే రద్దు చేసి, పూర్తిగా పారదర్శకంగా కొత్త ఓటర్ల జాబితాలను రూపొందించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ ఓటర్ రైట్స్ ఫోరం ఆధ్వర్యంలో ముషీరాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో నిర్వహించిన సామాజిక తనిఖీలు, బహిరంగ విచారణల్లో ఓట్ల తొలగింపునకు సంబంధించిన అనేక లోపాలు వెలుగుచూశాయని మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు వెల్లడించారు.

సజీవంగా ఉన్నా మరణాల లిస్టులో

‘‘సజీవంగా ఉన్నవారిని మరణించినట్లుగా, ఇళ్లలోనే నివసిస్తున్నవారిని ఆచూకీలేనివారిగా చూపిస్తూ ఓట్లు తొలగించడం అత్యంత ఆందోళనకరం, ఎన్నికల సంఘం నియామక ప్రక్రియలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎంపిక కమిటీ నుంచి తొలగించడంపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి" అని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ‘‘ఏళ్లుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నవారి పేర్లను తొలగించి, తిరిగి కొత్త ఓటర్లుగా దరఖాస్తు చేసుకోవాలని కోరడం అన్యాయం’’ అని డాక్టర్ పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. మూడు కోట్ల మంది విదేశీయులున్నారన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనకు తగిన ఆధారాలు వెల్లడించాలని ఆయన కోరారు. ‘‘దశాబ్దాలుగా ఓటు వేస్తున్నవారి పేర్లను తొలగించడం సరికాదు’’ అని సిస్టర్ మంజుల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ వల్ల ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, ఆదివాసీలు, కార్మిక వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆమె తెలిపారు. రాబోయే హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు లోపభూయిష్ట ఓటర్ల జాబితాలను ఉపయోగించవద్దని ఫోరం ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.