తెలంగాణ

చిల్లర పనులు మాని రైతులను పట్టించుకో

బీజేపీ పార్టీ ఓటు చోరీ చేసిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని, ముఖ్యమంత్రి, మంత్రుల గ్రామాలకి వెళ్లి ఎన్ని ఓట్లు తొలగించారో తేల్చుకుందామని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు సవాల్ విసిరారు.

Madhu

ప్రభాత ఉదయం, నర్సాపూర్: ఎస్ఐఆర్‌పై హైదరాబాదులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో బహిరంగ సభ పెడతామంటున్న సీఎం రేవంత్‌రెడ్డికి ఎంపీ రఘునందన్‌రావు సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, ఆ సభకు సర్ కారణంగా ఓటు కోల్పోయిన వారిని తీసుకురావాలని సవాల్ విసిరారు. నర్సాపూర్ పట్టణంలోని ఓ రెస్టారెంట్‌లో ఫుడ్ పాయిజన్‌ అయ్యి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాధా మల్లేశ్‌గౌడ్‌తో కలిసి గురువారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ నాయకులను అరెస్టు చేయడం అన్యాయం, నియంతృత్వమని కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు అనడం విడ్డూరమన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రొఫెసర్లు, రాజకీయ నాయకులను అరెస్ట్ చేసిన విషయాన్ని మర్చిపోయారా? ఇది ప్రజాస్వామ్యమేనా? అని ప్రశ్నించారు. ప్రొఫెసర్ కోదండరాం ఇంటి తలుపులు పగలగొట్టి అరెస్టు చేయడం భావ్యమేనా? అని మాజీ మంత్రి కేటీఆర్‌ను నిలదీశారు. 1969లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ జై తెలంగాణ అన్నందుకు 369 మందిని కాల్చి చంపడాన్ని ఏమంటారని ఆయన మండిపడ్డారు.

ఒకప్పుడు తప్పులు చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు నేడు సుద్దులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనలు శృతిమించితే, ప్రభుత్వ, ప్రజల ఆస్తులను కాపాడేందుకు చర్యలు తీసుకునేలా ప్రజాస్వామ్యంలో ఉందన్నారు. బీజేపీ పార్టీ ఓటు చోరీ చేసిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని, ముఖ్యమంత్రి, మంత్రుల గ్రామాలకి వెళ్లి ఎన్ని ఓట్లు తొలగించారో తేల్చుకుందామని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లికి పోయి ఎన్ని ఓట్లు పోయాయో తెలుసుకుందామని అన్నారు. బీఎల్‌వోలను కాంగ్రెస్ పార్టీనే నియమించిందని, మీ ఓట్లే బీఎల్‌వోలు తొలగిస్తున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తుందని మండిపడ్డారు. చిల్లర పనులు మానుకొని పంటలకు కరెంట్ సరిగ్గా ఇవ్వాలని, రైతుల ఆత్మహత్యలను నివారించాలని హితవు పలికారు.

 జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టాలి: ఎంపీ

మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న హోటళ్లు, రెస్టారెంట్‌లలో అధికారులు విస్తృతస్థాయిలో తనిఖీలు చేపట్టాలని ఎంపీ రఘునందన్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నర్సాపూర్ ఫుడ్ పాయిజన్ ఘటనలో సాయిరాం అనే యువకుడు మరణించడం బాధాకరమన్నారు. మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, బాధితులకు మెరుగైన ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు, మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు హోటల్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. కేసులు పెట్టి చేతులు దులుపుకోవడం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీ వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చేశ్ యాదవ్, బీజేపీ నాయకులు రమేశ్ గౌడ్, అంజి గౌడ్, ప్రేమ్ కుమార్, సురేశ్, కౌన్సిలర్లతోపాటు తదితరులు ఉన్నారు.