ప్రభాత ఉదయం, రామగుండం: లుంగీ కట్టుకోవడంపై మొదలైన వివాదం ఓ వృద్ధుడి హత్యకు దారితీసింది. తన భార్య ముందు లుంగీతో తిరుగుతున్నాడంటూ కక్ష పెంచుకున్న ఓ వ్యక్తి.. స్నేహితుడితో కలిసి వృద్ధుడిపై దాడి చేసి హతమార్చాడు. పోలీసుల కథనం ప్రకారం..
రామగుండం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన బడిగే వెంకటేశ్వరరావు (60) పాల వ్యాపారం చేసేవాడు. పశువుల నుంచి పాలు పిండేటప్పుడు, వాటి బాగోగులు చూసుకునేటప్పుడు లుంగీ కట్టుకునేవాడు. అయితే, ఇంటి ఎదురుగా ఉండే రాయరపు నరేశ్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసేవాడు. తన భార్య ముందు లుంగీ కట్టుకొని ఇష్టానుసారంగా తిరుగుతావా అంటూ వెంకటేశ్వరరావుతో గొడవపడేవాడు. పలుమార్లు చంపుతానని బెదిరించినట్లు సమాచారం.
ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి నరేశ్ తన స్నేహితుడు పోరంకి మస్తాన్రావుతో కలిసి వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లాడు. నిద్రిస్తున్న ఆయనపై కర్రలతో దాడి చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన భార్య భాగ్యలక్ష్మి, కుమారుడు సుబ్రమణ్యంపైనా దాడికి పాల్పడ్డారు. దీంతో వారు భయపడి మరో గదిలోకి వెళ్లగా.. నిందితులు వెంకటేశ్వరరావును తీవ్రంగా కొట్టి అక్కడి నుంచి పరారయ్యారు.
తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వరరావును కుటుంబసభ్యులు గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రామగుండం సీఐ కృష్ణకుమార్ తెలిపారు.