తెలంగాణ

చెరువా.. మందుబాబుల అడ్డానా? మురికికూపంగా రామంతాపూర్‌ చిన్నచెరువు

ఒకవైపు మురుగునీరు.. మరోవైపు చెత్తాచెదారం.. ఇంకోవైపు మందుబాబుల హల్‌చల్‌.. వెరసి రామంతాపూర్‌ చిన్నచెరువు మురికికూపంగా మారింది.

Phaneendra

ప్రభాత ఉదయం, ఉప్పల్‌ : ఒకవైపు మురుగునీరు.. మరోవైపు చెత్తాచెదారం.. ఇంకోవైపు మందుబాబుల హల్‌చల్‌.. వెరసి రామంతాపూర్‌ చిన్నచెరువు మురికికూపంగా మారింది. చెరువు పరిరక్షణ, అభివృద్ధిని అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెద్దచెరువును అభివృద్ధి చేసిన తరహాలోనే చిన్నచెరువును కూడా అభివృద్ధి చేయాలని ఇందిరానగర్‌, వెంకటేశ్వర కాలనీవాసులు కోరుతున్నారు.

వ్యర్థాల డంపింగ్‌తో దుర్వాసన

చుట్టుపక్కల నివాస ప్రాంతాల నుంచి వస్తున్న డ్రైనేజీ, మురుగునీరు నేరుగా చెరువులో కలుస్తోంది. దీనికితోడు ప్లాస్టిక్‌ వ్యర్థాలు, రసాయనాలు, ఇతర చెత్తను పడేస్తుండటంతో నీరు పూర్తిగా కలుషితమైంది. చెరువు ఆక్రమణలకు గురవడం, రక్షణ గోడలు లేకపోవడం, గుర్రపుడెక్క విపరీతంగా పెరగడంతో పరిస్థితి మరింత దిగజారింది. నీటి నిల్వ సామర్థ్యం కూడా తగ్గిపోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దోమలతో దినదినగండం

మురుగునీరు నిల్వ ఉండటంతో దోమలు, ఈగలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నిరంతరం వెలువడుతున్న దుర్వాసనతో ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. అధికారులు వెంటనే గుర్రపుడెక్కను తొలగించి, మురుగునీరు చెరువులోకి రాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

రాత్రయితే మందుబాబుల హల్‌చల్‌

చిన్నచెరువు పరిసరాలు రాత్రివేళ మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయి. అక్కడే మద్యం సేవించి ఖాళీ సీసాలను ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారు. మరికొందరు సీసాలను పగులగొట్టి పార్కింగ్‌ చేసిన కార్లు, బస్సుల కింద పడేస్తున్నారు. ఉదయం వాకింగ్‌కు వచ్చే వారు ఈ పగిలిన సీసాల వల్ల గాయపడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. సెలవు రోజుల్లో చెరువు ఖాళీ స్థలంలో క్రికెట్‌ ఆడుకునే చిన్నారులు, యువకులకూ ఈ సీసాలు ఇబ్బందిగా మారాయి.

ఓపెన్‌ జిమ్‌కు వెళ్లాలంటే భయం

చిన్నచెరువులోని గంగమ్మ గుడి సమీపంలో ఏర్పాటు చేసిన ఓపెన్‌ జిమ్‌కు ప్రతిరోజూ యువతీయువకులు, మహిళలు, వృద్ధులు వ్యాయామం కోసం వస్తుంటారు. అయితే సాయంత్రం వేళల్లో కొందరు అక్కడే మద్యం సేవిస్తూ ఉండటంతో మహిళలు, యువతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భయంతో జిమ్‌కు రావాలంటేనే జంకుతున్నారని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు పెట్రోలింగ్‌ పెంచి గంగమ్మ గుడి పరిసరాలతోపాటు చెరువు ఖాళీ స్థలంలో నిఘా ఉంచాలని కోరుతున్నారు. చెరువును శుభ్రం చేసి, అభివృద్ధి పనులు చేపట్టి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.