తెలంగాణ

కాకతీయుల కళా కిరీటం.. ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప

Agasthya kantu

తెలంగాణ నేలపై నేటికీ నిలిచివున్న ఎన్నో చారిత్రక కట్టడాలు.. శతాబ్దాల క్రితమే మన పూర్వీకులకు ఉన్న అపూర్వమైన శిల్పకళా నైపుణ్యాన్ని, వాస్తు పరిజ్ఞానాన్ని, నిర్మాణ సాంకేతికతను కళ్లకు కడుతున్నాయి. కాలం మారినా.. పాలకులు మారినా.. ప్రకృతి సవాళ్లు ఎదురైనా.. చెక్కుచెదరకుండా నిలిచిన ఆ కట్టడాలు ఆనాటి నిర్మాణ మేధస్సుకు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. అలాంటి అపూర్వ వారసత్వ కట్టడాల్లో ముందుగా గుర్తొచ్చేది కాకతీయుల శిల్పకళా వైభవానికి, నిర్మాణ సాంకేతిక నైపుణ్యానికి ప్రతీకగా నిలిచిన 800 ఏళ్లకు పైరా చరిత్ర కలిగిన రామప్ప ఆలయం.

రాతిని శిల్పంగా మలిచిన కళా వైభవం ఒకవైపు.. నిర్మాణంలో కనిపించే ఇంజినీరింగ్‌ మేధస్సు మరోవైపు.. కాకతీయుల సృజనాత్మకతకు అద్దం పడతాయి. ఎన్నో ప్రత్యేకతలను తనలో దాచుకున్న ఈ ఆలయానికి అంతకుమించిన చారిత్రక ఘనత కూడా ఉంది. కాకతీయ రాజులు, వారి సామంతరాజుల కళాభిమానానికి, నిర్మాణ దక్షతకు, ఆనాటి రాజ్య వైభవానికి రామప్ప దేవాలయం సాక్ష్యంగా నిలుస్తోంది. శతాబ్దాలు గడిచినా చెక్కుచెదరని ఈ ఆలయంలో అడుగడుగునా కనిపించే శిల్పాలు, నిర్మాణ పద్ధతులు, సాంకేతిక ఆలోచనలు.. నేటి తరాన్నీ అబ్బురపరుస్తూనే ఉన్నాయి.

గణపతి కోసం పోరాటం..40 ఏళ్లపాటు నిర్మాణం

రామప్ప దేవాలయం పూర్వపు వరంగల్‌ జిల్లా కేంద్రానికి 70 కి.మీ. దూరంలో (ప్రస్తుత ములుగు జిల్లా) పాలంపేట గ్రామంలో ఉంది. రామప్ప దేవాలయం.ఓరుగల్లు కేంద్రంగా (నేటి వరంగల్) 12వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యం విస్తరిస్తున్న రోజులవి. గణపతిదేవుడు కాకతీయ రాజ్యాన్ని శక్తిమంతంగా తీర్చిదిద్దుతున్న కాలంలో ఆయనకు అండగా నిలిచిన సామంతరాజుల్లో రేచర్ల రుద్రుడు ముఖ్యుడు. రుద్రయ్య, రుద్రుడు అనే పేర్లతోనూ ప్రసిద్ధి చెందిన రేచర్ల రుద్రుడు కేవలం రాజసభలో సామంతుడే కాదు.. కాకతీయ సామ్రాజ్య విస్తరణలో తన సైనిక సామర్థ్యాన్ని చాటిన యోధుడిగా చరిత్రలో నిలిచాడు. గణపతిదేవుడు రాజుగా అధికారం చేపట్టకముందు జరిగిన ఓ సంఘటనతో రుద్రుడి పేరు మరింతగా ముడిపడి ఉంది. మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన జైతుగి రాజుతో జరిగిన ఘర్షణలో గణపతిదేవుడు బందీ అయ్యాడని, ఆ సమయంలో రేచర్ల రుద్రుడు తన సైనిక పరాక్రమంతో ఆయనను విడిపించాడని ఒక చారిత్రక కథనం చెబుతోంది. అందుకు ప్రతిఫలంగా రామప్ప ఆలయాన్ని ఇచ్చినట్లు ఆధారాలను బట్టి తెలుస్తోంది. రేచర్ల రుద్రుడి ఆధ్వర్యంలో క్రీ.శ. 1173లో రామప్ప ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టగా.. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత అంటే 40 ఏళ్ల క్రీ.శ. 1213 నాటికి నిర్మాణం పూర్తయింది. ఆలయ ప్రాంగణంలో నేటికీ కనిపించే తెలుగు–కన్నడ లిపిలోని ప్రాచీన శాసనం ఈ నిర్మాణ కాలానికి కీలకమైన చారిత్రక ఆధారంగా నిలుస్తోంది.

ఆవాసం-ఆలయం-ఆలయ..కాకతీయ నిర్మాణ శైలి

కాకతీయ రాజులు నిర్మించి దేవాలయలన్నీ నక్షత్ర శైలిలో ఉంటాయి. రామప్ప ఆయలం కూడా నక్షత్ర ఆకారంలోనే ఉంటుంది. కాకతీయుల నిర్మాణ శైలిలో ఆవాసం-ఆలయం-ఆలయ చెరువు అనే సమన్వయానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉండేది. అంటే ప్రజల నివాస ప్రాంతం, ఆధ్యాత్మిక కేంద్రం, నీటి వనరు ఒకదానికొకటి అనుసంధానమై ఉండేలా నిర్మాణ ప్రణాళికను రూపొందించేవారు. పాలంపేటలోని రామప్ప ఆలయం కూడా ఇదే సూత్రాన్ని ఆచరించారు.  ఆలయానికి సమీపంలోనే పాలంపేట గ్రామం, విశాలమైన రామప్ప చెరువు ఉండటం కాకతీయుల నాటి ఈ సమగ్ర నిర్మాణ దృష్టిని తెలియజేస్తోంది.

దేవుడి పేరు కాకుండా.. శిల్పి పేరుతో

ఆలయాల పేర్లు సాధారణంగా అక్కడ కొలువైన దేవత పేర్లు లేదా నిర్మించిన వారి ఆధారంగా ఉంటాయి. కానీ రామప్ప ఆలయానికి మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. రామప్ప ఆలయ గర్భగుడిలో అలంకారాలతో మలచిన పానవట్టంపై రామలింగేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఆలయ ప్రధాన దైవం ఆయనే. అయినా ఈ దేవాలయానికి రామలింగేశ్వరుడి పేరు రాలేదు.

ఆలయాన్ని నిర్మించిన కాలంలో రాజ్యాన్ని పాలించిన గణపతిదేవుడి పేరూ దీనికి పెట్టలేదు. నిర్మాణ బాధ్యతలు చేపట్టిన రేచర్ల రుద్రుడి పేరుతోనూ ఈ ఆలయం ప్రసిద్ధి చెందలేదు. ఆలయాన్ని రాతిలో అపూర్వ శిల్పాలతో మలిచిన స్థపతి రామప్ప పేరే మీదే రామప్ప ఆయయంగా పేరు స్థిరపడటం విశేషం. శిల్పి పేరుతోనే ఆలయం ప్రసిద్ధి చెందడం రామప్ప ప్రత్యేకతల్లో ఒకటిగా నిలిచింది

మూడు ద్వారాలు.. భూకంపాలను తట్టుకునే పునాది!

కాకతీయుల కాలం శిల్పకళకు స్వర్ణయుగంగా పేరుగాంచింది. ముఖ్యంగా త్రికూటాలయాల నిర్మాణంలో కాకతీయ శిల్పుల ప్రతిభ ప్రత్యేకంగా కనిపిస్తుంది. అయితే రామప్ప ఆలయం మాత్రం త్రికూటాలయాల కోవలోకి రాదు. ఎత్తైన పీఠంపై నక్షత్రాకార ఆకృతిలో, తూర్పు దిశను చూసేలా ప్రధాన ఆలయాన్ని నిర్మించారు. తూర్పు ప్రవేశ ద్వారంతోపాటు ఉత్తర, దక్షిణ దిశల్లోనూ ద్వారాలను ఏర్పాటు చేశారు. ఆలయం మధ్యభాగంలో విశాలమైన మహామంటపాన్ని నిర్మించి, దాని చుట్టూ ప్రధాన నిర్మాణాన్ని సమన్వయపరిచారు. రామప్పను ప్రత్యేకంగా నిలబెట్టేది పైకి కనిపించే శిల్పకళ మాత్రమే కాదు.. నేలలో దాగి ఉన్న నిర్మాణ సాంకేతికత కూడా. కాకతీయుల ఆలయ నిర్మాణాల్లో ఇసుక ఆధారిత పునాది పద్ధతిని ఉపయోగించినట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి. రామప్ప ఆలయ పునాదుల్లోనూ ఈ విధానాన్ని ఉపయోగించినట్లు చెబుతారు. పునాది ప్రాంతంలో ఇసుక పొరను ఏర్పాటు చేసి, దాని మీద రాతి నిర్మాణాన్ని నిలబెట్టిన ఈ పద్ధతినే సాధారణంగా ‘శాండ్‌బాక్స్‌ టెక్నాలజీ’గా పిలుస్తారు. భూమి ప్రకంపనలు సంభవించినప్పుడు పునాదిలోని ఇసుక పొర కొంత ప్రభావాన్ని గ్రహించి, పై నిర్మాణంపై పడే ప్రకంపనల తీవ్రతను తగ్గించడంలో సహాయపడేలా ఈ విధానం పనిచేసి ఉండవచ్చని భావిస్తారు.

జీవం ఉట్టిపడే శిల్పాలు.. రాతిలో ఒదిగిన కథలు!

రామప్ప ఆలయంలో అడుగుపెడితే ముందుగా ఆకట్టుకునేది అక్కడి శిల్పసంపద. సూది బెజ్జం గుండా దారం సైతం సులభంగా దూరిపోయేంత అతి సూక్ష్మమైన రంధ్రాలతో చెక్కిన అద్భుత శిల్పాలు రామప్ప ఆలయంలో అనేకం కొలువుదీరి ఉన్నాయి. రాతికి జీవం పోసినట్టుగా కనిపించే శిల్పాలు చూపరులను మంత్రముగ్ధులను చేస్తాయి. శివతాండవం, శివకళ్యాణం వంటి నాట్య దృశ్యాలతో పాటు రామాయణం, మహాభారతం, పురాణ ఇతిహాసాలకు సంబంధించిన ఘట్టాలను కూడా శిల్పాల రూపంలో ఆవిష్కరించారు. ఆలయం చుట్టూ వివిధ భంగిమల్లో కనిపించే మదనికలు, నాగినులు, కోయస్త్రీ శిల్పాలు కాకతీయుల శిల్పుల సూక్ష్మ నైపుణ్యానికి నిదర్శనం. ఆ శిల్పాల్లోని కేశాలంకరణ, వస్త్రాలు, ఆభరణాల వంటి చిన్నచిన్న వివరాలు సైతం స్పష్టంగా కనిపించేలా రాతిలో మలిచారు. రామప్ప శిల్పాల్లో కేవలం దేవతామూర్తులే కాదు.. ఆనాటి జీవన విధానం, యుద్ధకళలు, నృత్య సంప్రదాయాలకు సంబంధించిన దృశ్యాలు కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా పేరిణి నృత్య భంగిమలను ప్రతిబింబించే శిల్పాలు కాకతీయుల నాట్య సంప్రదాయానికి విలువైన ఆధారాలుగా నిలిచాయి. నటరాజ రామకృష్ణ పేరిణి శివతాండవాన్ని పునరుద్ధరించే సమయంలో రామప్పలోని ఈ నాట్య శిల్పాలను కూడా అధ్యయనం చేశారు.

చీకటిలోనూ గర్భగుడిలో వెలుగు

ఆలయ నిర్మాణంలోనూ ఎన్నో ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి. ఆలయ ప్రాంగణమంతా చీకటి ఆవరించి ఉన్నప్పటికీ, గర్భాలయంలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి మూలవిరాట్టుపై మాత్రం నిరంతరం దివ్యమైన వెలుగు ప్రసరిస్తూనే ఉంటుంది. దేవాలయం చుట్టూ ప్రహరీతోపాటు వర్షం నీరు బయటకు వెళ్లేలా ఏర్పాటు చేసిన వ్యవస్థ నాటి కాకతీయుల శాస్త్రీయ నైపుణ్యానికి అద్దం పడుతుంది. ఆలయానికి వెళ్లే మార్గంలో కనిపించే ఏనుగు శిల్పాలు కూడా ప్రత్యేక ఆకర్షణ.

రాతి శిల్పం నుంచి సంగీత స్వరాలు..

రామప్ప ఆలయంలోని ప్రతి శిల్పం ఓ ప్రత్యేకతే. అయితే ప్రధాన ఆలయానికి కుడివైపున కనిపించే ఓ ఏకశిలా శిల్పం మాత్రం శిల్పకళతో పాటు ఆసక్తికరమైన కథనానికి కేంద్రంగా నిలుస్తోంది. ఒక మహిళ తన ఎడమ చేతితో అరటి చెట్టును వంచి పట్టుకున్నట్లుగా కనిపించే ఈ శిల్పం చూపరులను ఆకట్టుకుంటుంది. బయటకు చూస్తే అది మామూలు రాతి శిల్పంలానే కనిపిస్తుంది. కానీ దానిని వేళ్లతో సున్నితంగా తట్టినప్పుడు స్వరాలు వినిపిస్తాయని స్థానికంగా ప్రచారంలో ఉంది. రాతిలో ఎలాంటి బోలుదనం కనిపించకుండా.. దాన్ని తాకితే మాత్రం సంగీత స్వరం వినిపిస్తుంది. రామప్ప ఆలయంలోని కొన్ని శిల్పాలు, స్తంభాలకు సంబంధించి ఇలాంటి సంగీత స్వరాల కథనాలు చాలాకాలంగా ప్రచారంలో ఉన్నాయి.

మరో ఆద్భుతం..నంది

రామప్ప ఆలయంలో మరో ప్రత్యేక ఆకర్షణ..నంది విగ్రహం. నల్లరాయిగా ప్రసిద్ధి చెందిన బసాల్ట్‌ (Basalt) అనే అగ్నిజ శిలతో చెక్కిన ఈ నంది శిల్పం కాకతీయుల శిల్పకళా నైపుణ్యానికి అద్భుత ఉదాహరణగా నిలుస్తుంది. నందిని చూస్తే అది కేవలం రాతితో చెక్కిన విగ్రహంలా అనిపించదు. చెవులు రిక్కించి, కండలు బిగించి, శివుడి ఆదేశం కోసం ఏ క్షణమైనా లేచి నిలబడేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా దాని భంగిమను మలిచారు. ముఖ కవళికలు, శరీర నిర్మాణం, కండరాల తీరు వంటి సూక్ష్మ అంశాలను సహజంగా చూపించడంలో శిల్పి ప్రతిభ స్పష్టంగా కనిపిస్తుంది. నంది శిల్పానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విశేషం.. ఎదురుగా నిలబడి చూసినా.. పక్క నుంచి చూసినా..మరో కోణంలో నుంచి చూసినా.. నంది మనవైపే చూస్తున్నట్లు అనిపిస్తుంది.

నీటిలో తేలే ఇటుకల కథ

రామప్ప దేవాలయ శిఖర నిర్మాణం కోసం వినియోగించిన ఇటుకల కూడా విశేషమైనవి. ఈ ఆలయ నిర్మాణంలో బరువైన రాతిని ఉపయోగించారు. ఆలయ గోపురాన్ని సైతం అదే రాతితో కడితే పునాదులు ఆ బరువును తట్టుకొని నిలబడటం సాధ్యమయయ్యే విషయం కాదు. ఆ విషయాన్ని గ్రహించి శిఖర నిర్మాణం కోసం ప్రత్యేకమైన మట్టి, ఏనుగు లద్దె, అడవి మొక్కల జిగురు, ఊకపొట్టు, మరికొన్ని పదార్థాలతో రూపొందించిన తేలికైన ఇటుకలను వినియోగించారు. ఈ ఇటుకల అంతర్భాగం స్పాంజి మాదిరిగా సూక్ష్మ రంధ్రాలతో (బోలుగా) ఉంటుంది. ఆలయ నిర్మాణ సమయంలో వీటిని జోడించేటప్పుడు సున్నం, బెల్లపు పాకం మరియు ఇతర సాంప్రదాయ మిశ్రమాలను ఇవి పీల్చుకోవడానికి ఈ అమరిక దోహదపడింది. ఇలా ద్రవ మిశ్రమాలను లోపలికి పీల్చుకోవడం వల్ల ఆ ఇటుకలు ఒకదానికొకటి గట్టిగా బంధించబడి, కట్టడానికి శతాబ్దాల పాటు చెక్కుచెదరని అత్యంత దృఢత్వాన్ని ప్రసాదించాయి. శాస్త్రీయంగా ఒక వస్తువు నీటిలో తేలాలంటే దాని సగటు సాంద్రత నీటి సాంద్రత కంటే తక్కువగా ఉండాలి. సాంకేతికపరంగా విశ్లేషిస్తే ఈ ఇటుకల సాంద్రత నీటి సాంద్రత కంటే చాలా తక్కువగా ఉండటం వల్లే అవి నీటి ఉపరితలంపై సులభంగా తేలియాడతాయి.

రామప్ప చెరువు.. కాకతీయుల నీటి విజ్ఞానానికి నిలువెత్తు సాక్ష్యం

చుట్టూ పచ్చని చెట్లు.. ఎత్తైన కొండలు.. మధ్యలో విశాలంగా పరుచుకున్న నీటి విస్తీర్ణం.. ఇదే రామప్ప చెరువు. రామప్ప ఆలయానికి సుమారు కిలోమీటర్‌ దూరంలో ఉన్న ఈ మానవ నిర్మిత జలాశయం కాకతీయుల అద్భుతమైన నీటి నిర్వహణ నైపుణ్యానికి నిదర్శనం. చెరువు సమీపంలోని శివాలయంలో లభించిన శాసనం ప్రకారం, గణపతిదేవుడి సేనాని రేచర్ల రుద్రుడు క్రీ.శ. 1213లో దీనిని నిర్మించినట్లు తెలుస్తోంది. రెండు కొండల మధ్య ఆనకట్ట నిర్మించి జలాశయాన్ని ఏర్పాటు చేయడం వల్ల అప్పట్లోనే ఇది లోతైన చెరువుగా రూపుదిద్దుకుంది. రామప్ప చెరువుకు సుమారు 2.912 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. గరిష్ఠ నీటిమట్టం 35 అడుగులు కాగా, చెరువుకట్ట సుమారు 610 మీటర్ల పొడవు ఉంటుంది. రెండు తూముల ద్వారా నీటిని విడుదల చేస్తూ పరిసర వ్యవసాయ భూములకు సాగునీరు అందిస్తున్నారు. దీంతో సుమారు 11 వేల ఎకరాల్లో రైతులు  పంటలు పండించుకుంటున్నారు. అలాగే నాలుగు మండలాల గ్రామాలకు తాగునీరు అందిస్తోంది. దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఈ చెరువులోకి విడుదల చేస్తూ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా మార్చి ఇక్కడి నుంచి పాకాల, గణపురం చెరువులకు నీటిని తరలిస్తున్నారు.

రామప్పపై..పీవీ రచనలు

వరంగల్ ప్రాంతం నుంచి వెలువడిన ప్రసిద్ధ 'కాకతీయ' పత్రిక వేదికగా మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు రామప్ప దేవాలయ సౌందర్యాన్ని వివరిస్తూ అనేక ప్రత్యేక వ్యాసాలు అందించారు. ఇందులో భాగంగా ఆయన 1957లో మూడు రోజుల పాటు ఆలయ ప్రాంగణంలోనే ఉంటూ, దాని శిల్పకళా విశేషాలను అత్యంత సునిశితంగా అధ్యయనం చేశారు. ఆ తర్వాత 1966 కాలంలో ప్రముఖ అంతర్జాతీయ పత్రిక 'ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా'లో ‘రామప్ప – ఏ సింఫనీ ఇన్ స్టోన్’ (రాతిపై రూపుదిద్దుకున్న మధుర స్వరం) పేరిట ఒక అద్భుతమైన పరిశోధనాత్మక వ్యాసాన్ని ప్రచురించారు. ఈ విధంగా రామప్ప ఆలయ నిర్మాణ కౌశలాన్ని, కాకతీయుల వైభవాన్ని విదేశీ స్థాయికి చాటిచెప్పడంలో పీవీ కీలక పాత్ర పోషించారు.

యునెస్కో గుర్తింపు

కాకతీయుల శిల్పకళా ప్రతీక అయిన రామప్ప దేవాలయానికి యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు దక్కింది.  చైనాలోని ఫుజౌ వేదికగా 2021 జులై 25న జరిగిన యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 44వ సమావేశంలో రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా అధికారికంగా ప్రకటించారు. ఈ హోదా దక్కించుకున్న భారతీయ 39వ చారిత్రక కట్టడంగా, అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రథమ క్షేత్రం రామప్ప. ఈ అంతర్జాతీయ గుర్తింపుతో రామప్ప ఆలయానికి ప్రపంచ పర్యాటక రంగంలో విశేష ప్రాచుర్యం లభించడమే కాకుండా, కాకతీయుల శిల్పకళా వైభవం విశ్వవ్యాప్తమైంది. ఈ ప్రాంతం చారిత్రక, ప్రాకృతిక ప్రాధాన్యాన్ని కాపాడేందుకు యునెస్కో ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఆలయాభివృద్ధి కోసం జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు కూడా వస్తాయి.