Rare Indian Pitta Nine Colors Bird 
తెలంగాణ

నల్లమలలో 'నవరంగుల సోయగం'

కనువిందు చేస్తున్న నవరంగ పిట్ట

Narasimha Reddy

ప్రభాత ఉదయం, అచ్చంపేట: పులులు, చిరుతపులులతో పాటు అనేక అరుదైన వన్యప్రాణులు, పక్షి జాతులతో జీవవైవిధ్యానికి నెలవైన నల్లమల అడవులలో మరో అరుదైన అతిథి నవరంగ పిట్ట సంచారం కనువిందు చేస్తున్నది. తొమ్మిది రంగులతో మెరిసిపోయే నవరంగ పిట్ట రాకతో  నల్లమల అటవీ అందాలు సరికొత్త హంగులను సంతరించుకున్నాయి. ఆకుపచ్చ, నీలం, పసుపు, ఎరుపు, నలుపు, తెలుపు, గోధుమ రంగుల సమ్మేళనంతో  కూడిన ఈకలు, శరీరంతో కనిపించే నవరంగ పిట్టను నవరంగుల సోయగం పేరుతో కూడా పిలుస్తుంటారు. ఇండియన్ పక్షిగానూ దీనికి పేరుంది.  సాధారణంగా హిమాలయాల నుంచి దక్షిణ భారతానికి వలస వచ్చే ఈ పక్షి, నల్లమలలోని దట్టమైన అడవులు, ఫరహాబాద్, మన్ననూర్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో సంచరిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

 వర్షాకాలం తర్వాత అడవి అంతా పచ్చదనంతో కళకళలాడుతుండగా, ఈ 'నవరంగ' రాకతో నల్లమల మరింత అందంగా మారిందని అటవీ అధికారులు తెలిపారు. పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు సఫారీకి వెళ్లినప్పుడు ఈ అరుదైన రంగుల తార వంటి పక్షిని ఫొటోలు, వీడియోలు తీస్తూ మురిసిపోతున్నారు. పర్యావరణ సమతుల్యానికి సూచికగా భావించే నవరంగ పిట్ట నల్లమలలో కనిపించడం, ఇక్కడ జీవవైవిధ్యం ఔన్నత్యానికి నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు.