ప్రభాత ఉదయం, యాదాద్రి ప్రతినిధి: రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) భూసేకరణ పరిహారంపై యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి నిర్వాసితుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మార్కెట్ ధరకు, ప్రభుత్వం ప్రకటించిన పరిహారానికి మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్బిట్రేషన్‌లో పరిహారం పెంచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నా.. ప్రస్తుత పరిహారంతో భూములు ఇచ్చేందుకు నిర్వాసితులు నిరాకరిస్తున్నారు.
సర్వేకు ససేమిరా..
రాష్ట్రంలో ప్రతిపాదించిన రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్)లో ఉత్తర భాగాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్ మండలాల్లోని 24 గ్రామాల మీదుగా 59.33 కిలోమీటర్ల మేర నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం 1,795 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా.. 2022లో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, భువనగిరి మండలం రాయగిరి గ్రామస్థులు మొదటి నుంచీ భూసేకరణను వ్యతిరేకిస్తున్నారు. పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి, అప్పటి మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని యాదాద్రి కలెక్టరేట్ వద్ద అడ్డుకున్నారు. ఈ క్రమంలో కేసులు నమోదవడంతో కొందరు జైలుకు కూడా వెళ్లారు. అయినప్పటికీ, తమ భూముల సర్వేకు గ్రామస్థులు అంగీకరించలేదు.
ఎట్టకేలకు ముగిసిన సర్వే
జిల్లాలోని 23 గ్రామాల్లో సర్వే పూర్తయినా.. రాయగిరి నిర్వాసితులు మాత్రం ఇందుకు అంగీకరించలేదు. దాదాపు అన్ని గ్రామాల్లో భూసేకరణ అవార్డులు ఖరారయ్యాయి. కొన్ని గ్రామాల్లో కలెక్టర్ నేతృత్వంలోని ఆర్బిట్రేషన్ ద్వారా పరిహారం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు పలుమార్లు రాయగిరి నిర్వాసితులతో సమావేశమై ఒప్పించే ప్రయత్నం చేశారు. దీంతో ఇటీవలే గ్రామంలో 262 ఎకరాల భూమికి సర్వే పూర్తయింది.
742 భూ ఖాతాలకు అవార్డు
బహిరంగ మార్కెట్లో రాయగిరిలో ఎకరా భూమి ధర రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు పలుకుతోంది. అయితే, 2013 భూసేకరణ చట్టం ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలోని రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగానే పరిహారం నిర్ణయించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువకు మూడు రెట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్లు పరిహారం చెల్లించాలి. 2022లో నోటిఫికేషన్ విడుదలైన సమయంలో రాయగిరిలో ఎకరా భూమికి రిజిస్ట్రేషన్ విలువ రూ.21.50 లక్షలు, రూ.29 లక్షలు, రూ.36 లక్షలుగా ఉంది. రాయగిరి భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో ఉండటంతో రెండింతల పరిహారం చెల్లించేందుకు భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి 742 భూమి ఖాతాలకు అవార్డులు ప్రకటించారు. దీంతో ఎకరాకు రూ.43 లక్షలు, రూ.58 లక్షలు, రూ.72 లక్షల చొప్పున పరిహారం అందనుంది. అయితే, బహిరంగ మార్కెట్ ధరతో పోలిస్తే ఈ మొత్తం చాలా తక్కువగా ఉందని నిర్వాసితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ ధరకు, ప్రభుత్వం ప్రకటించిన పరిహారానికి మధ్య భారీ వ్యత్యాసం ఉండటమే వారి అభ్యంతరానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది.
ఆర్బిట్రేషన్‌లో పెంచుతామన్నా..
సేకరిస్తున్న 262 ఎకరాలకు ఎకరాకు రూ.36 లక్షల రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా రెండింతల పరిహారం ఇవ్వాలని రాయగిరి నిర్వాసితులు కలెక్టర్ అనురాగ్ జయంతిని కలిసి డిమాండ్ చేశారు. ఆర్బిట్రేషన్ ద్వారా పరిహారం పెంచుతామని కలెక్టర్ హామీ ఇచ్చినా.. వారు సంతృప్తి చెందడం లేదు.ఇటీవల భువనగిరి మండలం ఎర్రంబెల్లిలో ఆర్బిట్రేషన్ ద్వారా ఎకరాకు రూ.50.11 లక్షల పరిహారం చెల్లించేందుకు అంగీకరించారు. తుర్కపల్లి మండలం వేల్పల్లి, యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లిలోనూ ఎకరాకు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలకు పైగా పరిహారం ఇప్పించేందుకు కలెక్టర్ అంగీకరించారు. ఈ మేరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ)కి సిఫారసు చేసినట్లు సమాచారం.