ప్రభాత ఉదయం, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులు చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డి ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, డ్యామ్ సేఫ్టీ నిపుణుల సూచనల మేరకే ఈ పనులు చేపట్టాలని సూచించారు. బ్యారేజీల రిపేర్లను కూడా డిసెంబర్లోనే ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. దెబ్బతిన్న మూడు బ్యారేజీలను తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రులు, ఇరిగేషన్ అధికారులతో సెక్రటేరియట్లో సీఎం గురువారం సమీక్ష నిర్వహించారు. గత సర్కార్ చేసిన తప్పులను సరిచేస్తూ ప్రాజెక్టులను కాపాడాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సమన్వయం చేసుకొని ఈ నెలాఖరులోగా పునరుద్ధరణ పనులకు సంబంధించిన తుది అనుమతులు పొందాలన్నారు. బ్యారేజీల భద్రతకు సంబంధించిన ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, ఇందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, నిర్మాణ సంస్థల మధ్య సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు. మూడు బ్యారేజీల పునరుద్ధరణకు దాదాపు రూ.4,193 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. నిర్మాణ లోపాలకు సంబంధించిన రిపేర్ల వ్యయాన్ని నిర్మాణ సంస్థలే భరించేలా, అదనపు పనుల వ్యయాన్ని ప్రభుత్వం భరించేలా ప్రతిపాదించినట్లు వివరించారు. పునరుద్ధరణకు సంబంధించిన ప్రాథమిక ప్రణాళికలకు కేంద్ర నిపుణుల కమిటీ ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని అధికారులు చెప్పారు.
తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి
మేడిగడ్డ వద్ద నీళ్లున్నా వాటిని లిఫ్ట్ చేయడం లేదనే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడి నుంచి నీటిని సాంకేతికంగా లిఫ్ట్ చేయడం సాధ్యం కాదని ఇంజినీర్లు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసిన నీళ్లు ఎల్లంపల్లికి చేరాలంటే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లను మూసివేయాల్సి ఉంటుందని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. నిర్మాణ లోపాలున్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లను తెరిచే ఉంచాలని ఎన్డీఎస్ఏ హెచ్చరించిన విషయాన్ని గుర్తుచేశారు. దిగువ గోదావరి నుంచి నీరు వృథాగా పోకుండా దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకాల ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా నీటిని లిఫ్ట్ చేసినట్లు సీఎం చెప్పారు. దీంతో ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ఆయకట్టుకు సాగునీరు, తాగునీటిని అందించామన్నారు. గత ప్రభుత్వ హయాంలో దేవాదుల ద్వారా ఏడాదికి సగటున 9.57 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేస్తే..ఈ మూడేండ్లలో సగటున 18.13 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసినట్లు చెప్పారు. గతంతో పోలిస్తే 89 శాతం అధికంగా గోదావరి నీటిని వాడుకున్నట్లు వివరించారు. అక్టోబర్ నాటికి దేవాదుల ద్వారా 16.71 టీఎంసీలు, సీతారామ ద్వారా 8.10 టీఎంసీలు లిఫ్ట్ చేసి 24.81 టీఎంసీల గోదావరి జలాలను సద్వినియోగం చేసుకున్నామని వివరించారు. ఈ సమావేశంలో మూడు బ్యారేజీల పునరుద్ధరణకు రూపొందించిన ప్రణాళికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ అధికారులు వివరించారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగానే మేడిగడ్డ కుంగిపోయిందని, బ్యారేజీల కుంగుబాటుకు దారితీసిన కారణాలను సీఎం వివరించారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి ప్రాణహిత ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే కరువు పరిస్థితుల్లోనూ ఇబ్బందులు ఉండేవి కావన్నారు. సమావేశంలో నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, టన్నెల్స్ అండ్ సేఫ్టీ కార్యదర్శి కల్నల్ పరీక్షిత్ మెహ్రా, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ పాల్గొన్నారు.