ప్రభాత ఉదయం, హైదరాబాద్ : బియ్యం సహా నిత్యావసర సరుకుల ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. కరువు పరిస్థితులు, ఎల్ నినో ప్రభావంతో పంట దిగుబడులు తగ్గడమే ధరల మంటకు కారణమని భావిస్తున్నప్పటికీ, గత కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్న చట్టపరమైన నిర్ణయాలే నింగినంటిన ధరల వెనుక ఉన్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ నిర్ణయాలేంటి ? వాటి వల్ల వ్యాపారులకు ఎలాంటి వెసులుబాటు లభించింది ? ధరల మంటను ఆర్పే దిశగా తెలంగాణ పౌర సరఫరాల శాఖ తీసుకుంటున్న చర్యలేమిటి ? ఈ కథనంలో తెలుసుకుందాం.
ఈ ఉత్తర్వుల వల్లే పరిస్థితి చేయిదాటిందా ?
తెలంగాణలో బియ్యం సహా ఇతర నిత్యావసరాల ధరలు రాకెట్ వేగంతో పెరుగుతున్నాయి. ‘ది రిమూవల్ ఆఫ్ లైసెన్సింగ్ రిక్వైర్మెంట్స్’, స్టాక్ లిమిట్స్ అండ్ మూవ్మెంట్ రిస్ట్రిక్షన్స్ ఆన్ స్పెసిఫైడ్ ఫుడ్స్టఫ్స్ (సవరణ) ఉత్తర్వులను గతంలో కేంద్ర సర్కారు జారీ చేసినందు వల్లే ఇప్పుడీ దుస్థితి వచ్చిందని అధికార వర్గాలు అంటున్నాయి. ‘నిత్యావసర వస్తువుల చట్టం–1955’ ప్రకారం షెడ్యూల్డ్ కమోడిటీస్ (నిత్యావసర వస్తువుల) ఆర్డర్‌ను కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తుంది. చట్టం పరిధిలోకి వచ్చే నిత్యావసరాల సరఫరా, పంపిణీ, ధరలు, నిల్వ పరిమితులను క్రమబద్ధీకరించేందుకు కేంద్ర సర్కారు జారీ చేసే ఉత్తర్వే ‘షెడ్యూల్డ్ కమోడిటీస్ ఆర్డర్’. నిత్యావసర సరుకులు విక్రయించే హోల్ సేల్, రిటైల్ వ్యాపారులతో పాటు మిల్లర్లు కూడా ఫుడ్ గ్రైయిన్ లైసెన్స్‌లు తీసుకోవాలి. ది రిమూవల్ ఆఫ్ లైసెన్సింగ్ రిక్వైర్మెంట్స్, స్టాక్ లిమిట్స్ అండ్ మూవ్మెంట్ రిస్ట్రిక్షన్స్ ఆన్ స్పెసిఫైడ్ ఫుడ్స్టఫ్స్ (సవరణ)ను 2002లో అప్పటి కేంద్ర సర్కారు అమల్లోకి తెచ్చింది. తద్వారా నిత్యావసరాల కొనుగోలు, నిల్వ, రవాణా, పంపిణీపై ఉన్న ఆంక్షలను తొలగించింది.
స్వేచ్ఛా వాణిజ్యంతో తొలగిపోయిన పరిమితులు
గత కేంద్ర ప్రభుత్వాలు స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించాయి. దీంతో ఆహార ధాన్యాలతో ముడిపడిన వ్యాపారాల కోసం లైసెన్స్‌లు తీసుకోవాల్సిన అవసరం లేకుండాపోయింది. వ్యాపారులు ఎన్ని ఆహార ధాన్యాలనైనా నిల్వ చేసుకునే వెసులుబాటు కలిగింది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఆహార ధాన్యాల రవాణాపై ఉన్న ఆంక్షలనూ తొలగించారు. వరి, గోధుమలు, పప్పు ధాన్యాలు, చక్కెర, వంట నూనెలు, బెల్లంలతో వ్యాపారాలు చేసేవారికి కేంద్రం ఉత్తర్వులతో ఊరట లభించింది. అయితే, ఆహార భద్రతకు ఇబ్బంది కలిగిన సమయంలో, యుద్ధాలు జరిగినప్పుడు, ధరలు పెరిగినప్పుడు వ్యాపారులకు ఇచ్చిన సడలింపులను తాత్కాలికంగా నిలిపివేసే అధికారమూ కేంద్రానికి ఉంది.
ధరలు భారీగా పెరిగితేనే జోక్యం
నిత్యావసర సరుకుల చట్టం– 1955 ప్రకారం బియ్యం, పప్పులు, నూనెలు సహా ఇతర సరుకులను వ్యాపారులు కొంతమేర నిల్వ చేసుకోవచ్చు. ఒకవేళ వారి వద్ద అంతకుమించిన స్టాక్ ఉంటే రాష్ట్ర పౌర సరఫరా శాఖాధికారులు తనిఖీలు చేసి, వాటిని మార్కెట్లోకి విడుదల చేయొచ్చు. తద్వారా నిత్యావసరాల ధరలను తగ్గించొచ్చు. అయితే, 2020లో నిత్యావసర సరుకుల చట్టం– 1955లో కేంద్ర ప్రభుత్వం సవరణ చేసింది. పప్పు ధాన్యాలు, నూనె గింజలు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు 50 శాతం, ఉద్యాన పంటల ధరలు 100 శాతం పెరిగితేనే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని ఆ సవరణలో పేర్కొంది. దీని కారణంగా గతంలో మాదిరిగా తెలంగాణలో హోల్ సేల్, రిటైల్ వ్యాపారులపై తాము దాడులు చేసే పరిస్థితి లేకుండాపోయిందని పౌరసరఫరాల శాఖ అధికారులు అంటున్నారు.
కేంద్రానికి పౌరసరఫరాల శాఖ లేఖ
తెలంగాణలో నిత్యావసరాల ధరలు 50 శాతం దాకా పెరగలేదని పౌరసరఫరాల శాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ, రెండు రకాల సరుకుల ధరలు కొంచెం ఎక్కువ స్థాయిలో ఉన్నాయని వారు ఒప్పుకుంటున్నారు. ఈ రెండు సరుకుల ధరలను తగ్గించేందుకు బహిరంగ మార్కెట్లో కౌంటర్లు పెట్టే యోచనలో ఉన్నామని అంటున్నారు. ఇక ధరల అదుపు కోసం, వ్యాపారుల వద్ద ఉండాల్సిన నిత్యావసరాల స్టాక్‌పై పరిమితిని ఎత్తివేయాలని కోరుతూ కేంద్రానికి సివిల్ సప్లయ్స్ శాఖ లేఖ రాసింది. మరోవైపు బియ్యం ధరలను తగ్గించేందుకు లీగల్ మెట్రాలజీ, పోలీస్ శాఖలతో కలిసి సివిల్ సప్లయ్స్ శాఖ దాడులు నిర్వహించింది. దీనికితోడు బియ్యం వ్యాపారులు, మిల్లర్లతో పౌరసరఫరాల శాఖ అధికారులు సమావేశం నిర్వహించారు. బీపీటీలో కేఎన్ఎం రకం ధర రూ.66, ఆర్ఎన్ఆర్ రకం ధర రూ.74, హెచ్ఎంటీ,జేఎస్ఆర్ రకాల ధర రూ.79గా నిర్ణయించారు. ఇంతకంటే ఎక్కువ రేట్లకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.