Nagarkurnool Mahalakshmi Rice Mill CMR Paddy Scam 
తెలంగాణ

రూ. 9.68 కోట్ల ప్రభుత్వ ధాన్యం మాయం!

విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, సివిల్ సప్లై అధికారులు మిల్లుపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. తనిఖీల్లో 94,370 బస్తాల ధాన్యం మిల్లులో లేనట్లు గుర్తించారు.

Madhu

ప్రభాత ఉదయం, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో మరో భారీ సీఎంఆర్ ధాన్యం కుంభకోణం వెలుగు చూసింది. మంతటి గ్రామంలోని మహాలక్ష్మి పార్ బాయిల్డ్ రైస్ మిల్లులో రూ.9 కోట్ల 68 లక్షల విలువ చేసే ప్రభుత్వ ధాన్యం మాయమైనట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది. గురువారం విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, సివిల్ సప్లై అధికారులు మిల్లుపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. తనిఖీల్లో 94,370 బస్తాల ధాన్యం మిల్లులో లేనట్లు గుర్తించారు. 2022-23 నుండి 2025-26 సీజన్ వరకు ప్రభుత్వం సీఎంఆర్ కోసం ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగిస్తున్నది. మిల్లర్లు దానిని బియ్యంగా మార్చి తిరిగి ప్రభుత్వానికి అందించాలి. కానీ, మహాలక్ష్మి మిల్లు యజమానులు ధాన్యాన్ని తిరిగి ఇవ్వకుండా ఏళ్లుగా కాలయాపన చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో దాడులు నిర్వహించారు.

 అధికారులపై ఆరోపణలు

సివిల్ సప్లై జిల్లా అధికారి రాజేందర్ ఫిర్యాదు మేరకు మిల్లు యజమానులైన ఆకుతోట సాయిబాబా, సుదర్శన్‌తోపాటు మరో పది మందిపై పోలీసులు కేసు నమోదు చేసి పంచనామా నిర్వహించారు. గత నెలలో తాడూరు మండలంలోని లక్ష్మీ నరసింహస్వామి రైస్ మిల్లులో కూడా ఇదే తరహాలో దాడులు నిర్వహించి దాదాపు రూ.20 కోట్ల విలువైన ధాన్యం చెల్లించనందుకు కేసు నమోదైంది. నాలుగేళ్లుగా కొన్ని క్లస్టర్ రైస్ మిల్లులు రూ. వందల కోట్ల విలువైన ధాన్యాన్ని తీసుకుని చెల్లించకుండా ప్రభుత్వాన్ని నష్టాల పాలు చేస్తున్నాయి. జిల్లా అధికారుల అలసత్వం, మిల్లర్లతో కుమ్మక్కే ఇందుకు కారణమనే ఆరోపణలు ఉన్నాయి.