ప్రభాత ఉదయం, సంగారెడ్డి : సబ్సిడీ పత్రం కోసం లంచం తీసుకుంటూ సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల వ్యవసాయ అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. ధృవీకరణ పత్రం మంజూరు కోసం వ్యవసాయ శాఖ ఏవో రమేశ్ రూ.20 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధిత రైతు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం రైతు నుంచి ఏవో లంచం తీసుకుంటుండగా వ్యవసాయ శాఖ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి రమేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రమేశ్‌ను విచారణ నిమిత్తం ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు ప్రజలకు సూచించారు.