నల్లమల అటవీ ప్రాంతం.. ప్రకృతి అందాలకే కాదు, శ్రీశైలం, ఉమామహేశ్వరం వంటి ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు కూడా నెలవు. ప్రకృతి సౌందర్యం, పరమశివుడి ఆధ్యాత్మిక తత్వం మేళవించిన ఈ నల్లమల కొండకోనల్లో.. భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న మరో అపురూప శైవ క్షేత్రమే సలేశ్వరం లింగమయ్య స్వామి క్షేత్రం.
నాగర్కర్నూల్ జిల్లా నల్లమల అడవుల్లో, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని ఎత్తైన కొండల మధ్య లోతైన లోయలో సలేశ్వరం లింగమయ్య స్వామి క్షేత్రం నెలకొంది. ఎత్తైన నల్లమల శిఖరాల మధ్య దాగి ఉన్న సలేశ్వరం క్షేత్రం ప్రకృతి ఒడిలోని అద్భుతంగా కనిపిస్తుంది. సముద్ర మట్టానికి దాదాపు 2,700 అడుగుల ఎత్తులో ఉన్న కొండల నుంచి సుమారు 1,000 అడుగుల లోతైన లోయలోకి దిగితే సహజసిద్ధమైన గుహలో లింగమయ్య స్వామి దర్శనమిస్తాడు.
వన్యప్రాణుల ఆవాసం.. దర్శన భాగ్యం కొద్దిరోజులే
కొన్ని భౌగోళిక పరిస్థితులు, అటవీ ప్రాంత పరిమితుల కారణంగా సాధారణ ఆలయాల మాదిరిగా సలేశ్వరం లింగమయ్య స్వామి దర్శనం ఏడాది పొడవునా అందుబాటులో ఉండదు. ఏటా చైత్ర పౌర్ణమిని పురస్కరించుకుని కేవలం మూడు రోజుల పాటు మాత్రమే సలేశ్వరం జాతర జరుగుతుంది. ఆ సమయంలోనే ఆలయ ద్వారాలు భక్తుల కోసం తెరుచుకుంటాయి.
అనాదిగా నల్లమలలో నివసిస్తున్న చెంచు ఆదివాసీలకు లింగమయ్య స్వామి కులదైవం. వారి విశ్వాసాలు, సంప్రదాయాల ప్రకారం చైత్ర పౌర్ణమి (మార్చి–ఏప్రిల్) స్వామివారి ఆరాధనకు అత్యంత పవిత్రమైన సమయం. అందుకే ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం, జాతర జరపడం తరతరాలుగా ఆనవాయితీగా కొనసాగుతోంది.
సలేశ్వరంలో సహజసిద్ధంగా ఏర్పడిన రెండు గుహల్లో స్వామివారు దర్శనమిస్తారు. పై గుహలో ప్రధాన దైవమైన లింగమయ్య స్వామి కొలువై ఉండగా, దిగువ గుహలో మరో శివలింగం ఉంది. క్షేత్ర ప్రాంగణంలో గంగమ్మ, వీరభద్రుడి విగ్రహాలు కూడా భక్తులకు దర్శనమిస్తాయి.
పరిమితి ఎందుకు
సలేశ్వరం క్షేత్రం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (Tiger Reserve)లోని అత్యంత సున్నితమైన ‘కోర్ జోన్’లో ఉంది. పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు సహా అనేక వన్యప్రాణులకు ఇది కీలక ఆవాసం. ఏడాది పొడవునా పెద్దఎత్తున మానవ సంచారం కొనసాగితే వాటి సహజ జీవనానికి, సంతానోత్పత్తికి అంతరాయం కలగడంతోపాటు అడవిలో శబ్ద కాలుష్యం పెరిగే అవకాశం ఉంది.
సలేశ్వరం చేరుకునే మార్గం ప్రయాణానికి అనువుగా ఉండదు. సలేశ్వరం బాట అంత సులభమైనది కాదు. లోయలు, రాతి వాలులు దాటుకుంటూ అడుగులు వేయాల్సి ఉంటుంది. జారే బండరాళ్లు, మార్గమధ్యంలో ఏర్పడే అడ్డంకులతో పాటు అడవిలో సంచరించే వన్యప్రాణులు కూడా ఈ యాత్రను సవాలుగా మారుస్తాయి. భారీగా భక్తులు తరలివస్తే ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త పేరుకుపోవడం, అగ్నిప్రమాదాల ముప్పు కూడా పెరుగుతుంది. అందుకే అడవి పర్యావరణ సమతుల్యతను, వన్యప్రాణుల ఆవాసాన్ని కాపాడటంతోపాటు భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని.. అటవీ శాఖ సలేశ్వరం యాత్రను పరిమిత కాలానికే అనుమతిస్తుంది. ఫలితంగా ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే భక్తులకు ఈ క్షేత్ర దర్శన భాగ్యం లభిస్తుంది.
అమర్నాథ్ యాత్ర అని ఎందుకు అంటారు
హిమాలయాల మంచుకొండల మధ్య సాగే అమర్నాథ్ యాత్రను గుర్తుచేసేలా.. నల్లమల అడవుల్లోని సలేశ్వరం యాత్ర కూడా భక్తి, సాహసం, ప్రకృతి సౌందర్యాల సమ్మేళనంగా సాగుతుంది. అమర్నాథ్ యాత్రలో మంచు గుహలో శివస్వరూపం దర్శనమిస్తే.. ఇక్కడ నల్లమల కొండల మధ్య సహజసిద్ధమైన గుహలో లింగమయ్య స్వామి కొలువై ఉన్నారు. అమర్నాథ్ చేరుకోవాలంటే హిమాలయాల మంచు కొండల మధ్య అత్యంత కఠినమైన సాహసయాత్ర చేయాలి. అదే తరహాలో ‘తెలంగాణ అమర్నాథ్’గా పేరొందిన సలేశ్వరం చేరుకోవాలన్నా దట్టమైన నల్లమల అడవులు, లోతైన లోయలు, నిటారైన రాతిబాటలు దాటుకుంటూ కాలినడకన సాగాల్సిందే. ఈ ప్రయాణం అంత సులభం కాదు. రాళ్లురప్పలతో కూడిన బాటలో కాలినడకన సాగుతూ కొండలను ఎక్కాలి.. లోయలను దాటాలి. ప్రతి అడుగులోనూ సాహసం, ప్రతి మలుపులోనూ ప్రకృతి అబ్బురపరిచే దృశ్యం కనిపిస్తుంది.
ఏడాదిలో పరిమిత కాలంలోనే యాత్రకు అవకాశం ఉండటం, ప్రకృతి ఒడిలోనే శివదర్శనం లభించడం ఈ రెండు క్షేత్రాల మధ్య పోలికను తీసుకొచ్చింది. అందుకే భక్తులు సలేశ్వరాన్ని ‘తెలంగాణ అమర్నాథ్’ లేదా ‘దక్షిణ అమర్నాథ్’గా అభివర్ణిస్తుంటారు.
‘వస్తున్నాం లింగమయ్యా..’
నల్లమల కొండలపై నుంచి జాలువారే జలపాతాలు.. పచ్చదనంతో పరుచుకున్న కొండలు, కోనలు.. లోతైన లోయలు, సహజసిద్ధమైన గుహలు.. ఎటుచూసినా ప్రకృతి రమణీయతే. సలేశ్వరం లోయ దాదాపు 2 కిలోమీటర్ల పొడవుతో అమెరికాలోని ‘గ్రాండ్ క్యాన్యన్’ ను తలపిస్తుంది. ఇలాంటి అపురూపమైన ప్రకృతి ఒడిలో లింగమయ్య స్వామి కొలువుదీరడం నల్లమల వాసులకు దైవానుగ్రహంగా భావిస్తారు.
ఎత్తైన కొండలు, దట్టమైన అడవిని దాటుకుంటూ.. లోతట్టు ప్రాంతంలోని జలపాతాన్ని దాటి.. పున్నమి వెన్నెలలో చెంచుల కులదైవమైన లింగమయ్యను దర్శించుకోవడం తమకు పూర్వజన్మ సుకృతమని భక్తులు విశ్వసిస్తారు. అందుకే రాళ్లు, రప్పలు, ఎత్తుపల్లాలను లెక్కచేయకుండా దాదాపు 4 కిలోమీటర్ల మేర సాగే కాలిబాటలో నడుస్తూ స్వామివారి సన్నిధికి చేరుకుంటారు. ప్రకృతి సవాళ్లను అధిగమిస్తూ సాగే ఈ ప్రయాణమే సలేశ్వరం యాత్రను అత్యంత సాహసోపేతమైన తీర్థయాత్రగా నిలబెడుతోంది.
ఈ యాత్రలో మరో ప్రత్యేకమైన అనుభూతి భక్తుల నామస్మరణ. స్వామివారి దర్శనానికి బయలుదేరినప్పుడు ‘వస్తున్నాం లింగమయ్యా..’ అంటూ, తిరుగు ప్రయాణంలో ‘వెళ్లొస్తాం లింగమయ్యా..’ అంటూ దారిపొడవునా భక్తులు చేసే నామస్మరణ నల్లమల నిశ్శబ్దాన్ని ఆధ్యాత్మికతతో నింపుతుంది.
ఇక్ష్వాకుల కాలం నాటి ఆనవాళ్లు.. విష్ణుకుండినుల చిహ్నాలు
సలేశ్వరం క్షేత్రానికి ప్రాచీన చరిత్ర ఉందనడానికి అక్కడ కనిపించే నిర్మాణ ఆనవాళ్లు ఆధారాలుగా నిలుస్తున్నాయి. ఇక్కడ లభించిన 16"/10"/3" పరిమాణం గల ఇటుకలు ఇక్ష్వాకుల కట్టడాలను సూచిస్తున్నాయి (క్రీ.శ.260 కాలం నాటి). నాగార్జునకొండ శాసనాల్లోని బౌద్ధ క్షేత్రం 'చుళదమ్మగిరి' (సుళ) కాలక్రమేణా శైవ క్షేత్రంగా మారి 'సలేశ్వరం' అయిందనే ఒక అభిప్రాయం ఉంది.
ఇక సలేశ్వరం క్షేత్రంలో విష్ణుకుండినుల కాలానికి చెందిన నిర్మాణ ఆనవాళ్లు కూడా ఉన్నట్లు ప్రస్తావనలు ఉన్నాయి. దిగువ గుహలోని గర్భగుడి ముఖద్వారం పైన కనిపించే ‘పూలకుండి’ ఆకారంలోని శిలాఫలకం, 10"/10"/3" పరిమాణం ఉన్న పరిమాణం ఉన్న ఇటుకలు విష్ణుకుండినుల కాలానికి సంబంధించినగా పేర్కొంటారు (క్రీ.శ.360-70 కాలం నాటి).
క్షేత్ర మహత్యంలో పేర్కొన్న రుద్ర, విష్ణు, బ్రహ్మ కుండాల ఆధారంగా విష్ణుకుండినులు ఈ ప్రాంతం నుంచే ఎదిగి ఆ పేరు తెచ్చుకున్నారని కొంత మంది చరిత్రకారులు నిరూపించారు కూడా.
ఇక్కడి రాతిగోడపై 7వ శతాబ్దపు బ్రాహ్మీలిపిలో ‘శ్రీ ఉత్పత్తి పిడుగు’ (బౌద్ధ, జైనాలపై శైవుల ఉద్యమ నినాదం), 9వ శతాబ్దపు దేవనాగరిలో ‘శ్రీ విశిష్ట కంకాళధారి’ అనే శాసనాలు ఉన్నాయి. ఈ ఆధారాలు సలేశ్వరం క్షేత్ర చరిత్రను మరింత ప్రాచీనంగా చూపిస్తున్నాయి.
ఎలా వెళ్లాలంటే..
సలేశ్వరం చేరుకోవడానికి ప్రధానంగా రెండు మార్గాలు ఉన్నాయి. శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారి మీదుగా కొంత దూరం వాహనంలో ప్రయాణించి, అక్కడి నుంచి కాలినడకన వెళ్లే మార్గం ఒకటి. పూర్తిగా కాలినడకన సాగే మరో మార్గం కూడా ఉంది.
వాహనంలో కొంత దూరం.. ఆపై కాలినడకన..
శ్రీశైలం మార్గంలో చెంచుపెంటల మీదుగా కొంత దూరం వాహనాల్లో, మరికొంత దూరం కాలి నడకన ప్రయాణించాలి. ముందుగా హైదరాబాద్-శ్రీశైలం రహదారిలో అమ్రాబాద్ మండలంలోని మన్ననూరు చెక్పోస్ట్ నుంచి 15 కిలోమీటర్లు ప్రయాణించి ఫరహాబాద్ జంక్షన్ (పులిబొమ్మ) చేరుకోవాలి. అక్కడ అటవీశాఖ అధికారుల అనుమతులతో లోపలికి ప్రవేశించి, దట్టమైన అడవుల గుండా దాదాపు 30-35 కిలోమీటర్లు వాహనాల్లో వెళ్లిన తర్వాత అంటే సలేశ్వరానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేస్ పాయింట్ వద్ద వాహనాలను నిలిపేస్తారు. అక్కడి నుంచి మిగతా 4 కిలోమీటర్ల దూరం లోతైన లోయలు, కొండల గుండా కాలినడకన ప్రయాణించి సలేశ్వరం క్షేత్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.
పూర్తిగా కాలినడకన వెళ్లాలంటే..
పూర్తిగా నడక మార్గాన సలేశ్వరం చేరుకోవాలనుకునేవారు నాగర్కర్నూల్ జిల్లా బల్మూరు, లింగాల మండలాల మీదుగా వెళ్లే మార్గాన్ని ఎంచుకోవచ్చు. అప్పాయిపల్లి వైపు నుంచి సుమారు 30 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత తాగునీటి సదుపాయం ఉంటుంది. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని, మరో సుమారు 20 కిలోమీటర్లు నడక మార్గంలో ప్రయాణిస్తే సలేశ్వరం క్షేత్రానికి చేరుకోవచ్చు. సలేశ్వరం మార్గం మొత్తం దట్టమైన అటవీ ప్రాంతం, బండరాళ్లు, ఎత్తుపల్లాలతో నిండి ఉంటుంది. వన్యప్రాణుల సంచారం ఉండే ఈ ప్రాంతంలో భక్తుల భద్రత కోసం అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతుంది. రాళ్లపై అడుగులు జారకుండా బ్యాలెన్స్ కోసం చాలామంది చేతికర్రలు పట్టుకుని నడుస్తారు.