సీపీఎం నేత సామినేని రామారావు హత్య కేసును ఛేదించి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. 
తెలంగాణ

వీడిన సీపీఎం నేత ‘సామినేని’ హత్య మిస్టరీ

ఖమ్మం జిల్లా పాతర్లపాడులో గతేడాది హత్యకు గురైన సీపీఎం నేత సామినేని రామారావు కేసును పోలీసులు ఏడాది తర్వాత ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు.

Phaneendra

ప్రభాత్ ఉదయం, ఖమ్మం : సీపీఎం సీనియర్ నాయకుడు సామినేని రామారావు హత్య మిస్టరీని ఏడాది తర్వాత పోలీసులు ఛేదించారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం సీపీ సునీల్‌దత్ గురువారం ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం, మధిర అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, సీపీఎం నేత సామినేని రామారావు గతేడాది అక్టోబర్ 31న హత్యకు గురయ్యారు. వాకింగ్‌కు వెళ్లిన ఆయనను అతని ఇంటి పక్కన ఉన్న కొట్టంలో ఎవరో హత్యచేశారు. ఈ ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. సీపీఎం, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ దుమారం రేగింది. గుర్తుతెలియని దుండగుల చేతిలో హతమైనట్లు చింతకాని పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు బోడపట్ల శ్రీనివాసరావు అలియాస్ మెంటల్ శ్రీను, నూకల లింగయ్య, మల్లారపు లక్ష్మయ్య, కర్లపూడి ఉదయ్‌కుమార్ అలియాస్ రుక్మన్‌కుమార్‌ను నిందితులుగా గుర్తించినట్టు సీపీ తెలిపారు. వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపినట్లు చెప్పారు. దర్యాప్తుకు సహకరించిన ఏసీపీ సారంగపాణి, సీఐ వెంకట ప్రసాద్, ఎస్ఐలు వీరేందర్, నరేశ్, ఇతర అధికారులను సీపీ అభినందించారు.