తెలంగాణ అడవుల్లో కొలువైన వనదేవతలు.. కోట్లాది మంది భక్తుల కొంగుబంగారాలు.. అన్యాయాన్ని ఎదిరించి, తమ ప్రజల కోసం పోరాడిన వీరమాతలుగా సమ్మక్క–సారలమ్మకు తరతరాలుగా ప్రత్యేక స్థానం ఉంది. మేడారం గడ్డపై రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతర కేవలం ఒక ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాదు.. ఆదివాసీ సంప్రదాయాలు, ప్రకృతి ఆరాధన, వీరత్వం, త్యాగం, సామూహిక విశ్వాసాల సమ్మేళనం. కులమతాలకు అతీతంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చి వనదేవతలకు మొక్కులు చెల్లించుకునే ఈ జాతర.. తెలంగాణ జానపద, గిరిజన సంస్కృతికి అద్దం పడుతుంది. అసలు సమ్మక్క–సారలమ్మ ఎవరు? వారి వీరగాథ ఏమిటి? మేడారం జాతర ఇంతటి విశిష్టతను ఎలా సంతరించుకుంది? తెలుసుకుందాం.
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని రేగులపల్లి అడవుల్లో ఉన్న మేడారం గ్రామంలో సమ్మక్క–సారలమ్మ జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి (ద్వైవార్షిక) అత్యంత వైభవంగా జరుగుతుంది. కోట్లాది మంది భక్తులు హాజరయ్యే ఈ ఉత్సవాన్ని "ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళా"గా అభివర్ణిస్తారు.
పోరాటం నుంచి దైవత్వం వరకు.. సమ్మక్క–సారలమ్మల వీరగాథ
మేడారం అడవుల్లో , కొండకోనల నడుమ కొలువుదీరే సమ్మక్క–సారలమ్మల మహా జాతరకు దాదాపు 900 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. క్రీస్తుశకం 12వ శతాబ్దంలో ప్రస్తుత జగిత్యాల (నాటి కరీంనగర్) సమీపంలోని పొలవాస ప్రాంతాన్ని ఏలే గిరిజన నాయకుడు మేడరాజు ఏకైక పుత్రికే సమ్మక్క. ఈమెను మేడారాన్ని పాలించే తన మేనల్లుడు పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం జరిపిస్తారు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ అనే కుమార్తెలు, జంపన్న అనే కుమారుడు జన్మిస్తారు.
అయితే, రాజ్యాక్రమణ కాంక్షతో కాకతీయ చక్రవర్తి మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండయాత్ర చేయడంతో... మేడరాజు తన రాజ్యాన్ని కోల్పోయి మేడారంలో అజ్ఞాతంలోకి వెళ్తాడు. మరోవైపు, కాకతీయుల సామంతుడిగా ఉన్న పగిడిద్దరాజు ఆ సమయంలో వచ్చిన తీవ్ర కరువు కారణంగా కప్పం చెల్లించలేకపోతాడు. కప్పం చెల్లించకపోవడమే కాకుండా, శత్రువైన మేడరాజుకు ఆశ్రయం ఇవ్వడం మరియు గిరిజనులలో కాకతీయ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు రగిల్చారనే ఆగ్రహంతో ప్రతాపరుద్రుడు మేడారంపై యుద్ధ ప్రకటన చేస్తాడు. తన మంత్రి యుగంధరుడి వ్యూహం మేరకు మాఘ శుద్ధ పౌర్ణమి నాడు కాకతీయ సైన్యాలు మేడారంపై దాడి చేస్తాయి.
అత్యాధునిక సైన్యాన్ని ఎదుర్కొనేందుకు కోయ వీరులు తమ సాంప్రదాయ బాణాలు, ఈటెలతో గెరిల్లా పోరాటానికి దిగుతారు. పగిడిద్దరాజు, సమ్మక్క, సారలమ్మ, నాగులమ్మ, జంపన్న, గోవిందరాజులు వేర్వేరు దళాలకు నాయకత్వం వహించి వీరోచితంగా పోరాడతారు. కానీ సుశిక్షితమైన కాకతీయ విశాల సేనల ధాటికి మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు వీరమరణం పొందుతారు. ఈ పరాజయాన్ని జీర్ణించుకోలేని జంపన్న సంపెంగ వాగులో దూకి ప్రాణత్యాగం చేస్తాడు; నాటి నుండి ఆ నది 'జంపన్న వాగు'గా రూపాంతరం చెందింది.
కుటుంబమంతా నేలకొరిగినా సమ్మక్క ఒంటరిగానే కాకతీయ సైన్యాన్ని అల్లాడించి, తన అద్భుత సమర నైపుణ్యంతో ప్రతాపరుద్రుడిని సైతం విస్తుపోయేలా చేస్తుంది. చివరకు శత్రువుల దాడిలో గాయపడిన సమ్మక్క, రక్తపు మడుగులోనే యుద్ధభూమిని వీడి చిలుకలగుట్ట వైపు వెళ్తూ దారిలోనే అంతర్ధానమవుతుంది. దేవిని వెతుక్కుంటూ వెళ్లిన గిరిజనులకు ఒక పుట్ట సమీపంలో పసుపు, కుంకుమలతో కూడిన భరిణ లభిస్తుంది. దాన్నే సమ్మక్క స్వరూపంగా భావించిన గిరిజనులు, నాటి నుండి ప్రతి రెండు సంవత్సరాలకొకసారి మాఘ శుద్ధ పౌర్ణమి వేళ ఈ మహా జాతరను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.
జంపన్న వాగు.. త్యాగానికి గుర్తుగా
మేడారం జాతరలో జంపన్న వాగుకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. జానపద సంప్రదాయం ప్రకారం సమ్మక్క కుమారుడైన జంపన్న కాకతీయ సైన్యంతో జరిగిన పోరులో వీరమరణం పొందిన ప్రదేశంతో ఈ వాగుకు సంబంధం ఉందని విశ్వసిస్తారు. అందుకే జంపన్న వాగును ఆయన త్యాగానికి గుర్తుగా భక్తులు భావిస్తారు. జాతర సమయంలో భక్తులు ఈ వాగును పవిత్రంగా భావించి స్నానాలు ఆచరిస్తారు.
కోయ పూజారులే ప్రత్యేకత
మేడారం జాతరలో మరో ముఖ్యమైన ప్రత్యేకత పూజా విధానాలు. సమ్మక్క–సారలమ్మకు సంబంధించిన ప్రధాన పూజా కార్యక్రమాలను కోయ గిరిజన పూజారులే తమ సంప్రదాయాల ప్రకారం నిర్వహిస్తారు. ఇది జాతరను ఇతర పెద్ద హిందూ పుణ్యక్షేత్రాల ఉత్సవాల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టే అంశాల్లో ఒకటి.
ఆలయం కంటే గద్దెలకే ప్రాధాన్యం
మేడారం ఆరాధనా సంప్రదాయంలో సాధారణ దేవాలయ నిర్మాణం కంటే గద్దెలు ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంటాయి. దేవతలను అటవీ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి గద్దెలపై కొలువుదీర్చడం, అక్కడ భక్తులు మొక్కులు చెల్లించుకోవడం జాతరలో ప్రధానమైన ఆచారం.
నాలుగు రోజులు.. నాలుగు ప్రత్యేక ఘట్టాలు
మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర రెండేళ్లకోసారి, మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా నాలుగు రోజుల పాటు జరుగుతుంది. తరతరాలుగా వస్తున్న ఆదివాసీ కోయ పూజారులే ఈ పవిత్ర క్రతువులను నిర్వహిస్తారు.
మొదటి రోజు..దేవతల ఆగమనం
మేడారం జాతరలో సారలమ్మ ఆగమనం అత్యంత కీలకమైన ఘట్టాల్లో ఒకటి. మేడారానికి సమీపంలోని కన్నెపల్లి గ్రామంలోని సారలమ్మ ఆలయంలో ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం పూజారులు అమ్మవారి ప్రతిరూపాన్ని మేడారం గద్దెల వైపు తీసుకువస్తారు. జంపన్న వాగు మీదుగా సారలమ్మను గద్దెకు చేర్చి అక్కడ కొలువుదీరుస్తారు.
సమ్మక్క–సారలమ్మలతో పాటు వారి కుటుంబ సభ్యులుగా భావించే ఇతర వనదేవతల రాక కూడా జాతరలో ప్రత్యేకతను సంతరించుకుంటుంది. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్ల నుంచి సారలమ్మ తండ్రిగా కొలిచే పగిడిద్దరాజును, ఏటూరునాగారం మండలం కొండాయి ప్రాంతం నుంచి గోవిందరాజును పూజారులు సంప్రదాయబద్ధంగా మేడారం తీసుకువస్తారు. అనంతరం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువుదీరుతారు. ఇదే సమయంలో అంతకుముందు రోజు జంపన్నను కూడా ప్రత్యేక పూజల అనంతరం జంపన్న వాగు పరిసరాలకు తీసుకువచ్చి ప్రతిష్ఠించే ఆచారం కొనసాగుతోంది.
రెండో రోజు..సమ్మక్క ఆగమనం
జాతర రెండో రోజు ఉదయం నుంచే మేడారంలో ప్రధాన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. పూజారులు వనానికి వెళ్లి కంకవనం కోసం వెదురు కర్రలను తీసుకువచ్చి గద్దెల వద్ద ప్రతిష్ఠిస్తారు. అనంతరం సమ్మక్క పూజా గృహం నుంచి పసిడి కుండలను తీసుకొచ్చి గద్దెలపై ఏర్పాటు చేస్తారు. ఇదే సమయంలో చిలుకలగుట్టపై నారచెట్టు సమీపంలో కుంకుమ భరిణ రూపంలో కొలువైన సమ్మక్కను మేడారం తీసుకువచ్చే ప్రక్రియ మొదలవుతుంది. సమ్మక్కను తీసుకురావడానికి ప్రధాన వడ్డె సంప్రదాయ పూజా విధానాలను నిర్వహిస్తూ చిలుకలగుట్టపైకి వెళ్తారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం కుంకుమ భరిణను తీసుకుని గుట్ట నుంచి కిందికి వస్తారు. వనదేవత మేడారం వైపు పయనించే సమయంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితర అధికారులు అధికారికంగా స్వాగతం పలుకుతారు. సమ్మక్క ఆగమనాన్ని సూచించే సమయంలో జిల్లా ఎస్పీ గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించడం జాతరలో ప్రత్యేకమైన ఘట్టం. సమ్మక్క రాక కోసం ఎదురుచూస్తున్న భక్తులు ఈ సమయంలో భక్తిపారవశ్యంలో మునిగిపోతారు. గద్దెల వద్దకు చేరుకున్న సమ్మక్కకు సంప్రదాయబద్ధంగా ఎదురుకోళ్లతో స్వాగతం పలికి కొలువుదీరుస్తారు. మాఘ శుద్ధ పౌర్ణమి ఘడియలు ప్రవేశించడంతో మేడారం మహాజాతర ప్రధాన ఘట్టం అధికారికంగా ప్రారంభమవుతుంది. సమ్మక్క గద్దెపై కొలువుదీరడంతో జాతర భక్తి, ఆధ్యాత్మికత, ఆదివాసీ సంప్రదాయాల సమ్మేళనంగా మరింత వైభవాన్ని సంతరించుకుంటుంది.
మూడో రోజు..భక్తులకు దర్శనం
జాతర మూడో రోజు సమ్మక్క–సారలమ్మలు మేడారం గద్దెలపై కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు గద్దెల వద్దకు చేరుకుని అమ్మవార్లను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు.
తమ కోరికలు నెరవేరాలని కోరుతూ భక్తులు కానుకలు సమర్పిస్తారు. కొందరు నిలువుదోపిడీ మొక్కులు చెల్లించుకోగా, మరికొందరు తలనీలాలు సమర్పించడం, తులాభారం వంటి ఆచారాలను పాటిస్తారు. సమ్మక్క–సారలమ్మలను తమ ఆడబిడ్డలుగా భావించే మహిళలు ఒడిబియ్యం సమర్పించి, చీరసారెలతో అమ్మవార్లను కొలుస్తారు. జాతరలో అత్యంత రద్దీ కనిపించే రోజుల్లో మూడో రోజు ఒకటి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భారీ సంఖ్యలో భక్తులతో మేడారం గద్దెల పరిసరాలు కిక్కిరిసిపోతాయి. భక్తి, మొక్కులు, సంప్రదాయ ఆచారాలతో జాతర ప్రాంగణం సందడిగా మారుతుంది.
నాలుగో రోజు..దేవతల వన ప్రవేశం
జాతర నాలుగో రోజుతో మేడారంలో ప్రధాన ఉత్సవ ఘట్టాలు ముగింపునకు చేరుకుంటాయి. నాలుగు రోజుల పాటు భక్తులకు దర్శనమిచ్చిన సమ్మక్క–సారలమ్మలను సంప్రదాయ పూజా కార్యక్రమాల అనంతరం తిరిగి వారి వనస్థానాలకు సాగనంపుతారు. ఈ వనప్రవేశంతో మేడారం మహాజాతర ముగుస్తుంది.
బంగారమైన బెల్లం.. వనదేవతలకు విశిష్ట నైవేద్యం
మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర అంటేనే భక్తి, మొక్కు, సంప్రదాయాల సంగమం. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం మహోత్సవం.. గిరిజన సంస్కృతి, విశ్వాసాలు, సంప్రదాయ ఆచారాల సమాహారంగా ప్రతి అడుగులోనూ ఓ ప్రత్యేకతను ఆవిష్కరిస్తుంది. వాటిలో అన్నింటి కంటే ప్రత్యేకమైనది అమ్మవార్లకు బెల్లాన్ని ‘బంగారం’గా సమర్పించే సంప్రదాయం. భక్తులు తమ మొక్కు తీర్చుకునేందుకు తీసుకొచ్చే బెల్లం.. అమ్మవార్ల సన్నిధికి చేరే సరికి ‘బంగారం’గా మారిపోతుంది. సాధారణంగా దేవతలకు పండ్లు, పూలు, ప్రసాదాలు, పానీయాలు వంటి నైవేద్యాలను సమర్పిస్తారు. కానీ మేడారంలో మాత్రం సమ్మక్క–సారలమ్మలకు బెల్లం సమర్పించడం అనాదిగా వస్తున్న ప్రత్యేక ఆచారం. తమ కోరిక నెరవేరిన తర్వాత భక్తులు తమ బరువుకు సమానమైన బెల్లాన్ని తూకం వేసి అమ్మవార్లకు సమర్పిస్తారు. అందుకే దీనిని సాధారణ బెల్లంగా కాకుండా ‘బంగారం’ అని భక్తులు ఆప్యాయంగా పిలుస్తారు.
పూర్వకాలంలో మేడారం జాతర ప్రధానంగా అడవుల్లో నివసించే గిరిజన సమాజానికే పరిమితమై ఉండేదని స్థానిక కథనాలు చెబుతున్నాయి. అప్పట్లో నేటిలా అన్ని ఆహార పదార్థాలు సులభంగా అందుబాటులో ఉండేవి కావు. ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావాల్సిన వస్తువుల్లో బెల్లం, ఉప్పు కూడా ముఖ్యమైనవిగా ఉండేవని చెబుతారు. అందులోనూ బెల్లానికి గిరిజనుల జీవన విధానంలో ప్రత్యేక స్థానం ఉండేది. అడవుల్లో సుదీర్ఘ ప్రయాణాలు చేసే సమయంలో త్వరగా శక్తినిచ్చే ఆహారంగా బెల్లాన్ని ఉపయోగించేవారు. అందుకే వారికి బెల్లం విలువైన వస్తువుగా మారింది. తాము విలువైనదిగా భావించే బెల్లాన్నే తమ వనదేవతలకు నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీగా మారిందని స్థానికులు చెబుతారు.
‘బంగారం’ అనే పేరుకు సంబంధించి మరో స్థానిక విశ్వాసం కూడా ప్రచారంలో ఉంది. సమ్మక్క భర్త పేరు పగిడిద్ద రాజు. ఆయన పేరులోని ‘పగిడి’కి బంగారం అనే అర్థం ఉందని కొందరు భావిస్తారు. ఈ విశ్వాసం ఆధారంగానే బెల్లాన్ని ‘బంగారం’గా పిలవడం మొదలైందనే కథనం కూడా మేడారం ప్రాంతంలో వినిపిస్తుంది.
మేడారం జాతరకు పూర్వం భక్తులు చాలా దూర ప్రాంతాల నుంచి ఎడ్లబండ్లపై ప్రయాణించి వచ్చేవారని స్థానిక కథనాలు చెబుతున్నాయి. జాతర కోసం వచ్చేవారు కొన్ని రోజులపాటు ఇక్కడే బస చేసేవారని, ఆ సమయంలో సులభంగా శక్తినిచ్చే ఆహారంగా బెల్లాన్ని వినియోగించేవారని చెబుతారు.
బెల్లంతో తయారు చేసిన పానకం లేదా ఇతర ఆహార పదార్థాలు అలసటను తగ్గించేందుకు ఉపయోగపడేవి. తమ ప్రయాణంలో తమకు శక్తినిచ్చిన బెల్లాన్నే అమ్మవార్లకు సమర్పించడం ద్వారా కృతజ్ఞతను వ్యక్తం చేసే ఆచారం ఏర్పడిందనే అభిప్రాయం కూడా ఉంది. కాలక్రమంలో ఈ నైవేద్యం కేవలం ఆహార పదార్థంగా కాకుండా మొక్కుబడికి ప్రతీకగా మారింది. ‘అమ్మవారికి బెల్లం సమర్పిస్తే మొక్కు తీరుతుంది’ అనే విశ్వాసం తరతరాలకు కొనసాగుతూ వచ్చింది.
అమ్మవార్లకు సమర్పించిన బంగారం ఏం చేస్తారు?
మేడారంలో భక్తులు సమర్పించే బెల్లాన్ని పవిత్రమైన ప్రసాదంగా భావిస్తారు. మొక్కు తీర్చుకున్న తర్వాత అమ్మవార్లకు సమర్పించిన ఈ ‘బంగారం’లో కొంత భాగాన్ని భక్తులు పవిత్రమైన ప్రసాదంగా తిరిగి తమతో ఇళ్లకు తీసుకెళ్తారు. తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పొరుగువారితో ఈ బెల్లాన్ని పంచుకోవడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. వనదేవతల కృపాకటాక్షాలు నిండిన ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే ఇంట శుభం జరుగుతుందని, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, అరిష్టాలు తొలగిపోయి సకల సౌభాగ్యాలు సిద్ధరిస్తాయని భక్తులు దృఢంగా నమ్ముతారు. గద్దెల వద్ద సేకరించిన బెల్లాన్ని దేవాదాయ శాఖ మరియు పూజారుల సమక్షంలో సంచుల్లోకి ఎత్తుతారు. దర్శనం ముగించుకుని బయటకు వచ్చే లక్షలాది మంది భక్తులకు దీనిని ఉచితంగా 'దివ్య ప్రసాదం'గా పంచుతారు. జాతర ముగిసిన తర్వాత కూడా మిగిలి ఉన్న అపారమైన బెల్లాన్ని దేవాదాయ శాఖ భద్రపరుస్తుంది. దీనిని వివిధ అవసరాలో కోసం వినియోగిస్తారు.
మేడారం బాటలో గట్టమ్మ తల్లి.. ఆ తర్వాతే సమ్మక్క దర్శనం
మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులకు గట్టమ్మ తల్లి దర్శనం ఒక ముఖ్యమైన సంప్రదాయంగా కొనసాగుతోంది. వరంగల్–ములుగు ప్రధాన రహదారిపై ములుగుకు సమీపంలో ఉన్న గట్టమ్మ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాతే భక్తులు మేడారం వైపు పయనిస్తారు. స్థానిక విశ్వాసాల ప్రకారం గట్టమ్మ తల్లి భక్తుల కోరికలు తీర్చే దేవతగా ప్రసిద్ధి చెందింది. ములుగు ప్రాంత ప్రజల సామాజిక, ఆధ్యాత్మిక జీవనంలోనూ గట్టమ్మ ఆరాధనకు ప్రత్యేక స్థానం ఉంది. కుటుంబాల్లో శుభకార్యాలు జరిగినప్పుడు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. తమకు శుభం కలగాలని కోరుకునే భక్తులు కూడా గట్టమ్మకు మొక్కులు చెల్లించుకుంటారు.
ఎదురుకోళ్లు.. అమ్మవారికి స్వాగతంగా సాగే ఆచారం
సమ్మక్క-సారలమ్మల మహా జాతరలో అత్యంత ప్రసిద్ధి చెందిన, భక్తులు ఎంతో ఆసక్తిగా నిర్వహించే పవిత్ర ఆచారం 'ఎదురుకోళ్లు'. దేవతలు ఇద్దరూ మేడారం గద్దెలపైకి వేంచేపు చేసే ఆ శుభ సమయంలో భక్తులు ఈ క్రతువును నిర్వహిస్తారు. తాము సమర్పించుకుంటామని మొక్కుకున్న కోడిని గద్దెల వద్ద గాల్లోకి ఎగురవేయడాన్నే 'ఎదురుకోళ్లు' అని పిలుస్తారు. దేవి తమ మొక్కును స్వీకరించిందని భావించిన అనంతరం, ఆ కోడిని బలి ఇచ్చి అమ్మవార్లకు నిష్టతో నైవేద్యంగా సమర్పించడం తరతరాలుగా వస్తున్న ఆచారం.
బండారి.. మేడారం భక్తిలో పసుపుకు ప్రత్యేక స్థానం
మేడారం జాతర ప్రాంగణంలో లభించే 'బండారి' (పసుపు-కుంకుమలు) ని భక్తులు అత్యంత పవిత్రమైన దివ్య ప్రసాదంగా భావిస్తారు. సమ్మక్క తల్లి యుద్ధభూమి నుండి చిలుకలగుట్ట వైపు వెళ్లి అదృశ్యమైన సమయంలో, ఆమె ఆనవాలుగా పసుపు, కుంకుమలతో కూడిన భరిణ లభించింది. అందుకే ఈ బండారిని సాక్షాత్తు సమ్మక్క దేవి స్వరూపంగా కొలుస్తారు. దర్శనం క్యూలైన్లలో సాగుతున్న సమయంలో పూజారులు చల్లే ఈ పసుపు-కుంకుమలను అందుకోవడానికి లక్షలాది మంది భక్తులు తపిస్తారు. అలా లభించిన బండారిని ఇంటికి తీసుకువెళ్లి కుటుంబసభ్యులంతా బొట్టుగా ధరిస్తే సకల అరిష్టాలు తొలగిపోయి, కష్టాల నుండి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు.
విగ్రహాలు లేని ప్రకృతి ఆరాధన
మేడారం జాతర ప్రధాన విశిష్టత ఇక్కడ ఎలాంటి విగ్రహాలు లేకపోవడమే. ఇక్కడి రెండు పవిత్ర గద్దెల్లో ఒకదానిని సమ్మక్క దేవిగా, మరొకదానిని సారలమ్మ తల్లిగా కొలుస్తారు. ఈ గద్దెల నడుమ ఉండే నారేప చెట్టు కాండాలు, మనిషెత్తు ఉండే వెదురు కంకమొదళ్లే ఇక్కడి దైవ స్వరూపాలు. అమ్మవార్లను సాక్షాత్తు పసుపు, కుంకుమల ప్రతిరూపాలుగా భక్తులు ఆరాధిస్తారు. గద్దెల వద్ద లభించే పసుపు-కుంకుమలను ప్రసాదంగా ధరిస్తే సకల శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు. చిలుకలగుట్ట నుండి అమ్మవార్ల శక్త్యారాధనతో వచ్చే వడ్డెలు (పూజారులు) తమ పైనుంచి నడిచి వెళితే జన్మ ధన్యమవుతుందనే నమ్మకంతో భక్తులు మార్గమధ్యంలో నేలపై సాష్టాంగ నమస్కారాలు చేయడం ఇక్కడి ప్రత్యేక ఆచారం.
ఆదివాసీ పండుగ నుంచి ప్రపంచస్థాయి మహాజాతరగా
మేడారం జాతర స్థానిక గిరిజన ఆరాధనా సంప్రదాయం నుంచి భారీ స్థాయి ప్రజా సమాగమంగా రూపాంతరం చెందింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తుంటారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర తొలినాళ్లలో ప్రధానంగా స్థానిక గిరిజన సమాజానికే పరిమితమైన ఆధ్యాత్మిక ఉత్సవంగా కొనసాగిందని సంప్రదాయ కథనాలు చెబుతున్నాయి. మేడారం జాతరను 1940వ సంవత్సరం వరకు కేవలం స్థానిక గిరిజనులు మాత్రమే చిలుకలగుట్ట ప్రాంగణంలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునేవారు. కాలాక్రమంలో భక్తుల రద్దీ పెరగడంతో జాతరను కొండపై నుంచి కింద ఉన్న మేడారం గ్రామానికి, గద్దెల వద్దకు మార్చారు. ఈ సమయంలో నిజాం పాలన కింద స్థానిక గిరిజన పూజారులు (సిద్ధబోయిన, కాక వంశస్థులు), గూడెం పెద్దలే నిర్వహణ బాధ్యతలు చూసేవారు. 1946లో అప్పటి వరంగల్ సుబేదార్ అమీర్ అలీ ఖాన్ పర్యవేక్షణలో యాత్రికుల సౌకర్యాలు, నిర్వహణ చర్యలు చేపట్టినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి.
1948 తర్వాత రవాణా సౌకర్యాలు కాస్త మెరుగుపడటంతో భక్తుల సంఖ్య వేలకు చేరింది. దీంతో వరంగల్ ప్రాంతీయ నాయకులు, గిరిజనేతర ప్రజాప్రతినిధులతో కూడిన తాత్కాలిక కమిటీలు తాగునీరు, తాత్కాలిక వసతులు, శాంతిభద్రతల సమన్వయం చేపట్టడం ప్రారంభించాయి.
భక్తుల సంఖ్య విపరీతంగా పెరగడంతో ఆధ్యాత్మిక, ఇతర లావాదేవీలను క్రమబద్ధీకరించేందుకు 1968 ఏప్రిల్ 27న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ శాఖ పరిధిలోకి మేడారం క్షేత్రాన్ని తీసుకొచ్చింది. అప్పటి ములుగు ఎమ్మెల్యే సంతోష్ చక్రవర్తిని మేడారం సమ్మక్క-సారక్క ఆలయ ట్రస్ట్ బోర్డు మొదటి చైర్మన్‌గా నియమించారు.
కాలక్రమేణా సమ్మక్క–సారలమ్మలపై భక్తుల విశ్వాసం నలుదిశలా వ్యాపించింది. అమ్మవార్ల మహిమ, జాతర విశిష్టత గురించి తెలిసిన కొద్దీ భక్తుల రాక పెరిగి.. ఒకప్పుడు అడవిబిడ్డల ఆరాధనగా ఉన్న ఈ ఉత్సవం నేడు కోట్లాది భక్తులను ఆకర్షించే మహాజాతరగా ఎదిగింది. మహా జాతర ప్రాముఖ్యతను గుర్తించిన నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996వ సంవత్సరంలో మేడారం జాతరను అధికారిక రాష్ట్ర పండుగగా ప్రకటించింది. 1998 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది.
2026లో వచ్చింది 2.5 కోట్ల మంది భక్తులు
2026 జాతరకు సుమారు 2.5 కోట్ల మంది భక్తులు వచ్చినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఏర్పాటు చేసిన 828 హుండీల ద్వారా రూ. 13.51 కోట్ల ఆదాయం (విదేశీ కరెన్సీతో కలిపి). భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల్లో 486.5 గ్రాముల బంగారం. 31 కిలోల 700 గ్రాముల వెండి, 16 దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ కూడా లభించింది. దేవాదాయ శాఖ చట్టం ప్రకారం హుండీ ద్వారా వచ్చిన నగదు ఆదాయంలో 33 శాతం సొమ్మును మేడారం గిరిజన పూజారులకు అందిస్తారు. మిగిలిన సొమ్మును ఆలయ శాశ్వత అభివృద్ధి, నిర్వహణ, భక్తుల వసతుల కల్పనకు ఉపయోగిస్తారు.
జాతర మాత్రమే కాదు..సామాజిక, ఆర్థిక పురోగతికి ఇంజిన్
మేడారం జాతర భక్తి సాగరంలో ముంచెత్తడమే కాకుండా, అటవీ ప్రాంత ప్రజల సామాజిక, ఆర్థిక పురోగతికి ఇంజిన్‌గా పనిచేస్తుంది. గిరిజన సమాజం, స్థానిక ఆర్థిక వ్యవస్థ, పర్యాటకం, ఉపాధి, వ్యాపార రంగాలపై ప్రభావం చూపే భారీ సామాజిక–ఆర్థిక ఉత్సవంగా చూడవచ్చు. ఈ జాతర సమయంలో రూ.200 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు వ్యాపార లావాదేవీలు జరుగుతాయని అంచనా.
మేడారం జాతర గిరిజనుల ఆచారాలు, విశ్వాసాలు, జీవన విధానం, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలుస్తుంది. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను కొత్త తరాలకు పరిచయం చేసే సామాజిక వేదికగా పనిచేస్తుంది. ఎలాంటి వైదికాచారాలు, అర్చకులు లేకుండా కేవలం గిరిజన పూజారుల ఆధ్వర్యంలో జరిగే ఈ జాతర సమానత్వానికి ప్రతీక. కులమత భేదాలు లేకుండా కోట్లాది మంది భక్తులు ఒకే వేదికపై కలిసే అరుదైన సామాజిక సమైక్యత ఇక్కడ కనిపిస్తుంది. సమ్మక్క–సారలమ్మలను కేవలం దేవతలుగా కాకుండా తమ హక్కుల కోసం పోరాడిన వీరనారులుగా గిరిజనులు భావిస్తారు. అందువల్ల జాతర గిరిజన అస్తిత్వం, ఆత్మగౌరవం, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది.
అణచివేత, అన్యాయాలపై పోరాడిన ఇద్దరు వనదేవతల గాథ మహిళా ప్రాధాన్యతకు, ఆత్మగౌరవ పోరాటాలకు శతాబ్దాలుగా దిక్సూచిగా నిలుస్తోంది. ఆదివాసీల నృత్యాలు, వాయిద్యాలు, ఆచార వ్యవహారాలను ప్రాచుర్యంలోకి తెస్తూ గిరిజన సంస్కృతిని, వైవిధ్యాన్ని కాపాడటంలో ఈ జాతర కీలక పాత్ర పోషిస్తోంది.
జాతర సమయంలో కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంది. జాతర సమయంలో తాత్కాలిక దుకాణాలు, ఆహార కేంద్రాలు, రవాణా, పార్కింగ్, వసతి, పారిశుధ్యం, సరఫరా వంటి అనేక రంగాల్లో ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. స్థానిక గిరిజనులు, చిన్న వ్యాపారులు పూజా సామాగ్రి, బెల్లం (బంగారం), రవాణా, హోటళ్ళు, తాత్కాలిక దుకాణాల ద్వారా ఏడాదంతటికీ సరిపడే ఆదాయాన్ని పొందుతారు.
అటవీ ఉత్పత్తులు, తేనె, ఔషధ మొక్కలు, హస్తకళలు, వెదురు వస్తువులు, సంప్రదాయ ఉత్పత్తులకు జాతర పెద్ద మార్కెట్‌ను అందిస్తుంది. గిరిజనులు తయారు చేసే వస్తువులను నేరుగా వినియోగదారులకు విక్రయించే అవకాశం లభిస్తుంది.
కోట్లాది మంది భక్తులు తరలివచ్చే సమయంలో బస్సులు, ప్రైవేట్ వాహనాలు, ఆటోలు, టాక్సీలు తదితర రవాణా సేవలకు భారీ డిమాండ్ ఏర్పడుతుంది. దీంతో డ్రైవర్లు, వాహన యజమానులు, ఇంధన, పార్కింగ్ రంగాలకు కూడా ఆదాయం పెరుగుతుంది.
జాతర కోసం ఏటూరునాగారం, ములుగు పరిసర ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు మెరుగవుతాయి. ప్రభుత్వాలు కేటాయించే వందల కోట్ల బడ్జెట్ అటవీ ప్రాంతాల శాశ్వత అభివృద్ధికి తోడ్పడుతుంది.
తరాలు మారినా తరగని స్ఫూర్తి
అణచివేతపై ఎదురుతిరిగిన వీరత్వం, ప్రజల కోసం ప్రాణాలర్పించిన మహోన్నత త్యాగం.. ఈ రెండింటి కలయికే మేడారం సమ్మక్క-సారలమ్మల అమరగాథ. భక్తి పారవశ్యం, ప్రకృతి ఆరాధన, గిరిజన సాంస్కృతిక సంప్రదాయాలు మేళవించిన ఈ మహా జాతర తెలంగాణ ఆత్మగౌరవానికి నిదర్శనం. తరాలు మారినా, సరిహద్దులు దాటి కోట్లాది మంది భక్తులను ఏకం చేసే ఈ వనదేవతల ఆశీస్సులు సమాజంలో ఐక్యతకు, సుభిక్షతకు ఎల్లప్పుడూ దిక్సూచిగా నిలుస్తాయి. తరతరాలుగా వస్తున్న ఆదివాసీ విశ్వాసాలను, ప్రకృతి ఆరాధనను కాపాడుకుంటూ వస్తున్న ఈ జాతర రాబోయే తరాలకు కూడా వీరత్వానికి, త్యాగానికి స్ఫూర్తిప్రదాతగా నిలుస్తుదనడంలో ఎలాంటి సందేహం లేదు.