ప్రభాత ఉదయం, ఎల్బీనగర్:
పేదరికం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న యువతుల నిస్సహాయతను ఆసరాగా చేసుకొని అండాలను సేకరిస్తున్న ముఠా వ్యవహారం సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డబ్బు ఆశ చూపి వివిధ రాష్ట్రాలకు చెందిన యువతుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా అండాలను సేకరించి, సంతాన సాఫల్య కేంద్రాలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో శెట్టి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్వహిస్తున్నారు. పేదరికంలో ఉన్న వివిధ రాష్ట్రాలకు చెందిన యువతులకు ఈ హాస్టల్‌లో వసతి కల్పించి, వారి నుంచి అండాలను సేకరిస్తున్నట్లు సమాచారం. ఇలా సేకరించిన అండాలను సంతాన సాఫల్య కేంద్రాలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.
ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని యువతులను ప్రలోభపెట్టి నెలనెలా అండాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. వారి నుంచి సేకరించిన అండాలను వివిధ కార్పొరేట్ ఆసుపత్రులకు అధిక ధరలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి దుర్గాప్రసాద్ అనే వ్యక్తిని సరూర్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అండాలను సరఫరా చేస్తున్న ఆసుపత్రులకు చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయా? అండాల సేకరణ, నిల్వ, సరఫరా ప్రక్రియలు నిబంధనలకు అనుగుణంగా జరుగుతున్నాయా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది? ఎంతకాలంగా ఈ దందా కొనసాగుతోంది? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.