ప్రభాత ఉదయం, చండూరు: గ్రామ సర్పంచ్ ఏకంగా పంచాయతీ నీటి ట్యాంకర్‌ను అమ్ముకోవడం.. ఎంబీల్లో అవినీతిపై మూకుమ్మడిగా వార్డు సభ్యులు సర్పంచ్‌పై ఫిర్యాదు చేయడం నల్లగొండ జిల్లా చండూరు మండలం కస్తాలలో చర్చనీయాంశంగా మారింది. 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి చేసిన పనులకు పెట్టిన బిల్లులకు సంబంధం లేదంటూ వార్డు సభ్యులు చేస్తున్న ఆరోపిస్తున్నారు.
స్క్రాప్‌కు నీళ్ల ట్యాంకర్
గ్రామ పంచాయతీకి సంబంధించి పాత నీటి ట్యాంకర్ తుప్పు పట్టి శిథిలావస్థకు చేరింది. ఈ క్రమంలో వార్డు సభ్యులు కొత్త ట్యాంకర్ కొనాలని తీర్మానం చేశారు. తీరా చూస్తే పాత ట్యాంకర్‌ను రూ.16 వేలకు స్క్రాప్‌కు వేశామని వచ్చిన డబ్బును గ్రామ పంచాయతీలో జమ చేశానని సర్పంచ్ సత్యం వార్డు సభ్యులకు చెప్పారు. అయితే పాత ట్యాంకర్‌ను స్క్రాప్‌కు వేయాలని తీర్మానం చేయలేదని, ట్యాంకర్‌ను రూ.16 వేలకు మాత్రమే ఎలా విక్రయిస్తారంటూ వార్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా నాసిరకమైన, లీకేజవుతున్న నూతన ట్యాంకర్‌ను రూ.2.47 లక్షలకు కొన్నారని, దాని విలువ అంత ఉండదని వారు ఆరోపిస్తున్నారు.
ఖర్చుకు.. ఎంబీలకు సంబంధం లేని వైనం
15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 27 లక్షల్లో జీతాలు, గత పాలకులు ఖర్చు మొత్తం రూ. 7 లక్షలు పోగా, రూ.10 లక్షలకు వివిధ పనుల పేరుతో ఎంబీలు పెట్టారు. అయితే మోటర్లు, లైట్ల విషయంలో అయ్యే ఖర్చుకు పెడుతున్న ఎంబీలకు సంబంధం ఉండటం లేదని, జేసీబీలతో చేయించే పనుల్లో అవినీతి జరుగుతోందని వార్డు సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలో మిషన్ భగీరథ పైపులైన్ తవ్వకాలు, ఇతర చిన్న చిన్న పనులకు అడ్డగోలుగా బిల్లులు రాసినట్లు అధికారులకు మూకుమ్మడిగా ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై సర్పంచ్ సత్యాన్ని వివరణ కోరగా.. అన్ని లెక్కల ప్రకారమే చేశామని, వార్డు సభ్యులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు.