ప్రభాత ఉదయం, చేవెళ్ల: రాష్ట్ర పక్షి పాలపిట్టను బంధించినా, విక్రయించినా, ప్రదర్శించినా చట్టపరమైన చర్యలు తప్పవని చేవెళ్ల డిప్యూటీ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ రవికుమార్ హెచ్చరించారు. పాలపిట్ట సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో శనివారం శంకర్ పల్లి ఠాణాలో ‘యాక్ట్ నౌ సేవ్ పాలపిట్ట’ వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయదశమి రోజు పాలపిట్టను చూడడం శుభమనే నమ్మకంతో కొందరు పక్షులను బంధించి ప్రదర్శనకు ఉంచుతున్నారని, ఇది వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం నేరమని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంటుందన్నారు. ఎవరైనా పాలపిట్టలను పట్టుకోవడం, విక్రయించడం లేదా ప్రదర్శించినట్లు గనమిస్తే అటవీ శాఖ టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్లు 18004255364, 9803338666కు సమాచారం అందించాలని ఆయన సూచించారు.