ప్రభాత ఉదయం, చేవెళ్ల: పారిశ్రామిక హబ్‌గా, పర్యాటక కేంద్రంగా నియోజకవర్గ పరిధిలోని షాబాద్ అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే మండల పరిధిలోని హైతాబాద్, సీతారాంపురం, మాచన్‌పల్లి ప్రాంతాల్లో 1,580 ఎకరాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. తాజాగా మరో 993 ఎకరాల భూమిని సేకరించింది. ఇందులో 418 ఎకరాలను తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ)కి, 375 ఎకరాలను పర్యాటక శాఖకు కేటాయించగా, మరో 200 ఎకరాలను హెచ్‌ఎండీఏకు అప్పగించేందుకు చర్యలు చేపట్టింది. పారిశ్రామిక అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణ, పర్యాటక రంగానికి ప్రాధాన్యమిస్తూ ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఎకరాకు 800 గజాల ప్లాట్లు
ల్యాండ్ పూలింగ్ విధానంలో భూసేకరణ చేపట్టారు. దామెర్లపల్లి, పెద్దవేడు, పోతుగల్, హైతాబాద్, రేగడి దోస్వాడ, తాళ్లపల్లి తదితర గ్రామాల పరిధిలోని వివిధ సర్వే నంబర్లలో భూములను సేకరించారు. హెచ్‌ఎండీఏ ద్వారా లేఅవుట్లు చేసి రైతులకు ప్లాట్లు కేటాయించనున్నారు. భూ రికార్డులతో పాటు క్షేత్రస్థాయిలో ఉన్న కబ్జా విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకుని కేటాయింపులు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. రికార్డుల్లో ఉండి, కబ్జాలో ఉన్న భూమికి ఎకరాకు 800 గజాల చొప్పున, రికార్డుల్లో లేకపోయినా కబ్జాలో ఉన్న భూమికి 300 గజాల చొప్పున ప్లాట్లు కేటాయించే విధానం అమలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం సంబంధిత రైతులతో పాటు చుట్టుపక్కల భూముల యజమానులకు నోటీసులు ఇచ్చి, వారి సమక్షంలో ఎంజాయ్‌మెంట్ సర్వే నిర్వహించి సంతకాలు తీసుకుంటున్నారు. అనంతరం లేఅవుట్లు రూపొందించి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి అందించనున్నారు. వీటిని విక్రయించుకునే అవకాశం కూడా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
ప్రముఖ కంపెనీలకు నిలయంగా
షాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే పలు ప్రముఖ సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. చందన్‌వెల్లిలో 1,182 ఎకరాలు, హైతాబాద్‌లో 200 ఎకరాలు, మాచన్‌పల్లిలో 200 ఎకరాల భూమిని సేకరించి టీజీఐఐసీ ద్వారా కంపెనీలకు కేటాయించారు. చందన్‌వెల్లిలో వెల్‌స్పన్ కంపెనీకి 375 ఎకరాలు, మైక్రోసాఫ్ట్‌కు 52 ఎకరాలు, సీటీఆర్‌ఎల్‌ఎస్ డేటా సెంటర్‌కు 40 ఎకరాలు, ఎన్‌ఎక్స్‌ట్రా డేటాకు 40 ఎకరాలు, ఆశీర్వాద్ పైప్స్‌కు 25 ఎకరాలు కేటాయించారు. సీతారాంపురంలో కిటెక్స్ అప్పారెల్ పార్కుకు 250 ఎకరాలు, ప్రీమియం ఎనర్జీ సోలార్ లిమిటెడ్‌కు 75 ఎకరాలు ఇచ్చారు. ఈ సంస్థల రాకతో ప్రాంతంలో పారిశ్రామిక కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. తాజాగా సేకరించిన 418 ఎకరాల్లోనూ మరిన్ని ప్రముఖ కంపెనీలు ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది.
పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
పారిశ్రామికీకరణతో పర్యావరణంపై పడే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తాళ్లపల్లి, రేగడి దోస్వాడ రెవెన్యూ పరిధిలోని 375 ఎకరాలను పర్యాటక శాఖకు కేటాయించనున్నారు. ఈ గ్రామాల సమీపంలో ఈసీ నది ప్రవహిస్తుండటంతో పాటు రెండు గ్రామాల పరిధిలో కలిపి 13 చెరువులు, కుంటలు ఉండటం పర్యాటక అభివృద్ధికి అనుకూలంగా మారనుంది. ఈ ప్రాంతంలో పర్యాటక కార్యకలాపాలతో పాటు ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా ఇషా ఫౌండేషన్ ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికలు కూడా ఉన్నట్లు సమాచారం.
రేడియల్ రోడ్డుతో మరింత ప్రాధాన్యం
శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) నుంచి రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్)ను అనుసంధానిస్తూ కోస్గి వరకు నిర్మిస్తున్న రేడియల్ రోడ్డు షాబాద్ మండలం మీదుగా వెళ్లనుంది. హైతాబాద్, మాచన్‌పల్లి, సోలిపేట, పెద్దవేడు, నాగర్‌కుంట, బొంగిర్‌పల్లి, షాబాద్ మీదుగా కొందుర్గు మండలంలోకి ఈ రహదారి ప్రవేశించనుంది. ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసి పనులు కొనసాగిస్తున్నారు. పరిశ్రమలు, పర్యాటక ప్రాజెక్టులు, రహదారి అనుసంధానంతో షాబాద్ మండలం భవిష్యత్తులో కీలక అభివృద్ధి కేంద్రంగా మారే అవకాశాలున్నాయి.