ప్రభాత ఉదయం, హైదరాబాద్: తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ(సర్) వేగవంతమైంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్త ఓటర్ల నమోదుతో పాటు ఓటర్ల పేర్ల తొలగింపునకు భారీ సంఖ్యలో దరఖాస్తులు అందినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. మార్పులు-చేర్పులు, అభ్యంతరాలు, తొలగింపులు, కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించిన డేటాను ఈసీ విడుదల చేసింది. ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత ఓటర్ల జాబితాను అప్డేట్ చేస్తున్నట్టు వెల్లడించింది. అక్టోబర్ 7 నాటికి కొత్త ఓటర్ల నమోదుకు (ఫారం-6) 4,88,417 దరఖాస్తులు అందగా..ఇప్పటివరకు 51,821 మందిని ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ఆమోదించారు. ఓటర్ల పేర్ల తొలగింపునకు(ఫారం-7) కింద 24,323 దరఖాస్తులు నమోదయ్యాయి. అందులో పరిశీలన తర్వాత 12,204 పేర్లను జాబితా నుంచి తొలగించారు. ఫారం-6ఏ ద్వారా 6,270 ఎన్ఆర్ఐ దరఖాస్తులు రాగా.. 118 దరఖాస్తులకు ఆమోదం లభించింది. చిరునామాలో మార్పులు, తప్పుల సవరణల కోసం ఫారం 8 ద్వారా మొత్తం 5,05,159 దరఖాస్తులు రాగా.. అందులో 2,27,721 దరఖాస్తులను అప్డేట్ చేశారు.
అత్యధికం హైదరాబాద్‌లోనే
కొత్త ఓటర్ల నమోదుకు (ఫారం-6) వచ్చిన దరఖాస్తులు అత్యధికంగా హైదరాబాద్‌లోనే ఉన్నాయి. నగరంలో కొత్త ఓటర్ల నమోదుకు 1,94,204 ఫారం-6 దరఖాస్తులు రాగా, వాటిలో 29,226 మంది పేర్లు ఓటర్ల జాబితాలో చేర్చారు. అత్యల్పంగా ములుగు జిల్లాలో 1,214 దరఖాస్తులు అందాయి. ఓటర్ల పేర్ల తొలగింపునకు సంబంధించి హైదరాబాద్‌లో ఫారం-7 దరఖాస్తులు 6,335 రాగా, అందులో 2,066 పేర్లను తొలగించారు.
హైదరాబాద్‌లోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫారం-7 దరఖాస్తుల విషయంలో జూబ్లీహిల్స్‌లో 1,026 దరఖాస్తులు, యాకుత్‌పురాలో 963, బహదూర్‌పురాలో 842, గోషామహల్లో 222, వివాదంలో ఉన్న ముషీరాబాద్‌లో 151 దరఖాస్తులు రాగా అందులో 87 తొలగించారు. నాంపల్లిలో వచ్చిన 523 దరఖాస్తుల్లో 316 పేర్లను తొలగించారు. యాకుత్‌పురాలో 842 దరఖాస్తుల్లో 242 పేర్లను తొలగించారు. ముషీరాబాద్, గోషామహల్, బహదూర్‌పురా నియోజకవర్గాల్లో ప్రింటెడ్ ఫారం-7లను ఉపయోగించి పెద్ద సంఖ్యలో పేర్ల తొలగింపునకు ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో ప్రతి దరఖాస్తును అధికారులు పరిశీలించినట్టు ఎన్నికల సంఘం తెలిపింది.
నవంబర్ 9న తుది జాబితా
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం నవంబర్ 9న విడుదల చేయనున్నది. అప్పటికి కొత్తగా చేరిన ఓటర్లు, తొలగించిన పేర్లు, మొత్తం ఓటర్ల సంఖ్యపై స్పష్టత రానున్నది.