Sircilla weaver creates silver woven shawl for Dubai rulers 
తెలంగాణ

దుబాయ్ రాజులకు సిరిసిల్ల కానుక

Madhu

- బతుకమ్మ వేడుకల సందర్భంగా..

- ఈ నెల 11న అందజేయనున్న ఈసీటీఏ

- చేనేత కళాకారుడు హరిప్రసాద్‌కు ప్రశంసలు

ప్రభాత ఉదయం, రాజన్నసిరిసిల్ల: దుబాయ్ రాజులకు సిరిసిల్ల కానుక అందనున్నది. ఈ నెల 11న దుబాయ్‌లోని ఈసీటీఏ(ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా దుబాయ్ రాజులకు వెండితో నేసిన శాలువాను బహూకరించనున్నారు. దుబాయ్ రాజులు హిగినెస్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ఆల్ మఖ్తుమ్, షేక్ మహమ్మద్ బిన్ హమదాన్, షేక్ మఖ్తుమ్ మహమ్మద్ ఫొటోలను శాలువాపై వెల్దండి హరిప్రసాద్ 15 రోజులపాటు కష్టపడి వెండిపోగులతో నేశాడు. సూక్ష్మమైన ముఖ కవళికలు సైతం స్పష్టంగా కనిపించేలా రూపొందించిన ఈ శాలువా సిరిసిల్ల నేత కళాకారుని సృజనకు నిదర్శనంగా నిలుస్తున్నది. ఈసీటీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు పీచర కిరణ్, ప్రెసిడెంట్ జగదీశ్ ఈ కానుకను దుబాయ్ రాజులకు అందించనున్నారు. కాయితి బాలు, జూపల్లి వెంకటరావులు ఈ వెండి శాలువాను నేయించారు. సిరిసిల్ల చేనేత ఖ్యాతి మరోసారి ప్రపంచ యవనికపై ఆవిష్కరించనున్నదని పలువురు ప్రశంసిస్తున్నారు.