ప్రభాత ఉదయం, వికారాబాద్ : శంకర్పల్లి నుంచి వికారాబాద్ జిల్లా కేంద్రానికి అనుసంధానం చేస్తున్న ప్రధాన రోడ్డు వెడల్పు పనుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసిందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెల్లడించారు. సోమవారం నవాబ్‌పేట మండలం వట్టిమీనపల్లిలో శ్రీ అదితి గోక్షేత్రం ప్రారంభోత్సవం, దత్తాత్రేయ స్వామి, ఆంజనేయ స్వామి విగ్రహాల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. భారతీయ సంస్కృతిలో గోవుకు చాలా ప్రాధాన్యత, విశేష స్థానం ఉందని, జీవన విధానంలో గోవుకు, మనిషికి ఎంతో అవినాభావ సంబంధం ఉందని స్పీకర్ గుర్తుచేశారు. అనంతరం రోడ్డు విషయమై మాట్లాడుతూ, జిల్లాకు చెందిన తాను స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి, రోడ్ల నిర్మాణ పనుల కోసం రూ.100 కోట్లు కేటాయించారని చెప్పారు. త్వరితగతిన ఆ రోడ్డు నిర్మాణ పనులను పూర్తయ్యేందుకు కృషి చేస్తానని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామితోపాటు పలువురు ప్రముఖులు, భక్తులు, నాయకులు, కార్యకర్తలు, యువతీయువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.