ప్రభాత ఉదయం, బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులతో జలాశయంలో నీటిమట్టం పడిపోయింది. గతేడాది ఇదే సమయానికి పూర్తి స్థాయి నీటిమట్టం 1,091 అడుగులు (80.50 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1,076.50 అడుగులు (36.269 టీఎంసీలు) మాత్రమే ఉంది. అంటే నీటి నిల్వలు సగానికంటే తక్కువకు పడిపోయాయి. ఈ నేపథ్యంలో సాగునీటి విడుదలను నిలిపివేసిన అధికారులు.. మిగిలిన నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలని నిర్ణయించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయకట్టు పంటలను కాపాడేందుకు అక్టోబర్ 10 నుంచి 20 వరకు కాకతీయ, సరస్వతి, లక్ష్మీ, వరద కాలువలతో పాటు ఆలీసాగర్–గుత్ప లిఫ్ట్‌ల ద్వారా 9 టీఎంసీల నీటిని విడుదల చేశారు. ఈ నెల 20న సాగునీటి విడుదలను తగ్గించి.. బుధవారం సాయంత్రం పూర్తిగా నిలిపివేశారు. ప్రాజెక్టులో మిగిలిన 36 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించనున్నట్లు ఎస్‌ఈ జగదీశ్ తెలిపారు.
ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి రోజువారీ నీటి లెక్కల్లో 735 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదవుతోంది. ఇందులో 504 క్యూసెక్కులు ఆవిరి రూపంలో నష్టపోతుండగా.. మరో 231 క్యూసెక్కులను మిషన్ భగీరథకు విడుదల చేస్తున్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో జూన్ 1 నుంచి ఇప్పటివరకు 42.618 టీఎంసీల నీరు మాత్రమే ప్రాజెక్టులోకి చేరింది. సాగు, తాగునీటి అవసరాల కోసం కలిపి 22.634 టీఎంసీలను విడుదల చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి.
వర్షాలు కురవకపోవడం, ప్రాజెక్టులోకి నీటి రాక నిలిచిపోవడంతో యాసంగి పంటలకు సాగునీరు అందించే పరిస్థితి లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాగునీటి అవసరాలకే ప్రాధాన్యమివ్వనున్నట్లు వెల్లడించారు.