Sunil Bansal warns Telangana BJP leaders 
తెలంగాణ

వచ్చే 6 నెలల్లో బీజేపీలో విప్లవాత్మక మార్పులు

పని చేయడం ఇష్టం లేకపోతే స్వతహాగా రాజీనామా చేసి ఆయా పదవులను వేరేవారికి అప్పజెప్పాలని గ్రౌండ్‌ లెవల్‌లో యాక్టివ్‌గా లేని బీజేపీ నేతలకు సునీల్ బన్సల్ వార్నింగ్ ఇచ్చారు.

Madhu

ప్రభాత ఉదయం, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ నాయకులకు ఇన్‌చార్జి సునీల్ బన్సల్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 9 జిల్లాల ముఖ్య నాయకులు, రాష్ట్ర పదాధికారుల సమావేశంలో బీజేపీ నాయకత్వం, స్థానిక నేతల తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నేతలంతా కేవలం హైదరాబాద్ స్టేట్ ఆఫీస్‌కు మాత్రమే పరిమితమైతే సరిపోదని, క్షేత్ర స్థాయిలో పని చేయాలని తీవ్రంగా హెచ్చరించారు. పెద్ద సభల్లో ప్రసంగాలు చేయడం వల్ల వచ్చే ప్రభావం కంటే, ప్రజల్లో మమేకమై మాట్లాడితే వచ్చే ఇంపాక్ట్ ఎక్కువని సూచించారు. అధిష్ఠానం అప్పజెప్పిన కార్యక్రమాల్లో రెండు మూడు కూడా సరిగ్గా అమలు చేయకపోతే ఎలా? అని నాయకులను నిలదీశారు. నేతల పనితీరు పేలవంగా ఉందని, ఇలా ఉన్న నాయకత్వంతో ఎన్నికలకు వెళ్లడం చాలా కష్టమన్నారు.

 ససేమిరా అంటే కుదరదు: సునీల్

వచ్చే ఆరు నెలల్లో రాష్ట్ర నాయకత్వంలో విప్లవాత్మక మార్పులు ఉంటాయని తెలిపారు. పార్టీ ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేకపోతే ఆయా పదవుల్లో ఉండటం ఎందుకని ప్రశ్నించారు. పని చేయడం ఇష్టం లేకపోతే స్వతహాగా రాజీనామా చేసి ఆయా పదవులను వేరేవారికి అప్పజెప్పాలని గ్రౌండ్‌ లెవల్‌లో యాక్టివ్‌గా లేని నేతలకు బన్సల్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉత్సాహం ఉన్నవారు ఎవరైనా వారి బాధ్యతల నుంచి తప్పుకోవాలని, వారు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల్లో మమేకమవ్వాలని సూచించారు. అంతేకానీ, పార్టీ ఇచ్చే పదవి కావాలి, ఎన్నికల్లో టికెట్ కావాలంటే ససేమిరా కుదరని వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై నిర్వహించిన ధర్నాలు, నిరసనలు, మన్‌కీ బాత్ కార్యక్రమాలతో కూడిన రిపోర్ట్‌ను ప్రతి నెల సమర్పించాలని ఆదేశించారు. త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ చేపట్టిన ‘లోక్‌తంత్ర బచావో - భీడ్‌తంత్ర హఠావో’ ఉద్యమంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సహఇన్‌చార్జులు అభయ్ పాటిల్, రేఖా శర్మ, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి ఎన్ మధుకర్, తెలంగాణ బీజేపీ సంయుక్త సంస్థాగత ప్రధాన కార్యదర్శి, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు.