Supreme Court Clarifies No Approval For Modified Form 6 
తెలంగాణ

ఫారం- 6పై ఎలాంటి తీర్పు ఇవ్వలేదు: సుప్రీంకోర్టు

కొత్త ఫారం-6పై తాము ఎలాంటి తీర్పు ఇవ్వలేదని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది.

Satya

న్యూఢిల్లీ: కొత్త ఫారం-6పై తాము ఎలాంటి తీర్పు ఇవ్వలేదని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం బిహార్ సర్‌కు సంబంధించిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. వివిధ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కోసం ఎన్నికల సంఘం ఉపయోగిస్తున్న ఫారం- 6లో చేసిన మార్పులకు తాము ఎలాంటి ఆమోదం తెలపలేదని పేర్కొంది. పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ఫారం-6కు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపిందని ఎన్నికల సంఘం పేర్కొందని వాదించారు. దీనిపై జస్టిస్ బాగ్చి స్పందిస్తూ బిహార్ సర్ వ్యవహారంపై గతంలో విచారణ జరిపినప్పుడు కొత్త ఫారం-6 అంశం తమ ముందుకు రాలేదని పేర్కొన్నారు. అక్టోబర్ 5న మరో పిటిషన్‌పై విచారణ సందర్భంగా కూడా సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. సర్‌కు సంబంధించిన ఇతర పెండింగ్ పిటిషన్లతో కలిపి ఈ పిటిషన్‌ను ఈ నెల 27న విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. అయితే బిహార్ సర్‌కు సంబంధించిన మే 2026 నాటి తీర్పులో ఫారం-6లోని డిక్లరేషన్‌ను సుప్రీంకోర్టు సమర్థించినట్లు ఎన్నికల సంఘం సెప్టెంబర్ 26న విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.