ప్రభాత ఉదయం, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ విజయం దక్కింది. మియాపూర్‌లో రూ.2,500 కోట్ల విలువైన 550 ఎకరాల భూములపై తెలంగాణ ప్రభుత్వ యాజమాన్య హక్కులను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌లోని సర్వే నంబర్లు 100, 101లోని ఈ భూములపై యాజమాన్య హక్కులు తమవేనంటూ కొందరు ప్రైవేటు వ్యక్తులు చేసిన వాదనలు తిరస్కరించింది. రెవెన్యూ రికార్డులను తారుమారు చేసినంత మాత్రాన, ఆ భూములకు చట్టబద్ధ హక్కులు పొందలేరని స్పష్టం చేసింది. ఈ వివాదంపై దాఖలైన వ్యాజ్యంపై పెండింగ్‌లో ఉన్న 20 స్పెషల్ లీవ్ పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. దీంతో 23 ఏళ్లుగా కొనసాగుతున్న న్యాయపోరాటానికి ముగింపు లభించినట్లయింది.
గోల్డ్ స్టోన్‌కు చుక్కెదురు..
మియాపూలోని సర్వే నంబర్ 100లోని 277 ఎకరాలు, సర్వే నంబర్ 101లోని 274 ఎకరాలు ప్రభుత్వ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో ఉంది. ఈ భూములపై గోల్డ్‌స్టోన్ పార్థసారథి, అతడి సోదరుడు ప్రసాద్‌కు చెందిన ప్రైవేట్ కంపెనీలు ఆక్రమించేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలున్నాయి. నాటి జాగీర్దార్ కైసరుద్దీన్ వారసులైన అమీరన్నీషా, ఇతర వారసుల నుంచి తాము జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా చట్టబద్ధంగా కొనుగోలు చేశామని, ఆ భూములపై హక్కులు తమవేనంటూ పార్థసారథి, సువిశాల్ జైన్ న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ కేసుల్లో 1997లో ప్రత్యేక కోర్టు, 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చాయి. ఈ తీర్పులను సవాల్ చేస్తూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ కేసు విచారణకు రాగా తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపించింది. జాగీర్దార్ అంటే ఆ భూమిపై ప్రయోజనాలు పొందడమే తప్ప.. అమ్ముకునే హక్కు ఉండదని కోర్టుకు వివరించింది. గతంలోనే జాగీర్దార్ కైసరుద్దీన్కు ప్రభుత్వం పరిహారం కూడా చెల్లించిందని, కాబట్టి ఆ భూములపై ఆయన వారసులకు ఎలాంటి హక్కులు ఉండవని బలంగా వాదించింది.
సుప్రీం తీర్పుతో వివాదానికి తెర..
గతంలో జాగీర్దార్‌కు ప్రభుత్వం పరిహారం చెల్లించిందని కోర్టు నిర్ధారించింది. దీంతో వారసుల ద్వారా జరిగిన బదిలీలు చెల్లవని పేర్కొంది. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు ఇలా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లేందుకు అనుమతించబోమని, ఇలాంటి విషయాల్లో న్యాయస్థానం మౌనంగా ఉండలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మియాపూర్ భూముల కేసుల పూర్వాపరాలివే..
1995 : ప్రత్యేక కోర్టులో ల్యాండ్ గ్రాబింగ్ కేసులు (ఎల్జీసీ నం. 131/95, 136/95) దాఖలు.
1997: ప్రైవేట్ వ్యక్తులను భూఆక్రమణదారులు (ల్యాండ్ గ్రాబర్స్)గా ప్రత్యేక కోర్టు ప్రకటిస్తూ తీర్పు.
2003: ప్రైవేట్ వ్యక్తుల అప్పీళ్లను అప్పటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. భూమిని హుడా/హెచ్ఎండీఏకు అప్పగించింది.
2003: హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ప్రైవేట్ వ్యక్తులు 20 పిటిషన్లు దాఖలు చేశారు.
2026 (అక్టోబర్ 29): సుప్రీంకోర్టు అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ, భూమిపై యాజమాన్య హక్కులు తెలంగాణ ప్రభుత్వానికే చెందుతాయని తీర్పునిచ్చింది.