ప్రభాత ఉదయం, సూర్యాపేట: అర్నబ్ తుఫాన్ ప్రభావంతో బుధవారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డుకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రైతులు, కమీషన్దారులు, వ్యాపారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. మంగళవారం మార్కెట్ యార్డుకు 75 వేల బస్తాల ధాన్యం రాగా, ఇప్పటివరకు సుమారు 35 వేల బస్తాలను మాత్రమే ఎగుమతి చేసినట్లు తెలిపారు. మరో 40 వేల బస్తాల ధాన్యం ఎగుమతి చేయాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో అర్నబ్ తుఫాన్ ప్రభావంతో మంగళవారం రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అక్టోబర్ 28న మార్కెట్కు సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. రైతులు బుధవారం మార్కెట్ యార్డుకు ధాన్యం సహా ఇతర వ్యవసాయ ఉత్పత్తులను తీసుకురావద్దని సూచించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మార్కెట్ కమిటీకి సహకరించాలని కోరారు.