ప్రభాత ఉదయం, సూర్యాపేట: ఏసీబీ అధికారుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ ప్రభుత్వ ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ముఠా వ్యవహారం సూర్యాపేట జిల్లాలో కలకలం రేపింది. నకిలీ ఏసీబీ అధికారుల అవతారమెత్తిన కేటుగాళ్లు ఏసీబీ దాడులు, విచారణ పేరుతో ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తూ, వారిని బురిడీ కొట్టించి లక్షల్లో దండుకుంటున్నారు. ప్రధానంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను, ఇటీవల సస్పెండ్ అయిన ఉద్యోగులనే టార్గెట్‌గా చేసుకుని నకిలీ ఏసీబీ ముఠా వసూళ్ల పర్వానికి తెరలేపడం ఆసక్తికరం.
ఏసీబీ దాడుల పేరుతో లక్షల్లో బురిడీ
జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్‌కు 10రోజుల క్రితం ఏసీబీ అధికారులం అని చెప్పి, మీ అవినీతి ఆధారాలు అన్ని మా చేతుల్లో ఉన్నాయని, మీ పైన కేసు పెడుతున్నాం అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో భయపడిన సదరు అధికారి వారు చెప్పినట్లుగా కలెక్టరేట్ పరిసరాల్లోని నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి వెళ్లి రూ.1.95 లక్షలు సమర్పించుకున్నాడు. అయితే రెండు రోజుల తరువాత తనను బెదిరించిన వారు నకిలీ ఏసీబీ అధికారులని తేలడంతో బాధితుడు సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. అలాగే వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తూ ఇటీవల సస్పెండైన ఉద్యోగికి సైతం నకిలీ ఏసీబీ అధికారుల పేరుతో ఫోన్ చేసి, రీ పోస్టింగ్ కావాలంటే తాము అడిగింది ఇచ్చుకోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై బాధిత ఉద్యోగులు డీఎంహెచ్‌వోకు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
10 శాఖలకుపైగా ఉద్యోగులకు బెదిరింపులు
జిల్లాలోని దాదాపు 10 ప్రభుత్వ శాఖల అధికారులకు, ఉద్యోగులకు నకిలీ ఏసీబీ అధికారుల పేరుతో బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలుస్తున్నది. మీపై తీవ్రమైన అవినీతి ఫిర్యాదులు వచ్చాయి అని, కేసు నమోదు కాకుండా ఉండాలన్నా, విచారణ నుంచి బయటపడాలన్నా అడిగినంత ఇవ్వాలి అంటూ ఫోన్లలో హెచ్చరించారు. ఏసీబీ భయంతో కొందరు అధికారులు ఇప్పటికే సదరు నకిలీ ముఠాకు లక్షల రూపాయలు చెల్లించినట్లు ప్రచారం వినిపిస్తున్నది.
బాధితుల్లో కీలక శాఖల అధికారులు
నకిలీ ఏసీబీ అధికారుల వేధింపులకు గురైన వారిలో జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్‌తో పాటు ఫిషరీస్, హెల్త్, అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌లకు చెందిన పలువురు అధికారులు, సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఇటీవల విధుల్లో అవకతవకలకు పాల్పడి సస్పెన్షన్‌కు గురైన ఉద్యోగుల జాబితాను సేకరించి, వారిని మరింతగా బెదిరించి డబ్బులు లాగేందుకు ప్రయత్నించినట్లుగా తెలిసింది. ఆలస్యంగా తాము మోసపోయామని గ్రహించిన సదరు ఉద్యోగులు, అధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఫిర్యాదు అందితే కేసుల నమోదు: కే.నరసింహ, ఎస్పీ
నకిలీ ఏసీబీ అధికారుల పేరుతో బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ సూచించారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏసీబీ దాడులు, కేసులకు సంబంధించిన సమాచారం అత్యంత గోప్యంగా ఉంటుందని, ఎవరికీ ముందస్తుగా దాడుల సమాచారం ఇవ్వరని స్పష్టం చేశారు. నకిలీ ఫోన్ కాల్స్‌పై వెంటనే తమకు సమాచారం అందించాలని తెలిపారు.