ప్రభాత ఉదయం, సూర్యాపేట: సీజ్ చేసిన ధాన్యం అప్పగింతలో సూర్యాపేట జిల్లాలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని రోజుల కింద జిల్లాలోని రైస్ మిల్లుల్లో విజిలెన్స్ అధికారుల చేపట్టిన తనిఖీల్లో సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) మాయమైనట్లు గుర్తించారు. సుమారు రూ.550 కోట్ల విలువైన 1.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు తేల్చారు. దీనికి సంబంధించి 16 రైస్ మిల్లులను డిఫాల్టర్లుగా తేల్చి సివిల్ సప్లయ్ శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. ఆయా మిల్లుల్లో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సీజ్ చేశారు. అయితే, సీజ్ చేసిన ధాన్యాన్ని ఇతర మిల్లులకు కస్టడీయల్ విధానంలో అప్పగించే ప్రక్రియలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో సివిల్ సప్లయ్ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కేసులున్న మిల్లులకే సీజ్ చేసిన ధాన్యం
విజిలెన్స్ తనిఖీల్లో ధాన్యం మాయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిల్లులతో పాటు గతంలో కేసులు నమోదైన మిల్లులకే సీజ్ చేసిన ధాన్యాన్ని కస్టోడియల్ విధానంలో అప్పగిస్తున్నట్లు సమాచారం. ధాన్యం నిల్వలు, మిల్లుల సామర్థ్యం, గతంలో జరిగిన ఉల్లంఘనలను పరిగణనలోకి తీసుకోకుండా వడ్లు అప్పగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కాగా, కస్టోడియల్ ధాన్యం అప్పగింత వ్యవహారంలో ఒక్కో మిల్లు నుంచి రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే 10మిల్లులకు సీజ్ చేసిన సుమారు 8 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తరలించారు. మిగిలిన ధాన్యాన్ని కూడా ఇతర మిల్లులకు తరలించే ప్రక్రియ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, సీజ్ చేసిన ధాన్యాన్ని ఏ ప్రాతిపదికన మిల్లులకు అప్పగిస్తున్నారు? ఈ అప్పగింతలకు ఎవరు అనుమతులు ఇస్తున్నారు? వసూళ్ల ఆరోపణల్లో వాస్తవమెంత? అనే అంశాలపై విచారణ జరిపితేనే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సివిల్ సప్లయ్ అధికారులు విచక్షణాధికారం పేరుతో అడ్డగోలుగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ధాన్యాన్ని దొంగలకే అప్పగిస్తున్నారన్న ఆరోపణలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.