ప్రభాత ఉదయం, చెన్నూరు: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని రామకృష్ణాపూర్లో వాకర్లు, క్రీడాకారుల కోసం నిర్మించిన ఠాగూర్ స్టేడియం పశువులకు పాకలా మారింది. నిత్యం పదుల సంఖ్యలో పశువులు స్టేడియంలో సంచరిస్తూ ఉదయాన్నే వాకింగ్ కోసం వచ్చేవారికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఆవరణ, రన్నింగ్ ట్రాక్‌లపై గుంపులుగా సంచరిస్తుండటంతో వాకర్లు స్టేడియంలోకి వెళ్లేందుకే జంకుతున్నారు. దుర్వాసన భరించలేకపోతున్నారు. కొందరు వాకింగ్ చేస్తున్న క్రమంలో అవి కుమ్ములాటకు దిగి మీదికి వస్తుండటంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. వ్యాయామం కోసం వస్తే పశువుల దాడితో దవాఖానల పాలవ్వాల్సి వస్తోందని వాపోతున్నారు.
ఇష్టారాజ్యంగా వదిలేస్తున్న యజమానులు
యజమానులు తమ పశువులను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వదిలేస్తుండటంతో అవి రోడ్లు, మైదానాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నాయని వాకర్లు పేర్కొంటున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి బహిరంగ ప్రదేశాల్లో పశువులను వదిలేసే యజమానులను గుర్తించి వారికి జరిమానా విధించాలని, వెంటనే స్టేడియానికి సెక్యూరిటీని నియమించాలని కోరుతున్నారు.