ప్రభాత ఉదయం, ప్రత్యేక ప్రతినిధి : ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ వైపు ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా రాష్ట్ర అధికార యంత్రాంగం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడుల కోసం కుదిరిన ఎంవోయూలన్నీ కార్యరూపం దాల్చేలా ప్లాన్ చేస్తోంది. ఇందుకు డిసెంబర్లో నిర్వహించే ‘గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్-2.0’ను వేదికగా చేసుకోనుంది. దాదాపు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో నిర్మించేందుకు తలపెట్టిన ఆరు విభాగాల అభివృద్ధికి ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడిదారులను ఆకర్షించేలా ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి తన బృందంతో న్యూయార్క్ నుంచి లండన్ దాకా విస్తృతంగా పర్యటించారు. ఫ్యూచర్ సిటీ దేశంలోనే గొప్ప నగరంగా అభివృద్ధి చెందుతుందని, మొదటి నెట్ జీరో కార్బన్ సిటీగా అవతరిస్తుందని సీఎం అనేకసార్లు ప్రస్తావించారు. ఏఐ, మెడికల్ టూరిజం, స్పోర్ట్స్, సాప్ట్వేర్, ఫార్మాకు కేంద్రంబిందువుగా మారుతుందని చెబుతున్నారు.
పకడ్బందీగా రోడ్ల అనుసంధానం
పంచ దేశాల వాణిజ్యమంతా కేంద్రీకృతమయ్యేలా ఫ్యూచర్ సిటీలో ట్రేడ్ సెంటర్‌ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇతర దేశాల్లో వాణిజ్య కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు వరల్డ్‌ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ రైట్స్ కూడా తీసుకుంది. ఏఐ సిటీని నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌నూ సీఎం ప్రతిపాదించగా ప్రతినిధులతో ఒప్పందం జరిగింది. మొత్తం 70 ఎకరాల్లో ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎయిర్ పోర్ట్, మెట్రోరైల్ స్టేషన్లకు వేగంగా చేరుకునేందుకు వీలుగా ప్రధాన రోడ్డుతో పాటు, అంతర్గత రోడ్లు వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కు అనుసంధానమై ఉండేలా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అవుటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగు రోడ్డును అనుసంధానం చేసేలా ప్రణాళిక చేయాలన్నారు. కొత్త హైకోర్టు నుంచి శంషాబాద్ విమానాశ్రయం మీదుగా ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గానికి ప్రణాళికలు తయారు చేయాలని సీఎం సూచించగా అధికారులు కొన్ని ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఫ్యూచర్ సిటీకి 16 రేడియల్ రోడ్లు నిర్మించాలని ఇప్పటికే రూట్ మ్యాప్ రెడీ అయ్యింది.
మెట్రో విస్తరణకు కొత్త కారిడార్లు
మెట్రో రైలు ప్రతిపాదిత రెండో దశలో 78 కి.మీ.తో ఐదు కారిడార్లు రానున్నాయి. ఇందులో శంషాబాద్ ఎయిర్‌పోర్టు సిటీలోని మెట్రో లైన్లతో లింక్ కానుంది. ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు రూట్ ఆప్షన్లను అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. ఇందుకు 3 ఆప్షన్లను ప్రముత్వం ముందుంచారు. ఆప్షన్ 1లో భాగంగా ఎయిర్పోర్ట్ నుంచి స్కిల్ వర్శిటీ దాకా 32 కి.మీ. ఉంటే.. స్టేషన్ల సంఖ్య 12 ఉంటాయని, నిర్మాణానికి రూ.6173 కోట్లు అవసరమని అంచనాలు సమర్పించారు. ఆప్షన్ 2లో విమానాశ్రయం నుంచి స్కిల్ వర్శిటీ వయా రావిర్యాల మీదుగా 32 కి.మీ. మేర 10 స్టేషన్లు నిర్మిస్తారు. వ్యయం రూ.5216 కోట్లు అవుతాయని లెక్కలేశారు. ఆప్షన్ 3లో ఎయిర్ పోర్ట్ నుంచి శ్రీశైలం రోడ్డు ద్వారా 32 కిలోమీటర్లలో 12 స్టేషన్లు అవసరమని, రూ.3256 కోట్లు ఖర్చవుతాయని లెక్కేశారు. 2028 నుంచి 2053 వరకు ప్రయాణికుల సంఖ్యను అంచనా వేసి పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ విషయాలన్నింటినీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 2.0లో ప్రకటించనున్నారు.
లివింగ్ సిటీల ఏర్పాటుకు కసరత్తు
ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 'భారత్ ఫ్యూచర్ సిటీ' అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఆయా రంగాల్లో పెట్టుబడుకు సంబంధించి ఇప్పటికే కుదిరిన ఒప్పందాలన్నీ గ్రౌండింగ్ చేసేందుకు మౌళిక వసతుల కల్పన అత్యంత ప్రధానం కావడంతో ఆ దిశగా దృష్టి పెట్టారు. ఇందుకోసం ‘క్రెడాయ్’ ప్రతినిధులతో తాజాగా సమాలోచనలు జరిపారు. స్థిరాస్తి వ్యాపార రంగంలో 3 దశాబ్దాల అనుభవం కలిగిన ఆ సంస్థ ప్రతినిధుల ఆలోచన మేరకు ఫ్యూచర్ సిటీలో లివింగ్ సిటీలు అవసరమన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఫార్మా సిటీ కంపెనీలకు మానవ వనరులు సమకూర్చేలా వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. నివాస గృహ సముదాయాల నిర్మాణానికి భూములు కేటాయించి ఇప్పటి నుంచే లేఅవుట్లు సిద్ధం చేసే పనులు ప్రారంభించాలన్నారు. ఫలితంగా పెట్టుబడులకు ముందుకొచ్చే బహుళజాతి కంపెనీలను మరింత ఆకర్షించవచ్చునని సర్కారు భావిస్తోంది. వంద ఎకరాలకు ఒకటి చొప్పున లివింగ్ సిటీలను ఏర్పాటు దిశగా యోచిస్తోంది. అధికారుల నివేదిక ప్రకారం.. ఫోర్త్ సిటీని ఎంపిక చేసిన ప్రాంతంలో 15 నుంచి 16 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టింది.