భారతీయ సంస్కృతిలో ప్రకృతిని కేవలం జీవనాధారంగా కాకుండా దైవస్వరూపంగా భావించి ఆరాధించే సంప్రదాయం అనాదిగా కొనసాగుతోంది. ఆ విశ్వాసం తెలంగాణ నేలపై మరింత ప్రత్యేకమైన రూపాన్ని సంతరించుకుంది. ఇక్కడి పండుగలు, జాతరలు, గ్రామదేవతల ఆరాధనలో ప్రకృతిపట్ల కృతజ్ఞత, దైవంపై విశ్వాసం, తరతరాలుగా కొనసాగుతున్న ఆచారాల మేళవింపు కనిపిస్తుంది. ఆధ్యాత్మికత, జానపద సంస్కృతి, ప్రజల భావోద్వేగాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ఆ విశిష్ట సంప్రదాయానికి ప్రతిరూపమే బోనాల పండుగ. బోనాలు కేవలం ఒక పండుగ మాత్రమే కాదు... అది తెలంగాణ ప్రజల జీవన విధానం, భక్తి, విశ్వాసం, సంస్కృతి, సామూహిక జీవ విధానానికి అద్దం పట్టే ఆత్మీయ మహోత్సవం.
బోనాల ఉత్సవం మొదలవగానే పల్లె నుంచి పట్నం వరకు తెలంగాణ అంతా పండుగ శోభను సంతరించుకుంటుంది. మహిళలు పసుపు, కుంకుమలతో అందంగా అలంకరించిన బోనాలను తలపై మోసుకెళ్లి గ్రామదేవతలకు భక్తిశ్రద్ధలతో నైవేద్యంగా సమర్పిస్తారు. మరోవైపు వీధుల్లో మార్మోగే డప్పు చప్పుళ్లు, పోతురాజుల వీర విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, మాతంగి భవిష్యవాణి, కన్నుల పండుగగా సాగే ఘటోత్సవాలు..బోనాల జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇంతగా తెలంగాణ ప్రజల జీవనంతో, విశ్వాసాలతో, జానపద సంస్కృతితో పెనవేసుకున్న బోనాల పండుగ వెనుక అసలు చరిత్ర ఏమిటి? ఈ సంప్రదాయం ఎప్పుడు, ఎలా మొదలైంది? ఈ పండుగకు ఇంతటి విశిష్టత ఎందుకు లభించింది? ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రెండు నెలలు.. తెలంగాణ అంతా అమ్మవారి ఆరాధన
సాధారణంగా చాలా పండుగలు ఒకటి రెండు రోజులతో ముగుస్తాయి. కానీ బోనాల వైభవం దానికి పూర్తి భిన్నం. ఇది ఏకంగా రెండు నెలల పాటు తెలంగాణ సమాజాన్ని భక్తిపారవశ్యంలో ముంచెత్తే అరుదైన సాంస్కృతిక మహోత్సవం. తెలుగు పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసం ముగిసి, ఆషాఢం అడుగుపెట్టడంతోనే బోనాల సందడి ప్రారంభమై శ్రావణ మాసం చివరి వరకు రెండు నెలలపాటు నిరంతరాయంగా కొనసాగుతుంది. రుతుపవనాల రాకతో వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్న ఆషాఢ, శ్రావణ మాసాల్లో ప్రకృతి దేవతలను శాంతింపజేసి, సమస్త ప్రాణికోటిని కాపాడాలని కోరుతూ అమ్మవారిని రెండు నెలల పాటు కొలిచే ఆచారం తరతరాలుగా కొనసాగుతోంది.
ఆషాఢంలో ఆరంభం.. జంట నగరాల్లో ఘనంగా ఉత్సవాలు
చారిత్రాత్మక గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో తొలి బోనం సమర్పించడంతో హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి. అక్కడి నుంచి బోనాల పర్వం జంట నగరాల్లోని ప్రధాన అమ్మవారి ఆలయాలకు విస్తరిస్తుంది. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాంకాళి, బాల్కంపేట ఎల్లమ్మ, పాతబస్తీలోని ప్రసిద్ధ సింహవాహిని శ్రీ మహాంకాళి (లాల్ దర్వాజా) ఆలయాల్లో వారం వారం బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతాయి.
శ్రావణంలో.. పల్లెల్లో ప్రతిధ్వనించే బోనాలు సందడి
జంట నగరాల్లో ఆషాఢ బోనాల సందడి ముగిసిన తర్వాత.. శ్రావణ మాసంలో ఈ పండుగ తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామదేవతల ఆలయాలు బోనాల వేడుకలకు వేదికలుగా మారుతాయి. దీంతో పట్టణాలకే పరిమితమైన ఉత్సవ వాతావరణం పల్లెలకూ చేరి, తెలంగాణ వ్యాప్తంగా అమ్మవారి ఆరాధన మరింత విస్తృతంగా కొనసాగుతుంది.
బోనం అంటే ఏమిటి?
‘బోనం’ అనే పదానికి మూల భావం అమ్మవారికి సమర్పించే నైవేద్యంతో ముడిపడి ఉంటుంది. ఆషాఢ మాసంలో మహంకాళి, పోచమ్మ, ఎల్లమ్మ, రేణుక ఎల్లమ్మ, గండి మైసమ్మ తదితర గ్రామదేవతలను భక్తులు పూజిస్తారు. కుటుంబానికి, గ్రామానికి ఆరోగ్యం, సుఖశాంతులు కలగాలని కోరుకుంటూ అమ్మవారికి బోనం సమర్పించడం ఈ సంప్రదాయంలో ప్రధాన భాగం. ఇంటి వంటగదిలో తయారు చేసిన ఆహారాన్ని అమ్మవారికి నైవేద్యంగా తీసుకెళ్లడం బోనాల ఆచారంలోని ప్రత్యేకత. ప్రాంతీయ సంప్రదాయాలను బట్టి బోనం తయారీలోనూ స్వల్ప తేడాలు కనిపిస్తాయి. బెల్లం బోనం, పచ్చ బోనం, చద్దన్నం బోనం, పులగం బోనం, పచ్చిపులుసు బోనం, కలగూర బోనం వంటి పేర్లతో వివిధ రకాల నైవేద్యాలను సమర్పించే ఆనవాయితీలు ఉన్నాయి.
సాధారణంగా కొత్త మట్టి కుండలో అన్నం వండి, కొన్ని సంప్రదాయాల్లో పాలు, బెల్లాన్ని కూడా ఉపయోగిస్తారు. అనంతరం కుండను వేపాకులు, పసుపు, కుంకుమతో అలంకరిస్తారు. బోనం కుండపై మరో చిన్న పాత్రను ఉంచి అందులో దీపాన్ని వెలిగించే ఆచారం కూడా ఉంది. దీనినే బోనం జ్యోతిగా పిలుస్తారు. ఇలా సిద్ధం చేసిన బోనాన్ని మహిళలు తలపై ధరించి డప్పుల మోతల మధ్య ఆలయానికి తీసుకెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు. కొన్ని ప్రాంతాల్లో బోనంతో పాటు గాజులు, చీరలు వంటి వస్తువులను కూడా అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా ఉంది.
ఆషాఢ బోనాల వెనుక ఉన్న కథ ఇదే
బోనాలను ఆషాఢ మాసంలో నిర్వహించడం వెనుక భక్తి విశ్వాసాలతో పాటు సామాజిక, సాంప్రదాయిక, ఆరోగ్యపరమైన కారణాలున్నాయి.
పుట్టింటికి వచ్చే జగదంబ: తెలుగు కుటుంబాల్లో ఆషాఢ మాసంలో కొత్తగా వివాహమైన మహిళ పుట్టింటికి వెళ్లే ఆచారం ఉంది. ఈ ఆచారాన్ని అనుసరించి ఆషాఢ మాసంలో మహంకాళి అమ్మవారు భూలోకానికి వస్తారని భక్తులు భావిస్తారు. ఆ విధంగా ఇంటికి వచ్చిన అమ్మవారికి భక్తితో 'బోనం' సమర్పిస్తారు.
ఆరోగ్య పరిరక్షణ : వర్షాకాలం ప్రారంభమయ్యే సమయం కావడంతో గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆషాఢంలో నీరు కలుషితమై కలరా, ప్లేగు, మశూచి అంటువ్యాధులు, వైరస్లు వేగంగా విస్తరించేవి. ఈ వైపరీత్యాల నుంచి కాపాడాలంటూ గ్రామదేవతలను ఆరాధించడం ప్రారంభమైంది. ఆ క్రమంలో గ్రామ దేవతల ఆరాధనకు ఉపయోగించే వేపాకులు, పసుపునీళ్లు, వస్తువులన్నీ వైరస్ వ్యాప్తిని నిరోధిస్తాయి. బోనాల ఆచారాల్లో వేపాకు, పసుపు వంటి పదార్థాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. సంప్రదాయంగా వీటిని శుభ్రత, రక్షణకు ప్రతీకలుగా భావిస్తూ పూజా కార్యక్రమాల్లో ఉపయోగిస్తారు. ఆ విధంగా ఆషాడంలో బోనం వెనుక ఆరోగ్యపరమైన కారణం దాగి ఉంది.
బోనాల వేడుకల్లోని ముఖ్యమైన ఘట్టాలు
ఘటోత్సవం: బోనాల ఉత్సవాల్లో అత్యంత వైభవంగా సాగే మరొక ముఖ్య ఘట్టం 'ఘటోత్సవం'. సంస్కృతంలో 'ఘటం' అంటే మట్టి లేదా రాగి కలశం అని అర్థం. భక్తిశ్రద్ధలతో సిద్ధం చేసిన ఆ కలశంపై అమ్మవారి దివ్య రూపాన్ని చిత్రించి, పట్టు వస్త్రాలు మరియు పూలమాలలతో దేవిలాగే సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆ కలశంలోకి జగన్మాతను ఆవాహన చేస్తారు. అనంతరం ఒంటి నిండా పసుపు దాల్చిన ఆలయ పూజారి ఆ పవిత్ర ఘటాన్ని శిరస్సుపై ధరించి, డప్పు వాయిద్యాల మోతల నడుమ నగర వీధుల్లో ఊరేగింపుగా ఊరంతా తిప్పుతారు.
సాక పోయడం: బోనాలు సమర్పించడానికి ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారికి బెల్లం పానకాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. దీనిని 'సాక' అంటారు.
తొట్టెల సమర్పణ: సంతాన ప్రాప్తి కోసం, పిల్లలకు ఆరోగ్య సమస్యలు తొలగిపోవాలని కోరుకుంటూ వెదురు పుల్లలు, రంగుల కాగితాలతో అందంగా తయారు చేసిన ఊయల వంటి 'తొట్టెలను' ఆలయానికి సమర్పిస్తారు.
రంగం (భవిష్యవాణి): ఉత్సవాల్లో అత్యంత కీలకమైన ఘట్టం రంగం. అమ్మవారు ఆవహించిన మహిళ (మాతంగి) పచ్చి కుండపై నిలబడి రాబోయే సంవత్సరంలో వర్షాలు, పంటలు, దేశ పరిస్థితుల గురించి భవిష్యవాణి వినిపిస్తుంది.
పోతురాజుల విన్యాసం: బోనాల జానపద సంప్రదాయంలో పోతురాజుకు ప్రత్యేకమైన ప్రతీకాత్మక స్థానం ఉంది. అమ్మవారి పరివారంలో రక్షకుడి పాత్రను పోషించే వ్యక్తిగా ఆయనను భక్తులు భావిస్తారు. దేహదారుఢ్యం కలిగిన వ్యక్తులు ఒంటికి పసుపు, నుదుట పెద్ద కుంకుమ బార్, కాలికి గజ్జెలు, చేతిలో కొరడా ధరించి ఫలహార బండి ఊరేగింపును ముందుండి నడిపిస్తారు. పూనకం వచ్చిన మహిళలను సురక్షితంగా ఆలయానికి చేర్చడంలో, జనసమూహాన్ని క్రమబద్ధీకరించడంలో పోతురాజుల పాత్ర ప్రధానమైనది.
ఫలహారం బండి ఊరేగింపు: బోనాల వేడుకల్లో భాగంగా ఆచరించే మరొక సంప్రదాయ ఘట్టం 'ఫలహారబండి ఉత్సవం'. ఈ పర్వదినాన భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమనిష్టలతో రకరకాల పిండివంటలు మరియు నైవేద్యాలను తయారు చేస్తారు. ఇలా సిద్ధం చేసిన ప్రసాదాలను అందంగా అలంకరించిన వాహనాల్లో (బండ్లలో) ఉంచి, మంగళ వాయిద్యాల నడుమ దేవాలయం చుట్టూ ప్రదక్షిణగా తిప్పుతారు.
బలి: భవిష్యవాణి (రంగం) పూర్తయిన తర్వాతి రోజున పోతురాజులు ఆలయ ప్రాంగణంలో అమ్మవారి సమక్షంలో రౌద్ర రసంతో కూడిన వీర నాట్యం చేస్తారు. భక్తిపారవశ్యంతో సాగే ఈ నృత్యం ఉత్సవానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆ సమయంలో ఉగ్రరూపిణి అయిన దేవతను శాంతింపజేయడానికి మరియు దిష్టి తొలగించడానికి ప్రతీకగా సొరకాయలు, ఎర్ర గుమ్మడికాయల వంటి కూరగాయలను నేలకేసి కొట్టి అమ్మవారికి నైవేద్యంగా (బలి) సమర్పిస్తారు. కొన్ని ప్రాంతాలలో జంతు బలులు కూడా ఇస్తుంటారు.
సాగనంపటం: బోనాల పండుగ ముగింపులో అమ్మవారి ఘటాలను మంగళ వాయిద్యాల నడుమ ఊరేగిస్తూ సాగనంపడంతో ఈ సుదీర్ఘ ఉత్సవాలు ముగుస్తాయి.
వెయ్యేళ్ల ఆనవాళ్లు.. శిల్పాల నుంచి శాసనాల వరకు బోనాల చరిత్ర
బోనాల సంప్రదాయం నిన్న మొన్నటిది కాదు; దీని వెనుక శతాబ్దాల విలక్షణమైన చరిత్ర ఉంది. రాతి శిల్పాలు, పురాతన గర్భపాత్రలు, చారిత్రక సాహిత్య గ్రంథాలు, శిలాశాసనాల వరకు భిన్న రూపాల్లో లభిస్తున్న ఆనవాళ్లు బోనాల పండుగ ప్రాచీనతకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. వీటన్నింటినీ కలిపి చూస్తే అమ్మవారిని బోనంతో కొలిచే ఆచారం తెలంగాణ సమాజంలో చాలా కాలంగా కొనసాగుతున్న సాంస్కృతిక సంప్రదాయమని అర్థమవుతుంది. అయితే ఈ ఆచారం ఎప్పుడు మొదలైంది? దీనికి చారిత్రక ఆధారాలేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం చరిత్రలోకి వెళ్తే.. బోనాల మూలాలు చాలా కాలం వెనక్కి వెళ్లినట్లు ఆధారాలు సూచిస్తున్నాయి.
రాతి గుట్టల్లో కనిపించిన ఆధారం
బోనం సమర్పించే సంప్రదాయం ప్రాచీన కాలం నుంచే ఉండేదన్న వాదనకు కామారెడ్డి జిల్లా మరంద్రాళ్ల తండా సమీపంలోని రాతి గుట్టల్లో లభించిన శిల్పాలు ఒక ముఖ్యమైన ఆధారంగా నిలుస్తున్నాయి. అక్కడ లభించిన శిల్పాల్లో తలపై బోనం మోస్తున్న మహిళల రూపాలు కనిపిస్తాయి. ఆషాఢ మాసంలో అమ్మవారిని ఆరాధించే సంప్రదాయంతో వీటికి సంబంధం ఉందని చారిత్రక పరిశోధనలు సూచిస్తున్నాయి.
ఇదే సంప్రదాయానికి మరింత పాత ఆనవాళ్లను అన్వేషించే క్రమంలో మేడ్చల్ జిల్లా కీసరగుట్ట వద్ద లభించిన 'గర్భాపాత్ర' కూడా ప్రస్తావనకు వస్తుంది. విష్ణుకుండినుల కాలానికి చెందినదిగా భావిస్తున్న ఈ పాత్ర సుమారు 1,600 ఏళ్ల నాటిదని చెబుతున్నారు.
కాకతీయుల కాలంలోనూ అమ్మవారి ఆరాధన
తెలంగాణ చరిత్రలో కాకతీయుల కాలానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆ కాలంలోనూ అమ్మవారి ఆరాధనకు ప్రాధాన్యం ఉన్నట్లు సాహిత్య ఆధారాలు చెబుతున్నాయి. రాణి రుద్రమదేవి తన కుమార్తె ముమ్మడమ్మకు సంతానం కలగాలని కోరుకుంటూ మొగిలిచర్లలోని ఏకవీరాదేవికి బోనం సమర్పించినట్లు ఏకామ్రనాథుడి 'ప్రతాప చరిత్ర'లో పేర్కొన్నట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. 'పండితారాధ్య చరిత్ర'లోనూ ఇలాంటి ఉత్సవాల ప్రస్తావన కనిపిస్తుంది. దీంతో బోనం సమర్పించే ఆచారం కేవలం సాధారణ ప్రజల ఆచారంగా కాకుండా, మధ్యయుగ తెలంగాణలోని రాజ కుటుంబాలు, సామాజిక వర్గాల ఆధ్యాత్మిక జీవితంలోనూ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
విజయనగర శాసనంలో బోనాల ప్రస్తావన
విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణ దేవరాయలు 600 ఏళ్ల క్రితం ఏడుకోళ్ల నవదత్తి ఆలయాన్ని నిర్మించి బోనాలు సమర్పించుకున్నారని చరిత్రకారులు చెబుతారు. బోనాల చరిత్రలో మరో కీలక ఆధారం శాసన రూపంలో కనిపిస్తుంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వేయించిన ఒక శిలాశాసనం ఇందుకు ప్రాముఖ్యత సంతరించుకుంది. క్రీ.శ. 1516 మే 4నాటి ఈ శాసనం తెలంగాణ-కర్ణాటక సరిహద్దులోని గొబ్బూరులో లభించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రాష్ట్ర పురావస్తు ప్రదర్శనశాలలో దీనిని చూడవచ్చు. బోనాల పండుగ నిర్వహణకు సంబంధించిన ఆర్థిక భారం తగ్గించేలా పన్నుల రద్దు చేసిన విషయాన్ని ఈ శాసనం నమోదు చేసినట్లు చారిత్రక వివరాలు చెబుతున్నాయి. బోనాల నిర్వహణకు సంబంధించి ఇంత స్పష్టమైన అధికారిక ఆధారం లభించడం ఈ పండుగకు అప్పటికే ఉన్న సామాజిక, ధార్మిక ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది.
పాపన్న గాథల్లోనూ బోనాల ప్రస్తావన
తెలంగాణలో బహుజన రాజ్య స్థాపకుడు సర్వాయి పాపన్నకు సంబంధించిన గాథల్లోనూ అమ్మవారి ఆరాధన ప్రస్తావన కనిపిస్తుంది. క్రీ.శ. 1676లో కరీంనగర్లో ఎల్లమ్మ ఆలయాన్ని నిర్మించి అమ్మవారికి బోనాలు సమర్పించినట్లు ప్రతీతి.
రాష్ట్ర పండుగ హోదా
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత బోనాల పండుగకు మరింత అధికారిక గుర్తింపు లభించింది. 2014లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. అప్పటివరకు ప్రధానంగా స్థానిక దేవాలయాల కమిటీలు, భక్తులు, ప్రజల భాగస్వామ్యంతో ఈ ఉత్సవాలు జరిగేవి. కానీ రాష్ట్ర పండుగ హోదా లభించడంతో ప్రభుత్వం ఆధ్వర్యంలో బోనాలను నిర్వహించడం ప్రారంభమైంది. ప్రతి ఏటా ప్రత్యేక నిధులు కేటాయిస్తూ, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తూ ప్రభుత్వం బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది.
గోల్కొండ నుంచి లాల్‌దర్వాజా వరకు.. జంటనగరాల్లో బోనాల వైభవం
తెలంగాణ బోనాల ఉత్సవాల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో జరిగే వేడుకలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆషాఢ మాసంలో గోల్కొండ కోటపై వెలిసిన శ్రీ జగదాంబిక అమ్మవారికి సమర్పించే తొలి బోనం సమర్పించడంతో అంకురార్పణ జరిగే ఈ మహోత్సవం వారం వారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి, బాల్కంపేట ఎల్లమ్మ దేవాలయాలను దాటుకుంటూ, చివరికి పాతబస్తీలోని చారిత్రాత్మక లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహాంకాళి ఆలయం వద్ద ముగుస్తుంది. నెల రోజుల పాటు సాగే ఈ సుదీర్ఘ ఉత్సవంలో రంగురంగుల ఘటోత్సవాలు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల వీరంగాలు, రంగం భవిష్యవాణి, ఏనుగుపై అమ్మవారి అంబారీ ఊరేగింపులు జంటనగరాల ప్రజలకు ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందిస్తూ, తెలంగాణ సంస్కృతిని ప్రపంచ పటంలో సమున్నతంగా నిలబెడతాయి. గోల్కొండలో అంకురించిన తొలి బోనం నుంచి లాల్‌దర్వాజాలో ప్రతిధ్వనించే అమ్మవారి జయజయధ్వానాల వరకు.. జంట నగరాల బోనాల ప్రయాణం తెలంగాణ భక్తి విశ్వాసాలకు మాత్రమే కాదు, నగర జీవనంతో ముడిపడిన పల్లె మూలాల సంస్కృతికి కూడా సజీవ ప్రతిబింబంగా నిలుస్తోంది.
గోల్కొండ బోనాలు.. వెయ్యేళ్ల నాటి విశ్వాసానికి ప్రతీక
గోల్కొండ బోనాల జాతరకు దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఉందని స్థానికంగా ప్రచారంలో ఉన్న కథనాలు చెబుతున్నాయి. గోల్కొండ కోట కాకతీయుల ఆధీనంలో ఉన్న కాలం నుంచే ఇక్కడ అమ్మవారి ఆరాధన, బోనాల సంప్రదాయం కొనసాగుతున్నట్లు భక్తుల విశ్వాసం. హైదరాబాద్ నగరం ఏర్పడక ముందే ఈ ప్రాంతంలో రామ్‌దేవ్ రావు అనే వ్యక్తి పశువులను కాస్తుండగా అమ్మవారి విగ్రహం లభించిందని ఒక కథనం ప్రాచుర్యంలో ఉంది. ఈ విషయం కాకతీయ రాజుల దృష్టికి వెళ్లడంతో.. అక్కడ చిన్న ఆలయాన్ని నిర్మించి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు చెబుతారు.
కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు స్వయంగా అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు కూడా స్థానిక గాథల్లో ప్రస్తావన కనిపిస్తుంది. అప్పటి నుంచి గోల్కొండలో ఏటా అమ్మవారికి బోనం సమర్పించే సంప్రదాయం కొనసాగుతోందన్నది భక్తుల నమ్మకం. కాకతీయుల అనంతరం గోల్కొండను పాలించిన కులీ కుతుబ్ షా, తదనంతరం ఇతర పాలకుల కాలంలోనూ ఈ ఆరాధనా సంప్రదాయం కొనసాగినట్లు స్థానిక చరిత్ర, జనశ్రుతులు పేర్కొంటాయి.
తానీషా పాలనలో అక్కన్న–మాదన్నల ఆధ్వర్యంలో గోల్కొండ కోటతో పాటు హైదరాబాద్ పరిసరాల్లోని అమ్మవారి, గ్రామదేవతల ఆలయాల్లోనూ బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగేవని ప్రతీతి. ఇలా రాజ్యాలు మారినా, పాలకులు మారినా.. గోల్కొండలో అమ్మవారి ఆరాధన మాత్రం తరతరాలుగా కొనసాగుతూ, నేటి బోనాల పండుగకు ఒక బలమైన చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాన్ని ఏర్పరిచింది.
తెలుగు పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసం అమావాస్య తర్వాత వచ్చే ఆషాఢ మాసంలో తొలి గురువారం గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక మహంకాళి (గోల్కొండ ఎల్లమ్మ) అమ్మవారికి ఆలయంలో బంగారు బోనం సమర్పించడంతో జంటనగరాల్లో బోనాల సంబురాలు ప్రారంభమవుతాయి. అక్కడి నుంచి ప్రతి వారం ఒక్కో ఆలయానికి ఉత్సవ వైభవం విస్తరిస్తుంది. రెండో వారం బల్కంపేట రేణుక ఎల్లమ్మ ఆలయంలో, మూడో వారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో, నాలుగో వారం పాతబస్తీలోని చారిత్రాత్మక లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో బోనాలు ఘనంగా జరుగుతాయి. లాల్‌దర్వాజ సింహవాహినీ మహంకాళీ ఆలయంలో జరిగే రంగం వేడుకలతో నగరంలో బోనాల వేడుకలు ముగుస్తాయి.
గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక మహంకాళి (గోల్కొండ ఎల్లమ్మ) అమ్మ వారికి ఆషాఢమాసంలో ప్రతి ఆదివారం, గురువారం ప్రత్యేక నిష్ఠతో తొమ్మిది విలక్షణమైన పూజలు సమర్పించడం తరతరాలుగా వస్తున్న పవిత్ర సంప్రదాయం. ఆషాఢపు తొలి గురువారం రోజున సమర్పించే పవిత్రమైన 'బంగారు బోనం'తో ఈ నవవిధ పూజల పరంపర అంగరంగ వైభవంగా అంకురార్పణ జరుగుతుంది. అదే రోజున లంగర్‌హౌస్ నుంచి కోటపైకి వర్ణరంజితమైన కాగితాలు, వెదురుతో తయారుచేసిన మైసమ్మ తోట్టెలను ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు. ఈ తొమ్మిది దినాల్లో (4 గురువారాలు, 5 ఆదివారాలు లేదా తిథుల ఆధారంగా) అమ్మవారిని శాంబవి, మహిషాసురమర్దిని, రేణుకాదేవి, రాజరాజేశ్వరి వంటి వివిధ శక్త్యవతారాలలో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. ప్రతి పూజా దినాన చండియాగం, రుద్రాభిషేకం, లలితా సహస్రనామ కుంకుమార్చనలు నిర్వహిస్తారు. విశేష అభిషేకాలు, కుంకుమార్చనలు, స్వర్ణాభరణ అలంకారాలు మరియు వివిధ రూపాల్లో నైవేద్యాలను నివేదిస్తారు. ప్రతి పూజానంతరం సాయంత్రం వేళ అమ్మవారి ఉత్సవ మూర్తిని కోట పరిసరాల్లో ఊరేగిస్తారు. రుతుపవనాల ఆగమనంతో వ్యాధులు వ్యాపించకుండా ఉండేందుకు ఆషాఢంలో సమర్పించే ఈ తొమ్మిది పూజల్లో ధూపదీపాలు, పసుపు నీళ్లు, వేప ఆకుల నివేదన ద్వారా వాతావరణ శుద్ధి జరుగుతుందని నమ్ముతారు.
కల్యాణం.. బోనాల సంబురం.. బాల్కంపేట ఎల్లమ్మ వైభవం
ఆషాఢ మాసపు బోనాల ఉత్సవాల్లో రెండో వారం ప్రాధాన్యత బాల్కంపేట శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయానిదే. నగరంలో స్వయంభూ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన బాల్కంపేట ఆలయంలో ఆషాఢ మాసంలో జరిగే బోనాలు, అమ్మవారి కల్యాణోత్సవం జంటనగరాల భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
బాల్కంపేట అమ్మవారు భూమి మట్టానికి దిగువన (భూగర్భంలో) జలపాతం మధ్య స్వయంభూగా వెలిశారు. అమ్మవారి శిరస్సు వద్ద నిరంతరం జలం ఊరుతూ ఉండటం ఈ క్షేత్రం యొక్క అరుదైన విశిష్టత. ఆ పవిత్ర జలాన్ని తీర్థంగా స్వీకరిస్తే సకల రోగాలు, చర్మ వ్యాధులు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
బోనాల ఉత్సవాల సందర్భంగా ఆషాఢ మాసంలో వచ్చే తొలి లేదా రెండో మంగళవారం రోజున శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దివ్య కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
అమ్మవారి కల్యాణం ముగిసిన తర్వాతి ఆదివారం రోజున బాల్కంపేట పరిసర ప్రాంతాల నుంచే కాకుండా నగర నలుమూలల నుంచి మహిళలు పసుపు, కుంకుమలు, వేపాకులతో అలంకరించిన బోనాలను తలపై ధరించి శోభాయాత్రగా తరలివస్తారు. ఎల్లమ్మ తల్లిని ఆరాధిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని, ముఖ్యంగా సంతాన లేమితో బాధపడేవారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మి భక్తులు పెద్ద ఎత్తున మొక్కుబడులు చెల్లించుకుంటారు.
ఒక మొక్కు.. రెండు శతాబ్దాల చరిత్ర.. లష్కర్ బోనాల విశిష్టత
తెలంగాణలో ఆషాఢ బోనాల పండుగ అంటే ముందుగా గుర్తొచ్చేది సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం. ఆషాఢ మాసపు మూడో ఆదివారం ఈ ఆలయంలో బోనాలు సమర్పిస్తారు. ఈ ఆలయానికి, బోనాల సంప్రదాయానికి దాదాపు 200 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఒకవైపు మహమ్మారి భయం.. మరోవైపు అమ్మవారిపై అచంచలమైన విశ్వాసం.. రెండింటి మధ్య మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో ఒక భక్తుడు చేసిన మొక్కే కాలక్రమంలో సికింద్రాబాద్ బోనాల సంప్రదాయానికి పునాదిగా మారిందని చారిత్రక కథనం.
సికింద్రాబాద్ ఒకప్పుడు బ్రిటిష్ సైనిక స్థావరంగా ఉండేది. సైనిక శిబిరాన్ని స్థానికంగా ‘లష్కర్’ అని పిలిచేవారు. అందువల్ల సికింద్రాబాద్‌లో జరిగే బోనాలకు కాలక్రమంలో ‘లష్కర్ బోనాలు’ అనే పేరు స్థిరపడింది.
సికింద్రాబాద్ సమీపంలోని పాత బోయిగూడకు చెందిన సురటి అప్పయ్య అప్పట్లో బ్రిటిష్ సైన్యంలో పనిచేసేవారు. తొలుత సికింద్రాబాద్‌లో విధులు నిర్వహించిన ఆయనకు 1813లో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి బదిలీ అయింది. అక్కడ విధుల్లో చేరిన కొద్ది రోజులకే కలరా మహమ్మారి విజృంభించింది. వ్యాధి తీవ్రతతో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్న సమయంలో.. అప్పయ్య తన సహోద్యోగులతో కలిసి ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. మహమ్మారి నుంచి ప్రజలు బయటపడి, పరిస్థితులు చక్కబడితే తన స్వస్థలంలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఆలయం నిర్మిస్తానని అప్పయ్య మొక్కుకున్నట్లు కథనం. ఆయన కోరుకున్నట్లుగానే కొద్దికాలంలో కలరా వ్యాధి తీవ్రత తగ్గి, అనేక మంది కోలుకున్నారని చెబుతారు. దీంతో అమ్మవారి కటాక్షం వల్లే మహమ్మారి తగ్గుముఖం పట్టిందని అప్పయ్య, ఆయన మిత్రులు విశ్వసించారు.
1815లో సికింద్రాబాద్‌లో ఆలయానికి అంకురార్పణ
మొక్కు తీర్చుకోవాలనే సంకల్పంతో 1815లో అప్పయ్య సికింద్రాబాద్‌కు తిరిగి వచ్చారు. తన మొక్కును కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు వివరించి వారి సహకారంతో పాతబోయిగూడ బస్తీ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో కట్టెతో తయారు చేసిన మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆలయ గర్భగుడి నిర్మాణ సమయంలో మరో రాతి విగ్రహం బయటపడిందని, దానిని మాణిక్యాలమ్మగా గుర్తించి మహంకాళి అమ్మవారి పక్కనే ప్రతిష్ఠించారని ఆలయ అధికారిక చరిత్రలో పేర్కొన్నారు. 1864లో మహంకాళి అమ్మవారి రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ఆలయ చరిత్రలో నమోదైంది. అనంతరం అప్పయ్య కుమారుడు సంజీవయ్య తన గ్రామంలోని మిత్రులు, దాతల సహకారంతో 1900లో ఆలయ మండపాన్ని నిర్మించినట్లు వివరాలు చెబుతున్నాయి. ఆలయ నిర్వహణ, అభివృద్ధి కూడా క్రమంగా విస్తరించి, అనంతరం దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చింది.
ఉజ్జయినిలో అప్పయ్య దర్శించిన మహంకాళి అమ్మవారి పేరునే సికింద్రాబాద్‌లో ప్రతిష్ఠించిన దేవతకు ‘ఉజ్జయిని మహంకాళి’గా నామకరణం చేసినట్లు చెబుతారు. అక్కడ ఆషాఢ మాసంలో అమ్మవారి ఉత్సవాలను చూసిన అప్పయ్య, అదే మాసంలో సికింద్రాబాద్‌లోనూ అమ్మవారి జాతర నిర్వహించాలని నిర్ణయించినట్లు స్థానిక కథనం. అలా ఆషాఢ మాసంలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించే సంప్రదాయం మొదలైనట్లు భక్తుల విశ్వాసం.
రంగం (మాతంగి భవిష్యవాణి)
సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి బోనాల పండుగలో భక్తులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసే విశిష్ట ఘట్టం 'రంగం'. జాతర ముగింపు రోజైన సోమవారం ఉదయం ఈ ప్రత్యేక కార్యక్రమం జరుగుతుంది. రంగం' అంటే దైవజ్ఞానం లేదా భవిష్యవాణి అని అర్థం. రాబోయే సంవత్సరంలో వర్షపాతం, వ్యవసాయ ఫలితాలు, ప్రజల క్షేమం మరియు దేశంలో చోటుచేసుకునే వాతావరణ మార్పుల గురించి అమ్మవారు జోగిని (మాతంగి) రూపంలో ఆవహించి తన ముందస్తు సందేశాన్ని వినిపిస్తుంది.
అంబారీ ఊరేగింపు
రంగం ముగిసిన అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని అలకరించిన ఏనుగుపై (అంబారీ) ఆసీనులను చేసి నగరోత్సవం నిర్వహిస్తారు. నగర పోలీస్ కమిషనర్ సమక్షంలో సాగే ఈ శోభాయాత్ర సికింద్రాబాద్ వీధుల గుండా అత్యంత వైభవంగా సాగుతుంది.
మెట్టుగూడ వద్ద అలంకరణ ఉపసంహరణ
అంబారీ ఊరేగింపు పూర్తయిన తర్వాత, సాయంత్రం వేళ అమ్మవారి కలశ ఘటాన్ని మంగళవాయిద్యాలు, డప్పు దరువులు, భక్తుల కోలాహలం నడుమ నగర వీధుల్లో ఘనంగా ఊరేగిస్తారు. మెట్టుగూడ వద్ద అలంకరణ ఉపసంహరణ: ఆలయ అధికారిక ఆచారం ప్రకారం.. ఈ శోభాయాత్ర సికింద్రాబాద్ సమీపంలోని మెట్టుగూడ ప్రాంతానికి చేరుకుంటుంది. అక్కడే ప్రత్యేక పూజలు నిర్వహించి, శాస్త్రోక్తంగా ఘటానికి చేసిన అలంకరణను తొలగించే పవిత్ర సంప్రదాయాన్ని పాటిస్తారు.
బోనాల భక్తిలో పాతబస్తీ.. లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి
హైదరాబాద్ పాతబస్తీ సంస్కృతికి, ఆషాఢ బోనాల మహోత్సవ ముగింపు వైభవానికి కేంద్రబిందువు లాల్‌దర్వాజాలోని శ్రీ సింహవాహిని మహాంకాళి దేవాలయం. ఆషాఢ మాసపు చివరి ఆదివారం నాడు ఇక్కడ బోనాలను సమర్పిస్తారు. ఇక్కడ అమ్మవారు గంభీరమైన సింహ వాహనంపై ఆసీనులై, శత్రు సంహారిణిగా, వ్యాధి నివారిణిగా భక్తులకు దర్శనమిస్తారు.
లాల్ దర్వాజలోని శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధ శక్తి పీఠాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. లాల్ దర్వాజ ప్రాంతం 1907 ప్రాంతంలో అభివృద్ధి చెందింది. అయితే 1908లో హైదరాబాద్‌ను భయంకరమైన మూసీ నది వరదలు ముంచెత్తాయి. ఆ వరదల నుంచి హైదరాబాద్ నగరాన్ని రక్షించడం కోసం అప్పటి నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ తన ప్రధాన మంత్రి మహారాజా కిషన్ పర్షాద్ సలహా మేరకు శ్రీ మహంకాళి అమ్మవారిని ప్రత్యేకంగా ప్రార్థించినట్లు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి.
ఆ సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు, బంగారు గాజులు, ముత్యాలు, నగలు, కుంకుమ, పసుపుతో విశేష పూజలు నిర్వహించి, ఆ కానుకలను బంగారు చాటలో ఉంచి మూసీ నదికి సమర్పించారని విశ్వాసం. అనంతరం వరద ఉధృతి తగ్గడంతో అమ్మవారి మహిమను కీర్తిస్తూ బోనాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ప్రారంభమైనట్లు చెబుతారు. తరువాత నిజాం ప్రభుత్వం ఈ ఆలయానికి భూములు, విరాళాలు అందించి ఆలయ అభివృద్ధికి తోడ్పడింది. అప్పటి నుంచి ఈ ఆలయం హైదరాబాద్‌లోని ప్రముఖ శక్తి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.
పోసాని కుటుంబ పోతురాజు వీరంగం
లాల్‌దర్వాజా బోనాల్లో పోసాని కుటుంబానికి చెందిన పోతురాజుల వీరంగం దశాబ్దాలుగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. శరీరం నిండా పసుపు, కుంకుమలు, చేతిలో తాళ్లతో చేసిన కొరడా ధరించి అమ్మవారి శాంతి కోసం వీరు చేసే నృత్యం ఆకర్షణీయంగా ఉంటుంది.
శ్రీ మాతంగి కన్యచే 'రంగం' (భవిష్యవాణి)
సోమవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో అత్యంత నిష్ఠతో 'రంగం' కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పచ్చి మట్టి కుండపై నిలబడి మాతంగి కన్య (ఆవేశపరురాలైన శివసత్తి) అమ్మవారి స్వరూపిణిగా మారి నగర ప్రజలను ఉద్దేశించి భవిష్యవాణిని ప్రవచిస్తుంది. రంగం ప్రవచనం పూర్తయిన వెంటనే, నాటి సంప్రదాయం ప్రకారం నగరం చల్లగా ఉండాలని, దుష్ట శక్తులు నశించాలని కోరుతూ ఆలయం వద్ద శాంతి పూజలు చేసి, సాంప్రదాయ 'గావు' సమర్పణ (అమ్మవారి సంతృప్తి కోసం చేసే పూజా విధి) నిర్వహిస్తారు.
ముగింపు ఘట్టం
లాల్‌దర్వాజా బోనాల మరుసటి రోజు (సోమవారం) జరిగే 'ఘటోత్సవం' జంటనగరాల ఆషాఢ బోనాలకే ముగింపు సూచికగా నిలుస్తుంది. పాతబస్తీలోని ప్రసిద్ధ ఆలయాలైన లాల్‌దర్వాజా, ఉప్పుగూడ, మదీనా, శాలిబండ, మిస్రీగంజ్ మొదలైన 25కు పైగా దేవాలయాలకు చెందిన అమ్మవారి పవిత్ర 'ఘటాలు' (అలంకరించిన అమ్మవారి ప్రతిరూపాలు) ఒకే చోటికి చేరుకుంటాయి. ఈ ఘటాలన్నీ కలిసి లాల్‌దర్వాజా నుంచి బయలుదేరి చార్మినార్, పత్తర్‌గట్టి, మదీనా, నయాపూల్ మీదుగా అర్థరాత్రి వరకు కనులవిందుగా ఊరేగుతాయి. ఊరేగింపు పొడవునా భక్తులు పసుపు, కుంకుమలు సమర్పిస్తూ హారతులు పడతారు. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత (మరుసటి రోజు తెల్లవారుజామున) ఈ పవిత్ర ఘటాలన్నీ నయాపూల్ వద్ద ఉన్న మూసీ నది లేదా పవిత్ర జలాశయాలకు చేరుకుంటాయి. అక్కడ ప్రత్యేక పూజలు చేసి, ఘటాలను శాస్త్రోక్తంగా శాంతింపజేయడంతో ఆ సంవత్సరానికి సంబంధించిన జంటనగరాల ఆషాఢ బోనాల మహోత్సవాలు మంగళప్రదంగా పూర్తవుతాయి.
శ్రావణం.. పల్లెల్లో బోనాల సందడి
ఆషాఢ మాసంలో జంటనగరాల్లో (హైదరాబాద్, సికింద్రాబాద్) బోనాలు ముగిసిన అనంతరం, శ్రావణ మాసంలో పల్లెసీమల్లో మరియు కొన్ని పట్టణ ప్రాంతాల్లో ప్రారంభమయ్యే వేడుకలే శ్రావణ బోనాలు. ఆషాఢ బోనాలకు ఎంతటి విశిష్టత ఉందో, శ్రావణ బోనాలకు గ్రామ సంస్కృతిలో అంతటి ప్రాధాన్యత ఉంది. శ్రావణ మాసంలో వచ్చే రుతుపవనాల వ్యాధుల నుండి పాడిపంటలను, పశుసంపదను, ఊరి ప్రజలను రక్షించమని గ్రామదేవతలను వేడుకోవడం ఈ ఉత్సవాల ప్రధాన ఉద్దేశం.
శ్రావణ మాసంలో రుతుపవనాల ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే నేపథ్యంలో.. వ్యాధుల నుంచి గ్రామ ప్రజలను, పాడిపంటలను, పశుసంపదను కాపాడాలని కోరుతూ గ్రామదేవతలను కొలవడం ఈ వేడుకల్లో ప్రధానమైన విశ్వాసంగా కనిపిస్తుంది. గ్రామ పొలిమేరల్లో కొలువైన అమ్మవార్లకు బోనాలు సమర్పించి, తమ ఊరిని కాపాడాలని వేడుకోవడం తరతరాలుగా కొనసాగుతున్న ఆచారంగా పలు ప్రాంతాల్లో కనిపిస్తుంది.
పూర్వకాలంలో ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా నగరాల్లో స్థిరపడినవారు ఆషాఢంలో హైదరాబాద్‌లో బోనాలు జరుపుకునేవారు. ఆ పండుగ ఉత్సాహాన్ని, భక్తిభావాన్ని తమ స్వగ్రామాలకు తీసుకెళ్లి, శ్రావణ మాసంలో ఊరి దేవతలకు బోనాలు ఎత్తే ఆచారాన్ని ప్రారంభించారు. కాలక్రమేణా ఇది గ్రామ సాంప్రదాయంలో విడదీయరాని భాగమైంది.
శ్రావణ బోనాలకు జంట నగరాల ఆషాఢ బోనాల మాదిరిగా ఒకే కేంద్ర ఆలయం, నిర్దిష్టమైన వారాల క్రమం ఉండదు. ప్రాంతానికో అమ్మవారు.. ఊరికో ఆచారం.. అన్నట్లుగా స్థానిక విశ్వాసాలు, సంప్రదాయాలు, గ్రామదేవతల ప్రాధాన్యాన్ని బట్టి వేడుకల తేదీలు, నిర్వహణ విధానం మారుతూ ఉంటాయి. సాధారణంగా గ్రామ పెద్దలు, ఆలయ కమిటీలు, స్థానికుల సంప్రదింపులతో ఉత్సవాల తేదీలను నిర్ణయిస్తారు.
పట్టణాల సందడికి భిన్నంగా సంప్రదాయ పల్లె వాతావరణంలో జరిగే శ్రావణ బోనాలు వ్యవసాయం, ప్రకృతి, గ్రామ జీవనంతో ముడిపడి ఉంటాయి. పొలిమేరల్లోని గ్రామదేవతలకు బోనాలు సమర్పించడం, మొక్కులు చెల్లించుకోవడం, సామూహికంగా పూజలు నిర్వహించడం ద్వారా గ్రామ ప్రజలు తమ ఐక్యతను చాటుకుంటారు. ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, పోలేరమ్మ, ముత్యాలమ్మ వంటి గ్రామదేవతలను పల్లెకు కాపలాదారులుగా భావిస్తూ భక్తులు బోనాలు సమర్పిస్తారు.
బోనాల సమర్పణతో పాటు ఊరేగింపులు, డప్పుల మోత, పోతురాజుల విన్యాసాలు, ఘటాల ఊరేగింపు వంటి ఆచారాలు కూడా అనేక ప్రాంతాల్లో కనిపిస్తాయి. అయితే ఇవన్నీ ప్రతి గ్రామంలో ఒకే విధంగా ఉండవు. స్థానిక సంప్రదాయాన్ని బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఈ వైవిధ్యమే శ్రావణ బోనాలను తెలంగాణ పల్లె సంస్కృతికి ప్రత్యేక ప్రతిబింబంగా నిలబెడుతోంది.
అమ్మవారిపై భక్తి.. ప్రకృతిపై కృతజ్ఞత.. పాడిపంటలపై మమకారం.. గ్రామ సమాజంపై బాధ్యత.. ఇవన్నీ కలగలిసిన సంప్రదాయమే శ్రావణ బోనాలు. అందుకే ఇవి కేవలం అమ్మవారికి నైవేద్యం సమర్పించే వేడుకగా కాకుండా.. తెలంగాణ పల్లెల ఐక్యతకు, జానపద భక్తితత్వానికి, ప్రకృత్యారాధనకు ప్రతీకగా నిలుస్తున్నాయి.