తెలంగాణ

బియ్యం వ్యాపారులపై టాస్క్‌ఫోర్స్ దాడులు : ధరలు పెంచితే పీడీ యాక్ట్ కింద కేసులు

బియ్యం మిల్లులు, హోల్‌సేల్, రిటైల్ దుకాణాలపై తెలంగాణలో 1,141 తనిఖీలు నిర్వహించారు. నిబంధనల ఉల్లంఘనలపై 55 కేసులు నమోదు చేశారు.

Phaneendra

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : కృత్రిమ కొరత, ధరల పెంపును అరికట్టేందుకు తెలంగాణ పౌరసరఫరాల శాఖ కఠిన చర్యలు చేపట్టింది. ప్రజలకు తక్కువ ధరకు బియ్యం అందించేందుకు ధరల నియంత్రణ చర్యలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు కొనసాగిస్తున్నది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్ ఫోర్స్ (ఈటీఎఫ్), లీగల్ మెట్రాలాజీ అధికారులు వారం రోజులు సంయుక్తంగా దాడులు  నిర్వహిస్తున్నారు.  టాస్క్ ఫోర్స్ బృందాలు రైస్ మిల్లులు, హోల్ సేల్ డీలర్లు, రిటైల్ షాపుల్లో మొత్తం 1,141 ఆకస్మిక తనిఖీలు చేశారు. నిబంధనలు పాటించని వారిపై ఈ తనిఖీల ద్వారా 55 కేసులు, 35 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మరోవైపు, తూనికలు-కొలతల శాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 1,545 తనిఖీలు నిర్వహించి 280 కేసులు నమోదు చేశారు. బస్తాలో 25 కిలోల బియ్యం మాత్రమే ఉంచి, పైన 26 కిలోల లేబుల్ అతికించి తూకాల్లో మోసం చేస్తున్న వ్యాపారులను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఎక్కువ ధరల స్టిక్కర్లు అంటించడం, రేషన్  బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, జీఎస్టీ లేదా ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులు లేకుండా వ్యాపారం చేయడం వంటి ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు.

ధరల నియంత్రణ ఉల్లంఘిస్తే పీడీ యాక్ట్

ప్రజలు ఎక్కువగా వాడే బియ్యం రకాలపై గరిష్ట రిటైల్ ధరలను అధికారులు నిర్ణయించారు. బీపీటీలో కేఎన్ఎంరకం బియ్యం ధరను కిలోకు రూ.66 గా నిర్ణయించారు. ఆర్ఎన్ఆర్ తెలంగాణ సోనా బియ్యం కిలో రూ.74 , అలాగే హెచ్ఎంటీ జేఎస్ఆర్ రకం బియ్యం కిలో రూ.79కి మించకూడదని స్పష్టం చేశారు. మార్కెట్లో పారదర్శకత కోసం, మిల్లర్లు, వ్యాపారులు ప్రతి 26 కిలోల బియ్యం బస్తాపై ఈ నిర్ణయించిన ధరలను తప్పనిసరిగా ముద్రించాలని సివిల్ సప్లయిస్ శాఖ ఆదేశించింది. నిర్ణీత ధరలను ఉల్లంఘించి బియ్యం ధరలు పెంచే వారిపై, రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నిత్యావసర సరుకుల చట్టం, బీఎన్ఎస్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఈ దాడులు నిరంతరం కొనసాగుతాయని సివిల్ సప్లయిస్ శాఖ అధికారులు ప్రకటించారు.