ప్రభాత ఉదయం, భూపాలపల్లి: మహారాష్ట్రకు రేషన్ బియ్యం అక్రమ రవాణా మళ్లీ ప్రారంభమైంది. ఈ దందాను కొనసాగిస్తున్న పీడీఎస్ డాన్ మహారాష్ట్రలోని తన రైస్ మిల్లుకు యథేచ్ఛగా పట్టపగలే పేదల బియ్యాన్ని తరలించి రూ. కోట్లు దండుకొంటున్నాడు. ఇందుకోసం వరంగల్, కరీంనగర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నాడు. భూపాలపల్లిలో ఓ వ్యక్తిని ప్రత్యేకంగా నియమించుకుని, తన ఏజెంట్లను గైడ్ చేసేలా తన చీకటి సామ్రాజ్యాన్ని కొనసాగిస్తున్నాడు. సదరు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి కూపీ లాగగా మాఫియా వివరాలు బయటపడ్డాయి. వాటి ఆధారంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
4500 క్వింటాళ్ల రేషన్ అక్రమ రవాణా
మహారాష్ట్ర సరిహద్దు పక్కనే ఉన్న భూపాలపల్లి జిల్లా కేంద్రంలో తన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్న సదరు వ్యక్తి, అక్కడి నుంచి జిల్లాలోని ఏజెంట్ల వరకు తన సామ్రాజ్యాన్ని పున: ప్రారంభించాడు. ఈ క్రమంలో భూపాలపల్లికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తిని స్థానిక పోలీసులు అరెస్టు చేసి జిల్లాల వారీగా ఏజెంట్ల వివరాలు రాబట్టారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, కొత్తగూడెం జిల్లాల నుంచి 15 మంది ఉన్నారని, వారు సుమారు 4500 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మహారాష్ట్రకు చేర్చినట్లు పోలీసులు గుర్తించారు.
సీసీఎస్ స్పెషల్ ఆపరేషన్
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై భూపాలపల్లి సీసీఎస్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టి ఉక్కుపాదం మోపుతున్నారు. ‘ఈ ఏడాది ఏప్రిల్ 27న గణపురం మండలం చెల్పూర్లో కొండపల్లి పెద్ద సారయ్య వద్ద 12 క్వింటాళ్లు, జులై 11న మొగుళ్లపల్లి మండలం ఆకినపల్లి వద్ద గౌరిశెట్టి కృష్ణమూర్తి అనే కిరాణా వ్యాపారి వద్ద 7 క్వింటాళ్లు. జులై 23న చిట్యాల మండలం ముచినిపర్తి గ్రామానికి చెందిన గౌరిశెట్టి సత్యనారాయణ అనే కిరణా వ్యాపారి వద్ద 6 క్వింటాళ్లు, ఆగస్టు 14న గణపురం మండలం రవి నగర్‌కు చెందిన తూర్పాటి రాజశేఖర్ వద్ద 5 క్వింటాళ్లు, ఆగస్టు 7న మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన తూర్పాటి సమ్మక్క వద్ద 5 క్వింటాళ్లు’ రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, పలువురిపై కేసులు నమోదు చేశారు. ‘స్పెషల్ ఆపరేషన్ కొనసాగుతోంది. ముఠా నెట్‌వర్క్‌ను ట్రాప్ చేశాం. వారందరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తాం. పేదలకు చేరాల్సిన పీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టించేవారిపై కఠిన చర్యలు తప్పవు’ అని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ హెచ్చరించారు.