డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 
తెలంగాణ

పూర్తిస్థాయిలో కేంద్ర నిధులను రాబట్టండి

కేంద్ర పథకాల అమలులో పెండింగ్ సమస్యలు, సాంకేతిక ఇబ్బందులను త్వరగా పరిష్కరించాలని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు.

Phaneendra

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులను పూర్తి స్థాయిలో రాబట్టాలని ఆర్థికశాఖ ఉన్నతాధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. కేంద్రం నుంచి అధికంగా నిధులు పొందేందుకు ఉన్న అన్ని అవకాశాలను శాఖలవారీగా గుర్తించి, అవసరమైన ప్రతిపాదనలను సకాలంలో సమర్పించాలని ఆయన నిర్దేశించారు. కేంద్ర ప్రభుత్వ సెక్టార్, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అమలు, నిధుల కేటాయింపులు, పెండింగ్ బిల్లులు, ఖర్చులపై మంగళవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు ఆటంకంగా ఉన్న పెండింగ్ సమస్యలు, సాంకేతిక ఇబ్బందులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను భట్టి విక్రమార్క ఆదేశించారు. రాష్ట్రానికి, ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చే పథకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు ఆయన సూచించారు. ముఖ్యంగా నీటిపారుదల, పట్టణాభివృద్ధి, రవాణా, వ్యవసాయం, వైద్య ఆరోగ్య శాఖలు ఈ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.

లైజన్ అధికారుల సేవలు వినియోగించుకోండి

కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్రం కూడా 40 శాతం నిధులను సమకూరుస్తున్నందున, వాటి వ్యయాలతో పాటు సాధిస్తున్న ఫలితాలపైనా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను డిప్యూటీ సీఎం కోరారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పలువురు కేంద్ర మంత్రులకు రాసిన లేఖల్లో ప్రస్తావించిన అంశాలపైనా సకాలంలో స్పందిస్తూ, వాటి పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఆయన ఆదేశించారు. మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు కేంద్రం నిధులిచ్చే ప్రత్యేక సహాయక పథకం వంటి కార్యక్రమాలను తెలంగాణ సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశాల్లో కేంద్రంతో సమన్వయం కోసం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో పనిచేస్తున్న లైజన్ అధికారుల సేవలను అన్ని శాఖలు వినియోగించుకోవాలన్నారు.

కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి రాష్ట్ర వాటా నిధులను సకాలంలో విడుదల చేస్తున్నామని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు. వివిధ శాఖల పరిధిలో కేంద్ర పథకాలు అమలవుతున్న తీరుపై ఉప ముఖ్యమంత్రి భట్టికి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రణాళికా శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ వివరించారు.