ప్రభాత ఉదయం, హైదరాబాద్ సిటీ : హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం రూ.275 కోట్ల నిధులు మంజూరు చేసింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ మేరకు పరిపాలనాపరమైన అనుమతులు జారీ చేసింది. ఇందులో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్‌కు రూ.150 కోట్లను బడ్జెట్ నిధులుగా విడుదల చేయగా, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌కు రూ.125 కోట్లను రుణంగా అందించేందుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశాయి. నగరంలో పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మెట్రో రైలు సేవలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం రెండో దశ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో మార్గాలను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. ప్రాజెక్టు అమలుకు అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణలో భాగంగా ప్రభుత్వం తాజా నిధుల కేటాయింపులు చేపట్టింది.