ప్రభాత ఉదయం, హైదరాబాద్ : చిరుధాన్యాలతో ప్రజలలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడంతోపాటు, మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం సెర్ప్ ఆధ్వర్యంలో మిల్లెట్ కేఫ్‌లను ఏర్పాటు చేస్తోంది. ఒకప్పుడు మన ఆహారంలో ప్రధానంగా ఉన్న జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు వంటి చిరుధాన్యాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. పోషకాలు కలిగిన ఈ ఆహార పదార్థాలను ఆధునిక అభిరుచులకు అనుగుణంగా వివిధ రకాల వంటకాలు, అల్పాహారాలు, డ్రింక్‌ల రూపంలో మిల్లెట్ కేఫ్‌ల ద్వారా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మారుతున్న ఆహారపు అలవాట్ల నేపథ్యంలో పోషక విలువలున్న ఆహారాన్ని ప్రజలకు, యువతకు చేరువ చేయడం, చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో మిల్లెట్ కేఫ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.
ఐదు ప్రాంతాల్లో కేఫ్‌లు
హైదరాబాద్‌లోని బీఆర్‌కేఆర్ భవన్, ఇందిరా మహిళా శక్తి బజార్, ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ క్యాంపస్‌తో పాటు యాదగిరిగుట్ట, మహబూబ్‌నగర్ పట్టణాల్లో మొత్తం ఐదు మిల్లెట్ కేఫ్‌లను ఏర్పాటు చేయాలని సెర్ప్ ప్రణాళిక రూపొందించింది. బీఆర్‌కేఆర్ భవన్, ఇందిరా మహిళా శక్తి బజార్, ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ క్యాంపస్, యాదగిరిగుట్ట ప్రాంతాల్లో కేఫ్‌ల నిర్మాణ పనులు ముగింపు దశకు వచ్చాయి. మహబూబ్‌నగర్‌లో అనువైన ప్రాంతాన్ని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలో నాలుగు ప్రాంతాల్లో మిల్లెట్ కేఫ్‌లను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కేఫ్‌ల ఏర్పాటుకు మొత్తం రూ.2.2 కోట్ల పెట్టుబడిని అధికారులు ప్రతిపాదించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రిసెర్చ్ (ఐఐఎంఆర్), ఏపీపీసీ(ఆంధ్రప్రదేశ్ ప్రొడిక్టివ్ కౌన్సిల్ హైదరాబాద్) సంస్థలతో సెర్ప్ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యాల ద్వారా సాంకేతిక మార్గదర్శకత్వం, శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి సహకారం అందించనున్నారు. ఇప్పటికే ఐఐఎంఆర్ తొలి విడతలో 40 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ ఇచ్చింది.
మహిళా సంఘాలకు ఆర్థిక చేయూత
'సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ' (సెర్ప్) ఆధ్వర్యంలో మహిళలు ఈ కేఫ్‌లు నిర్వహిస్తారు. చిరుధాన్యాల ఉత్పత్తులకు మార్కెట్ కల్పించడంతో పాటు, మహిళా సంఘాలకు ఆదాయ మార్గాల అభివృద్ధి మిల్లెట్ కేఫ్‌ల మరో ప్రధాన లక్ష్యం. ఈ కేఫ్‌లలో మిల్లెట్ కేకులు, మిల్లెట్ బిస్కెట్లు, చిరుధాన్యాలతో తయారు చేసిన రొట్టెలు, మురుకులు, పులిహోర, రాగి సంకటి, రాగి జావ, మిల్లెట్ ఉప్మా, మిల్లెట్ కిచిడీ వంటి ఆధునిక, సంప్రదాయ వంటకాలు లభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
మిల్లెట్స్‌ను నేటి తరానికి చేరువ చేయాలి: మంత్రి సీతక్క
చిరుధాన్యాలు మన పూర్వీకుల ఆహార సంస్కృతిలో భాగమని, వాటిలోని పోషక విలువలను నేటి తరానికి చేరువ చేసేందుకు ప్రభుత్వం మిల్లెట్ కేఫ్‌లను ఏర్పాటు చేస్తుందని పంచాతీయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమశాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. ‘‘ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంతో పాటు, మిల్లెట్ కేఫ్‌ల ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉపాధి, ఆదాయ అవకాశాలు కల్పిస్తున్నాం. మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగి, తమ కాళ్లపై తాము నిలబడటమే మా లక్ష్యం. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలు, గ్రామాలు, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయి’’ అని ఆమె పేర్కొన్నారు.