తెలంగాణ

తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండ

జనగామ జిల్లా కొన్నెకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల సాయం, ఇందిరమ్మ ఇల్లు, భార్యకు ప్రభుత్వ ఉద్యోగం మంజూరు చేసింది.

Phaneendra

ప్రభాత ఉదయం, జనగాం : తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు, జనగామ జిల్లా కొన్నె గ్రామానికి చెందిన వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. సర్కార్ తరఫున రూ. 5 లక్షల ఆర్థికసాయం, ఇందిరమ్మ ఇల్లుతో పాటు అతడి భార్యకు  ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందుల సామేల్,  డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి గురువారం కొన్నె గ్రామానికి వెళ్లి లక్ష్మణ్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం రూ. 5 లక్షలు, ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  తెలంగాణ ఉద్యమకారుల సేవలు, త్యాగాలను ప్రభుత్వం గుర్తిస్తోందని, వారికి తగిన గౌరవం ఇస్తోందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమకారులందరూ ఐక్యంగా ఉండి తమ హక్కుల సాధన కోసం పోరాడాలని సూచించారు. ఉద్యమకారులు ఎలాంటి  కష్టాలు వచ్చినా అధైర్యపడొద్దని, ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. బతికి సాధించాలే కానీ, చావు దేనికీ పరిష్కారం కాదని, కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వారి వెంట వైటీడీఏ సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. లక్ష్మణ్ గౌడ్ కుటుంబసభ్యులను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ పరామర్శించారు. ఉద్యమకారులంతా రాజకీయాలకతీతంగా ఐక్యంగా ఉండి హక్కుల సాధన కోసం పోరాడాలని సూచించారు.