ప్రభాత ఉదయం, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ఈ నెల 19 నుంచి అమలు చేయనుంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఉచిత జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. 19న సిద్దిపేటలో జరిగే భారీ బహిరంగ సభలో ఈ బీమా పథకంతో పాటు ‘ఇందిరమ్మ చీరల పంపిణీ’ని కూడా ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఈ నెల 20వ తేదీ నుంచి 30 వరకు ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇంటింటికీ వెళ్లి ప్రతి కుటుంబం నుంచి బీమా దరఖాస్తులు సేకరిస్తారని తెలిపారు. తహసీల్దార్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు కూడా దరఖాస్తులు తీసుకుంటారని మంత్రి వెల్లడించారు. గురువారం సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా జరిగింది. సమావేశం అనంతరం మంత్రివర్గ తీర్మానాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వివరించారు. దీపావళి పండుగ సందర్భంగా ఈసారి ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని మంత్రివర్గం ఏకగ్రీవంగా తీర్మానించిందని మంత్రి తెలిపారు. మంత్రులు, ఎంఎల్ఏలు తమ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే రెండు లక్షల ఇరవై ఐదు వేల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయిందని, నిర్మాణం పూర్తయిన ఇళ్లలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి వెల్లడించారు.
ఉమ్మడి ఎస్సీ, ఎస్టీ కమిషన్ రద్దు
రాష్ట్రంలో ప్రస్తుతమున్న ఉమ్మడి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను రద్దు చేసి.. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేయాలని మంత్రిమండలి నిర్ణయించిందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందుకు సంబంధించి తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ యాక్ట్ - 2003ను రద్దు చేసేందుకు ఆమోదం తెలిపిందన్నారు. ప్రతి కమిషన్‌లో ఒక చైర్మన్, ఐదుగురు సభ్యులు ఉంటారని, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని మంత్రి వివరించారు. అలాగే, తెలంగాణ ఫైర్ సర్వీస్ యాక్ట్, 1999 సవరణకు సంబంధించిన ఆర్డినెన్స్ జారీకి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ‘అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం, ప్రమాదాలకు కారణాలను గుర్తించడం, వేగంగా స్పందించడం వంటి అంశాలు ఇందులో ఉంటాయి. ఇళ్లు, అపార్ట్మెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్‌ల యజమానులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్నిమాపక శాఖ చేపట్టాల్సిన చర్యలను ఇందులో పొందుపరుస్తారు’ అని పొంగులేటి తెలిపారు. అలాగే, తెలంగాణ సర్వే, సరిహద్దుల చట్టం, 1923లోని సెక్షన్ 12(ఏ) సవరణ ప్రతిపాదనకు కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు. సర్వే, సరిహద్దులకు సంబంధించి జారీచేసే నోటీసులపై అప్పీల్ చేసుకునే కాలపరిమితిని 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసినట్టు చెప్పారు.
136 జ్యుడీషియల్ పోస్టుల మంజూరుకు ఆమోదం
రాష్ట్రంలోని పలు కోర్టులకు మొత్తం 136 జ్యుడీషియల్ పోస్టుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పొంగులేటి తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో కొత్తగా ఏర్పాటైన జూనియర్ సివిల్ జడ్జి కమ్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి కోర్టులకు 56 పోస్టుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. అలాగే, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని నాలుగు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కమ్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టుల్లో వివిధ విభాగాలకు మరో 80 పోస్టుల మంజూరుకు ఆమోదం లభించిందన్నారు. ఈ నెల 7 నుంచి 9 వరకు కొడంగల్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని మంత్రి తెలిపారు. 9న కొడంగల్‌లో భారీ రైతు బహిరంగ సభ నిర్వహిస్తున్నారని, ఈ సభలో ముఖ్యమంత్రి, మంత్రులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొంటారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో దెబ్బతిన్న మూడు బ్యారేజీల పునరుద్ధరణపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. మీడియా సమావేశంలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.