Telangana Graduate MLC Elections 
తెలంగాణ

పట్టభద్రుల ఓటు ఎటు వైపు?

నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, జనసేన ఓటర్ల నమోదుపై దృష్టి సారించాయి.

Ranjith

ప్రభాత ఉదయం బ్యూరో, హనుమకొండ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నవంబర్ 6 వరకు పట్టభద్రుల ఓటర్ల నమోదు కొనసాగనుండగా, కొత్తగా నమోదయ్యే ఓటర్లే ఈసారి ఎన్నికల్లో కీలకంగా మారనున్నారు.

ఆ దరఖాస్తులు తిరస్కరించొద్దు..

ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పరిధిలో ఈ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన పట్టభద్రులు ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 25న ముసాయిదా జాబితా ప్రకటించి, అభ్యంతరాల స్వీకరణ అనంతరం డిసెంబర్ 30న తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు. ఓటరు గుర్తింపు కార్డు నంబరు లేకున్నా అర్హులైన పట్టభద్రుల దరఖాస్తులను తిరస్కరించవద్దని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అక్టోబర్ 13న స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, జనసేన పార్టీలు ఓటర్ల నమోదును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అర్హులను గుర్తించి ఓటర్లుగా నమోదు చేయించేందుకు ప్రత్యేక సమన్వయకర్తలను నియమిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 325 మంది సమన్వయకర్తలను నియమించగా, కాంగ్రెస్ తరఫున ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

కాంగ్రెస్ అభ్యర్థిగా సర్వోత్తమ్‌రెడ్డి

అధికార కాంగ్రెస్ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. పార్టీ అధిష్ఠానం సెప్టెంబర్ 29న రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఆమోదించింది. తొలుత గుత్తా అమిత్‌రెడ్డి, పీవీ శ్రీనివాస్, లోకేశ్ యాదవ్, చనగాని దయాకర్ తదితరులు టికెట్ ఆశించినప్పటికీ చివరకు సర్వోత్తమ్‌రెడ్డి పేరును ఖరారు చేసింది. అక్టోబర్ 10న ఖమ్మంలో నిర్వహించిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పార్టీ శ్రేణులు ఆయన విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

రాకేశ్‌రెడ్డికి మరో అవకాశం?

ఉప ఎన్నికలో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. గత ఉప న్నికలో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అనుగుల రాకేశ్‌రెడ్డి మరోసారి బరిలో నిలిచే అవకాశాలున్నాయి. అధికారిక ప్రకటన వెలువడకముందే ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తూ పట్టభద్రులను కలుస్తున్నారు. ప్రభుత్వంపై పట్టభద్రుల్లో ఉన్న అసంతృప్తి తమకు అనుకూలంగా మారుతుందని ఆశిస్తోంది.

జనసేన అభ్యర్థితో కొత్త సమీకరణాలు

మాజీ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావును జనసేన అభ్యర్థిగా ప్రకటించడంతో ఎన్నికల సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. జనసేన ఎన్డీఏలో భాగస్వామి కావడంతో బీజేపీతో సీట్ల సర్దుబాటు ఉంటుందా? అనే చర్చ మొదలైంది. అక్టోబర్ 4న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు ఈ అంశంపై జనసేనతో చర్చిస్తామని వెల్లడించారు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి మరోసారి బరిలో ఉంటారా? లేక జనసేన అభ్యర్థికి మద్దతు ఇస్తారా? అన్నది తేలాల్సి ఉంది. రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తే ఓట్ల చీలిక ఎవరికి లాభిస్తుందన్నది కీలకంగా మారనుంది.

కీలకంగా మారిన ఓటరు నమోదు

కాంగ్రెస్‌కు అధికార బలం, ప్రభుత్వ యంత్రాంగంతో సంబంధాలున్న ప్రజాప్రతినిధుల సహకారం కలిసివచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేకతను బీఆర్ఎస్ ఓట్లుగా మలుచుకోవాలని చూస్తోంది. పట్టణ ప్రాంతాలు, విద్యావంతుల మద్దతును బీజేపీ అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తోంది. జనసేన అభ్యర్థి పోటీలో కొనసాగితే ఓట్ల చీలిక ఏ పార్టీకి లాభిస్తుందన్నది కూడా కీలకంగా మారనుంది.  మొత్తంగా నల్గొండ-ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక అధికార కాంగ్రెస్ పాలనకు పరీక్షగా, బీఆర్ఎస్ పునరాగమన ప్రయత్నాలకు అవకాశంగా, బీజేపీ రాజకీయ విస్తరణకు వేదికగా మారనుంది.